“ఓయుకు వేళ్ళేందుకు ధైర్యం ఎందుకు .. అభిమానం ఉంటే చాలంటూ తాను బదులిచ్చినట్లు సీఎం పేర్కొనడంతో విద్యార్థులనుండి చప్పట్ల రూపంలో స్పందన కనిపించింది. ‘నా తమ్ముళ్ళు ఉన్న కాలేజీకి వెళ్ళేందుకు భయపడాల్సిందేముంది’. మా తమ్ముళ్ళు అడుగుతున్నది స్వేచ్ఛ. గత పాలకులు ఇవ్వలేని స్వేచ్ఛను నేను వారికి కల్పిస్తున్న. వారిపై ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడే పోరాటం పుట్టుకు వస్తుంది. తొలిదశ తెలంగాణ ఉద్యమం పుట్టింది అట్లనే, మాలి దశ పుట్టింది కూడా ఉస్మానియా నుండే. వారి స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా ఉస్మానియాను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలన్నదే నా సంకల్పం. దానికోసం పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు. సంకల్ప బలంఉంటే చాలు ..”
సరిగ్గా వందరోజుల్లోనే ఓయు కు రెండవసారి
‘‘డిసెంబర్‌లో ఆర్ట్స్ కళాశాలలో మీటింగ్ పెట్టండి. నేను వస్తా.. ఎవరు అడ్డుకుంటారో చూస్తా.. ఏం.. ఉస్మానియాకు ఎందుకు రావద్దు’ అంటూ ఛాలెంజి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నట్లుగానే వందరోజుల్లో రెండవసారి యూనివర్శిటీకి వచ్చి తన మాట నిలబెట్టుకున్నారు. అయితే విపక్షాలు చాలెంజీ చేసినట్లు పోలీసు బందోబస్తు లేకుండా ఒంటరిగా రాలేకపోయారు. ఆయన వద్దన్నా సెక్యూరిటీ సిబ్బంది తప్పకుండా తమ విధిని నిర్వహించకుండా ఉండరు. బుధవారం సీఎం రాకను పురస్కరించుకుని ఉదయంనుండే పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఏదిఏమైనా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కేవలం నాలుగునెలల కాలంలో రెండవసారి సిఎం హోదాలో రేవంత్‌రెడ్డి రావడం విశేషం.
గత ముఖ్యమంత్రులు రాజశేఖర్‌రెడ్డి, కేసీఆర్‌లు యూనివర్శిటీకి వచ్చినప్పటికీ రేవంత్‌రెడ్డి లాగా విద్యార్ధులతో సమావేశం కాలేకపోయారు. రేవంత్‌రెడ్డి మొదటిసారిగా ఆగస్టు 25న యూనివర్శిటీలో కొత్తగా నిర్మించిన హాస్టల్ భవనాన్ని ప్రారంబించడంతోపాటు, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, లైబ్రరీ రీడిరగ్ రూమ్‌లకోసం నిర్మించనున్న భవనాలకు శంఖుస్థాపన చేశారు. ఆ సందర్భంగా విపక్షాలు ఆయన్ను తీవ్రంగా విమర్శించాయి. ఉస్మానియాలో నెలకొన్న అనేక సమస్యలకారణంగా విద్యార్ధులు చాలాకాలంగా అసంతృప్తితో ఉన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ వారు గత ముఖ్యమంత్రుల రాకను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఆగస్టులో సీఎం రేవంత్‌రెడ్డి రాక సందర్భంగాకూడా అలాంటి బందోబస్తునే నిర్వహించారు.
ఇనుప కంచెలు వేసి విద్యార్ధులు రాకుండా అడ్డుకున్నారు. దీంతో చాతనైతే ఉస్మానియాకు పోలీసు బందోబస్తు లేకుండా రావాలని విపక్షాలు రేవంత్‌రెడ్డిని సవాల్ చేశాయి. ఆసందర్భంగా తాను డిసెంబర్‌లో తప్పకుండా వచ్చి, విద్యార్ధుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్ధులు అడిగే ప్రతీ విషయానికి సమాధానం చెప్పగలిగే చిత్తశుద్ధి తనవద్ద ఉందని ఆనాడే పేర్కొన్నారు. అన్నట్లుగానే బుధవారం ఆయన ఉస్మానియా యూనివర్శిటీకి రావడమేకాకుండా, గతంలో హామీ ఇచ్చిన మేరకు యూనివర్శిటీ అభివృద్ధికి ఇస్తానన్న వెయ్యి కోట్ల రూపాయల నిధులకు సంబందించిన జిఓ ను వైస్‌చాన్స్‌లర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటుచేసిన ‘సర్వం సిద్ధం’ సభలో విద్యార్ధులను ఆకట్టుకునే విధంగా ప్రసంగించారు. ‘యూనివర్శిటికి వెళ్ళేందుకు మీరు దైర్యం చేస్తున్నారని’ కొందరు తనను ఆపే ప్రయత్నం చేశారన్న విషయాన్ని చెబుతూ.. ఓయుకు వేళ్ళేందుకు ధైర్యం ఎందుకు .. అభిమానం ఉంటే చాలంటూ తాను బదులిచ్చినట్లు సీఎం పేర్కొనడంతో విద్యార్థులనుండి చప్పట్ల రూపంలో స్పందన కనిపించింది.
‘నా తమ్ముళ్ళు ఉన్న కాలేజీకి వెళ్ళేందుకు భయపడాల్సిందేముంది’. మా తమ్ముళ్ళు అడుగుతున్నది స్వేచ్ఛ. గత పాలకులు ఇవ్వలేని స్వేచ్ఛను నేను వారికి కల్పిస్తున్న. వారిపై ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడే పోరాటం పుట్టుకు వస్తుంది. తొలిదశ తెలంగాణ ఉద్యమం పుట్టింది అట్లనే, మాలి దశ పుట్టింది కూడా ఉస్మానియా నుండే. వారి స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా ఉస్మానియాను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలన్నదే నా సంకల్పం. దానికోసం పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు. సంకల్ప బలంఉంటే చాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగం విద్యార్దులను ఆకట్టుకుంది. నల్లమలలో పుట్టి పెరిగినోడ్ని. పెద్దగా చదువుకోకపోయినా ప్రజల మనస్సు తెలుసుకునే విద్య నాకు తెలుసు.
కింది స్థాయినుండి రాజకీయాల్లో ఎదిగినవాడిని. జడ్‌పిటీసి, ఎంఎల్సీ, ఎంఎల్యే, ఎంపి బాధ్యతలు నిర్వహించి, మీ అందరి అభిమానంతో ఇప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నవాడిని, ఏ మనిషికైనా ఇంతకన్నా గొప్ప అవకాశం ఏముంటుంది. అయితే ఉన్నంత కాలంలో రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నదే నా ఆకాంక్ష. ముఖ్యంగా పేద విద్యార్ధులను దృష్టిలో పెట్టుకుని, వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దగలిగే విద్యాప్రమాణాలను ఏర్పాటు చేయాలన్నదే తన సంకల్పంగా ఆయన చెప్పుకొచ్చారు. ఆంతర్జాతీయ విద్యా ప్రమాణాలను, పరిశోధనలను దృష్టిలో పెట్టుకుని వెయ్యికోట్ల నిధులతో నూతన హాస్టల్స్, లాకాలేజీ, భారీ ఆడిటోరియం లాంటి కొత్త నిర్మాణాలను చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. పోరాటాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఉస్మానియా చారిత్రక భవనాలకు ఎలాంటి విఘాతం కలుగకుండా కొత్త భవనాలను ఏర్పాటుచేస్తామని, అలాగే క్యాంపస్ పరిధిలోని అడవిని పరిరక్షించే బాధ్యత తీసుకుంటామంటూ ఆయన మాటలకు విద్యార్ధులనుండి మంచి స్పందన కనిపించింది.





