~ ఎన్నికల కేసును కొట్టివేసిన హైకోర్టు
హైదరాబాద్, ఆగస్టు 11: సిఎం రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. 2019 అక్డోబర్‌లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పీఎస్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని నమోదైన ఈ కేసును కొట్టేయాలని రేవంత్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ కె.లక్ష్మణ్ కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలావుంటే రేవంత్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో పిటిషన్ దాఖలు చేసిన పెద్దిరాజుకు సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసమి భట్టాచార్యకు అఫిడవిట్ రూపంలో క్షమాపణలు చెప్పాలని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఆదేశించింది. రేవంత్‌రెడ్డిపై పెద్దిరాజు దాఖలు చేసిన కేసును గతంలో తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఆ కేసును నాగ్‌పూర్ బెంచ్‌కు బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో పెద్దిరాజు ట్రాన్స్‌ఫర్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో హైకోర్టు న్యాయమూర్తిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. పిటిషన్ డ్రాప్ట్ చేసిన ఏఓఆర్, పెద్దిరాజుపై సీజేఐ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసమి భట్టాచార్యకు క్షమాపణలు చెప్పాలని తెలిపింది. క్షమాపణ చెపుతూ దాఖలు చేసే అఫిడవిట్‌పై నిర్ణయాన్ని జస్టిస్ మౌసమి భట్టాచార్యకు వదిలేసింది. వారం రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని పెద్దిరాజుకు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.



