రేషన్‌ కార్డు పేదోడి ఆత్మగౌరవం

– ఈ ప్రాంతానికి దేవాదుల నుండి గోదావరి జలాలు తరలిస్తాం
– ఆడపడుచులను ప్రభుత్వరంగ సంస్థలకు యజమానులను చేశాం
– స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం అమలయ్యేలా చూస్తాం
– తుంగతుర్తిలో రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్‌

తుంగతుర్తి, ప్రజాతంత్ర, జులై 14: తెలంగాణలోని ప్రతి పేదవాడి ఆకలి తీర్చడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, అందుకోసం పేదలకు రేషన్‌ కార్డు ఓ ఆయుధంగా ఉపయోగపడుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. గత పదేళ్లలో ఏ ఒక్క పేద కుటుంబానికీ రేషన్‌ కార్డు ఇవ్వలేని దద్దమ్మలు నేడు ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సోమవారం జరిగిన నూతన రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రేవంత్‌ రెడ్డి వేదిక వద్దకు చేరుకోగానే పార్టీ అభిమానులు జై కాంగ్రెస్‌, జై రేవంత్‌ అంటూ జోరుగా నినాదాలు చేయగా తెలంగాణ గీతాలాపనతో సభ ప్రారంభమయింది. ఈ సందర్భంగా ఆయన సీఎం తాను మొదటగా తుంగతుర్తికి ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో వర్షం వచ్చిన, కరెంటు లేకుంటే సెల్‌ఫోన్‌ లైట్లతో సభలో పాల్గొన్న అంటూ తుంగతుర్తి ప్రజలకు హృదయ పూర్వక ధన్యవాదాలు చెప్పారు. నాడు బీంరెడ్డి నర్సింహారెడ్డి మొదలు ఎందరో నాయకులు సాయుధ పోరాటానికి ఊపిరిలూదారని గుర్తు చేశారు. అందుకే ఈ ప్రాంతం ఎర్రగొండగా సంధించారు. కాంగ్రెస్‌ పార్టీ కట్టిన నాగార్జున సాగర్‌, శ్రీశైలం, భీమా, కోయిల్‌ సాగర్‌, జూరాల, ఎస్‌ఆర్‌ఎస్‌, మూసీ ఎలా ఉంది.. మీరు కట్టిన కూలేశ్వరం ఎలా ఉందో చర్చ చేద్దామా అని ప్రత్యర్థులకు సవాలు విసిరారు. దేవాదుల ప్రాజెక్టు నుండి గోదావరి జలాలను తరలించి ఈ సూర్యాపేట,తుంగతుర్తి ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి, కాల్వ, ఎస్‌ ఎల్‌ బిసి టెన్నేల్‌ ఇంకేదైనా కావచ్చను వాటన్నింటినీ పూర్తి చేస్తామని చెప్పారు.నల్లగొండ తులసి వనంలో ఎకలింగం గంజాయి మొక్కలా మొలిచిందిని స్థానిక నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. రూ.50 వేలతో తుంగతుర్తికి వచ్చిన మందుల సామేల్‌ ని సుమారు 60 వేల మెజార్టీతో గుండెల్లో పెట్టుకొని ఇక్కడలు ప్రజలు గెలిపించారన్నారు.అందుకు నియోజక వర్గాల ప్రజల కష్టసుఖాల్లో ఎమ్మెల్యే పాలు పంచుకోవాలనీ అందరిని కలుపుకు పోవాలనీ సూచించారు.ఇక్కడ ఏ సమస్య ఉంటే వచ్చినా మంత్రి ఉత్తమ్‌,ఎంపి చామలతో కలిసి పని చేసుకోవాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీమ్ములను గెలిపించే బాధ్యతను కాంగ్రెస్‌ పార్టీ తీసుకుంటుందని,త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని కార్యకర్తలనుద్దేశించి చెప్పారు.4 ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌ పార్టీకి ఇస్తే 3 మీకే ఇచ్చినమని,నల్లగొండ పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలుగా పార్టీ చూసుకుంటుందని బరోసా ఇచ్చారు. 2034 వరకు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంటుందని, రాబోయే పదేళ్లలో ఎవ్వడు ఎడ్చిన ఇందిరమ్మ రాజ్యం, రైతు రాజ్యం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, వందేళ్ల తరువాత జనగణనలో కులగణన చేసి దేశానికే ఆదర్శంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిలిచిందన్నారు. అంతేకాక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం అమలు చేసేలా పరిపాలన సాగిస్తున్నామని 40 నిమిషాలపాటు సాగిన సీఎం ప్రసంగంలో వెల్లడిరచారు.

నూతన ప్రభుత్వ భవనాలకు శంకుస్థాపనలు

తిరుమలగిరిలో సభా ప్రాంగణానికి చేరుకోవడానికి ముందు పలు ప్రభుత్వ నూతన భవనాలకు రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అందులో యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని అడ్డగూడూరు మండల తహసిల్దార్‌ కార్యాలయ నూతన భవన నిర్మాణం కోసం రూ.3.75 కోట్లు, మండల ప్రజా పరిషత్‌ భవన నిర్మాణానికి రూ.4 కోట్లు, అడ్డగూడూరు పోలీస్‌ స్టేషన్‌ భవన నిర్మాణానికి, నాగారం తహసిల్దార్‌ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి, మండల ప్రజా పరిషత్‌ భవన నిర్మాణానికి, అడ్డగూడూరు పోలీస్‌ స్టేషన్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం తుంగతుర్తి మండలంలోని వెలుగుపల్లిలో 10వేల మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యం కలిగిన గోదాము నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనాల కోసం శంకుస్థాపన చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్‌ అధ్యక్షత జరిగిన ఈ సభలో నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి నలమమాద ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి అడ్లూరి లక్ష్మణ్‌, ఎంపీలు చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, రఘువీర్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌లు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, డోర్నకల్‌ ఎమ్మెల్యే రామచందర్‌ నాయక్‌, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, బాలు నాయక్‌, కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి, జయవీర్‌ రెడ్డి, యశస్వినిరెడ్డి శంకర్‌ నాయక్‌, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్‌, బలరాం నాయక్‌, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *