– ఎవరికీ పట్టని రైతుల కష్టాలు
– ప్రతి గింజనూ మద్దతు ధరకు కొనాల్సిందే
– బీఆర్ఎస్ నేత హరీశ్ రావు డిమాండ్
సదాశివపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: కోటా సాకుతో శనగలు, మక్కలు, జొన్నల కొనుగోళ్లు నిలిపివేసి రైతులను నిలువునా ముంచుతున్నారని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు ఆరోపించారు. సదాశివపేట రైతు సేవా కేంద్రంలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సోమవారం సందర్శించారు. కోటా అయిపోయిందంటూ కొనుగోళ్లు నిలిపివేయడంతో వారం రోజులుగా అక్కడే పడిగాపులు కాస్తున్న రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఎందుకు కొనుగోలు చేయడం లేదని అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు లేక పంట దళారుల పాలవుతున్నదని, శనగలపై ఎకరానికి రూ.10 వేల నష్టం వాటిల్లిందని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన బోనస్ హామీ పూర్తిగా బోగస్ అని, నేడు కనీస మద్దతు ధరకూ దిక్కులేదని వ్యాఖ్యానించారు. ఏటిగడ్డ సంఘం తదితర గ్రామాల రైతులు శనగలు కొనడం లేదని తమ దృష్టికి తేవడంతో ఇక్కడి డీసీఎంఎస్ సెంటర్‌కు వచ్చామని, రైతులను, నిర్వాహకులను అడిగితే కోటా అయిపోయిందని చెబుతున్నారని తెలిపారు. ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వమన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు గల్లీకి ఎక్కువ.. దిల్లీకి తక్కువ అన్నట్లుగా తయారయ్యారు.. గాలి మోటార్లలో కేరళ, దిల్లీ పర్యటనలు చేస్తూ బిజీగా ఉన్న వారికి రైతుల కష్టాలు పట్టడం లేదని ఎద్దేవా చేశారు. సదాశివపేటలో కొత్తగా శనగలు కొనకపోగా, ఇప్పటికే కొన్న వాటికి బిల్లులు కావడం లేదన్నారు. బస్తాలు ఖాళీ చేసి రైతులకే వెనక్కి ఇచ్చేస్తున్నారని, వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నామని మొగలయ్య లాంటి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలన్నారు. మార్కెటింగ్ శాఖ మంత్రి, సివిల్ సప్లైస్ మంత్రి, ముఖ్యమంత్రి ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 60 వేల క్వింటాళ్ల శనగలు రైతుల దగ్గర ఉన్నాయి.. వెంటనే రూ.5870 మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులు బయట అమ్ముకుని క్వింటాల్ కు రూ.1000 చొప్పున, ఎకరానికి రూ.10 వేలు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో మక్కజొన్న పండితే సగం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం కాలేదు.. సంచులు లేవని టోకెన్లు ఆపేశారని రైతులు చెబుతున్నారు.. మద్దతు ధర రూ.2400 ఉంటే రూ.1600-1700లకే అమ్ముకుని రైతులు నష్టపోతున్నారు అని వివరించారు. జొన్నల కొనుగోలుపై ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయమే తీసుకోలేదన్నారు. ఆరుగాలం కష్టపడ్డ రైతులు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లి సగం ధరకే జొన్నలు అమ్ముకునే దుస్థితి వచ్చిందని, వడ్లు కూడా రోడ్ల మీదనే ఉన్నాయని తెలిపారు. ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్‌లో ప్రతి పంటకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు ఆ మాటను బోగస్ చేసిందన్నారు. మక్కలు, కందులు, శనగలు, జొన్నలకు బోనస్ ఇవ్వడం లేదంటూ కనీసం సన్న వడ్లకైనా ఈ యాసంగిలో బోనస్ ఇస్తారా లేదా అనేది స్పష్టం చేయాలన్నారు. ముఖ్యమంత్రి టూర్లు ఆపి రైతుల కష్టాల మీద సమీక్షించాలని హితవు పలికారు. భూములు, కాంట్రాక్టులు, కమీషన్ల మీద రివ్యూలు చేస్తారు తప్ప గరీబ్ రైతుల కోసం మీకు సమయం దొరకదా అని నిలదీశారు. కొనుగోళ్లు ఆగిపోయాయన్న కనీస సమాచారం ఇంటెలిజెన్స్ మీకు చెప్పడం లేదా అన్నారు. ఇక్కడ మల్లేశం అనే రైతు చెబుతున్నాడు.. రోజుకు 10 గంటల కరెంటే ఇస్తున్నారని. పొద్దున ఎనిమిదింటికి కరెంటు వస్తోందని రైతులు వాపోతున్నారు. కరెంటు ఇవ్వరు, రైతుబంధు వేయరు, బోనస్ ఇవ్వరు, పండిన పంటను మద్దతు ధరకు కొనరు.. మీ ప్రభుత్వం రైతుల కోసమా? లేక కాంట్రాక్టర్లు, దళారుల కోసమా అని అడిగారు. ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి జొన్నలు, పొద్దుతిరుగుడు, వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, కోటా పేరుతో ఆగిపోయిన శనగల కొనుగోలును వెంటనే మొదలుపెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వెంటనే కేంద్రాలు తెరిచి సన్న వడ్లకు గత యాసంగితోపాటు, ఈ యాసంగి బోనస్ కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. హరీశ్ రావు వెంట సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





