– యూత్ కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రావ్య
సూర్యాపేట, ప్రజాతంత్ర, జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న సీఎం కప్-2026 క్రీడా పోటీలను జిల్లాలోని యువత పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలని యూత్ కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షురాలు సంకరమద్ది శ్రావ్యసుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆమె మీడియాతో శుక్రవారం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని, గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా గ్రామీణ క్రీడాకారులకు ప్రాధాన్యతనిస్తూ ఈ పోటీలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. సీఎం దార్శనికత వల్లే నేడు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఐదు అంచెలలో పారదర్శకంగా పోటీలు జరుగుతున్నాయని, యువత పట్ల ఆయనకున్న అపారమైన నమ్మకానికి ఇది ఒక నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యంగా క్రీడాకారుల ఆర్థిక భరోసా కోసం ప్రభుత్వం భారీ నగదు బహుమతులను ప్రకటించడం విశేషమని, ఇది పేద క్రీడాకారులకు కొండంత అండగా నిలుస్తుందని తెలిపారు. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా రాష్ట్రంలో ‘యువ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేస్తూ, తెలంగాణ బిడ్డలు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని తెలియజేశారు. స్వతహాగా క్రీడాకారుడు సీఎంగా ఉండటం ఎంతో సంతోషకరమని, అలాంటి డైనమిక్ నాయకత్వంలో రాష్ట్రం క్రీడా హబ్‌గా మారుతుందన్న అశాభావాన్ని శ్రావ్య వ్యక్తం చేశారు. అదేవిధంగా సూర్యాపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాటలో నడుస్తూ యువతలో క్రీడా స్పూర్తిని రగిలించేందుకు ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డిలు క్రీడాకారులను ఎంతగానో ప్రోత్సహిస్తున్నట్లు గుర్తు చేశారు. జిల్లా క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లా కీర్తిని రాష్ట్రస్థాయిలో చాటాలని ఆకాంక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



