పాశమైలారం ప్రమాదంపై ప్రముఖుల దిగ్భ్రాంతి

~ మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ, గవర్నర్‌ జిష్ణుదేవ్‌,

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌, మంత్రి లోకేష్‌ సానుభూతి
~ పీఎంఆర్‌ఎఫ్‌ ప్రకటన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30 : పాశమైలారంలో కెమికల్‌ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌, ఆ రాష్ట్ర మంత్రి లోకేష్‌ తీవ్ర వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌ వేదికగా తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రసాయన పరిశ్రమలో పేలుడు సంభవించి కార్మికులు మృతిచెందడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే పీఎంఆర్‌ఎఫ్‌ ఫండ్‌ నుంచి మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రధాని మోదీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ‘తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డిలో ఒక కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో చాలామంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతుల బంధువులకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ఎక్స్‌గ్రేషియా అందిస్తాము’ అని ప్రధాని మోదీ ప్రకటించారు.

గవర్నర్‌ విచారం

పాశమైలారం దుర్ఘటనలో 12మంది మృతిచెందడం పట్ల గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్‌ సెక్రటరీ దానకిషోర్‌ ద్వారా ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాణాలు కోల్పోయిన 12మంది కార్మిక కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

విచారం వ్యక్తం చేసిన కేసీఆర్


పాశమైలారంలోని ఒక పరిశ్రమలో పలువురు కార్మికులు మృతి చెందడం పట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తంచేస్తూ తన సంతాపాన్ని ప్రకటించారు. మృతుల సంఖ్య ఇంకా పెరగనున్నదనే వార్తల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణాలపై విచారణ జరిపించాలని, గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందించాలని, చనిపోయిన కార్మికులు ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి కేసీఆర్ సూచించారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

12మంది మృతికి కారణమిదే : నిర్ధారించిన అధికారులు

పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో 12మంది మృతిచెందడానికి గల అసలు కారణం ఏంటో తేల్చారు అధికారులు. ఈ ప్రమాదం రియాక్టర్‌ పేలడం వల్ల కాదని.. వేడి గాలి, అధిక ఒత్తిడి వల్లే భారీ పేలుడు సంభవించిందని నిర్ధారించారు. పరిశ్రమలో మైక్రో సెల్యులస్‌ పౌడర్‌ తయారు చేస్తున్న క్రమంలో బాయిలర్‌ నుంచి వచ్చే వేడి గాలికి పైప్‌ లైన్‌ వ్యవస్థలో ఆటంకాలు ఏర్పడి పేలుడు సంభవించినట్లు తెలిపారు. వేడి గాలి తాకిడికి భవనం కుప్పకూలిందన్నారు. పేలుడు ధాటికి గోడలు బద్దలై పరిశ్రమలోకి వస్తున్న ప్లాంట్‌ ఇన్‌చార్జిపై పడి అక్కడికక్కడే మృతిచెందినట్లు చెప్పారు. భవన శకలాలు చుట్టుపక్కల పరిశ్రమలోకి దూసుకెళ్లాయన్నారు. పరిశ్రమలో రియాక్టర్లు భద్రంగానే ఉన్నట్లు అధికారులు తేల్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *