చిన్నారుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత

– వారి భవిష్యత్తు రక్షణకు సమాజం కృషి చేయాలి
– మహిళ, చిన్నారుల భద్రత కోసం త్వరలో నూతన పాలసీ
– సీఐఐ కార్యక్రమంలో మంత్రి సీతక్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13: చిన్నారుల రక్షణను తమ ప్రజా ప్రభుత్వం ప్రధాన బాధ్యతగా భావిస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. పిల్లలు అంటే మన భవిష్యత్తు.. వారి రక్షణ అంటే మన భవిష్యత్తు రక్షణ అని చెప్పారు. నగరంలోని ఓ హోటల్‌లో సీఐఐ, యంగ్‌ ఇండియన్స్‌ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మాసూమ్‌ సమ్మిట్‌ 10వ వార్షికోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా చిన్నారుల భద్రత, మహిళల రక్షణ, పోషకాహారం, మహిళా సాధికారత వంటి కీలక అంశాలపై ప్రసంగించారు. పసి హృదయాల్లో నాటుకుపోయే భావనలే వారి జీవితాన్ని నిర్దేశిస్తాయని, చిన్నారి గాయపడితే ఆ గాయం జీవితాంతం వెంటాడుతుందని, అందుకే పిల్లలు నిర్భయంగా, స్వేచ్ఛగా, ధైర్యంగా జీవించే వాతావరణాన్ని కల్పించడం సమాజం బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. చిన్నారుల పోషకాహారంపై దృష్టి సారిస్తూ ఈ నెల 17 నుంచి అక్టోబర్‌ 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా పోషణ మాసం నిర్వహించనున్నట్లు తెలిపారు. పిల్లల్లో పౌష్టికాహారం పెంపొందించేందుకు పరిశోధనలు జరిపి అంగన్‌వాడీ మెనూలో మార్పులు చేశామన్నారు. పౌష్టికాహారం ప్రాధాన్యతపై నెల రోజులపాటు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. మహిళా భద్రతపై మాట్లాడుతూ ఈ నెల 22న మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, ఉన్నతాధికారులు పాల్గొనేలా మహిళా సదస్సు నిర్వహిస్తున్నామని, వారి అభిప్రాయాల ఆధారంగా కొత్త పాలసీ తీసుకురాబోతున్నామని ప్రకటించారు. లైంగిక నేరాల నియంత్రణలో కేవలం శిక్షలకే పరిమితం కాకుండా శిక్షణ కార్యక్రమాలు కూడా ఉండాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఆడవారిని గౌరవించాలని తరగతి గదిలోనే నేర్పాలన్నారు. గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ వంటి అంశాలపై ఇళ్లల్లో, పాఠశాలల్లో, గ్రామాల్లో తప్పనిసరిగా చర్చ జరగాలని సూచించారు. అంగన్‌వాడి కేంద్రాల ప్రాముఖ్యతను గుర్తు చేసిన ఆమె 1975లో ఇందిరాగాంధీ ప్రారంభించిన ఈ వ్యవస్థ ఇప్పుడు పోషకాహారంతోపాటు ఆరోగ్యం, ఆనందం, ప్రాథమిక విద్య అందిస్తున్నదని వివరించారు.
చిన్నారుల అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. డ్రగ్స్‌ నియంత్రణకు సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో పోలీస్‌ శాఖలో ప్రత్యేక నార్కోటిక్స్‌ విభాగాన్ని ఏర్పాటు చేసి నిఘాను పెంచినట్లు చెప్పారు.
మహిళా సాధికారతపై మాట్లాడుతూ మహిళా సంఘాలను బలోపేతం చేసి వారిని సామాజిక, ఆర్థికంగా బలపరచడం ద్వారా చిన్నారుల రక్షణను సుస్థిరం చేస్తున్నామన్నారు. అంబేద్కర్‌ చెప్పినట్లు మహిళా ప్రగతితోనే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రభుత్వ చర్యల పరంగా హెల్ప్‌లైన్‌లు, కౌన్సెలింగ్‌, ప్రత్యేక బృందాల ద్వారా బాధిత చిన్నారులకు అండగా నిలుస్తున్నామని, పాఠశాలల్లో బాలికలకు స్వీయ రక్షణ శిక్షణ ఇవ్వడం జరుగుతోందని వివరించారు. మాసూమ్‌ కార్యక్రమంపై అభినందనలు తెలుపుతూ పదేళ్లుగా పిల్లల భద్రత కోసం చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. సమాజంలో ఉండే మౌనాన్ని తొలగించి అమ్మాయిల భద్రతను చర్చించే వేదికను సృష్టించారని, తమ ప్రజా ప్రభుత్వం మీతో కలిసి పనిచేసి ప్రతి చిన్నారి భయపడకుండా స్వేచ్ఛగా కలలు కనగల వాతావరణాన్ని నిర్మిస్తుంది అని మంత్రి హామీ ఇచ్చారు. డీజీ శికా గోయల్‌, సీఐఐ ్ణస్టేట్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ శివప్రసాద్‌ రెడ్డి, మాసూమ్‌ యంగ్‌ ఇండియన్స్‌ చైర్‌పర్సన్‌ జ్యోత్న్నా సింగ్‌ అగర్వాల్‌, యంగ్‌ ఇండియన్స్‌ నేషనల్‌ చైర్మన్‌ తరంగ్‌ ఖురానా, మాసూమ్‌ కోచ్‌ భవిన్‌ పాండ్యా తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *