ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమానికి హాజరు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రానున్నారు. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఠాగూర్ ఆడిటోరియంలో “భారత రాజ్యాంగ రూపకల్పనలో బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్” అనే అంశంపై విశిష్టోపన్యాసం చేస్తారు. కార్యక్రమానికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్ నర్సింహ విశిష్ట అతిథిగా హాజరు కానున్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ గౌరవ అతిథిగా, అడ్వకేట్ జనరల్ ఎ. సుదర్శన్ రెడ్డి ప్రత్యేక అతిథిగా పాల్గొంటారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం స్వాగతోపన్యాసం చేస్తారు. ఓయూలో జరిగే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం పిలుపునిచ్చారు. అత్యున్నత హోదా కలిగిన అనేక మంది ఈ కార్యక్రమానికి హాజరవుతున్నందున ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. న్యాయమూర్తులు, న్యాయాధికారులు, న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతోద్యోగులు, అధ్యాపకులు, విద్యార్థులు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు .





