నెల వ్య‌వ‌ధిలో రెండు చెక్ డ్యామ్ ల పేల్చివేత‌

– ఇసుక అక్ర‌మ దందా కోస‌మా?
– జీవ‌నోపాధి కోల్పోయిన మ‌త్స్య‌కారులు
– కూల్చిన చెక్ డ్యామ్‌ల‌ను నిర్మించాలి
– మంథ‌ని మాజీ ఎమ్మెల్యే మ‌ధుక‌ర్‌

జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 18: మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ ల పేల్చివేతలు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రజల సాగు, తాగునీరు సమస్యలు లేకుండా ఉండాలని లక్ష్యంతో  గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు సుమారు రూ.150 కోట్ల వ్యయంతో మానేరు పై 16 చెక్ డాంలను 2022లో అనుమతులు జారీ చేసి 2023 లో పూర్తి చేశారు. మానేరు వాగు లో ప్రవహించే వరద నీరు ఒడిసిపట్టేందుకు నిర్మించిన చెక్ డ్యామ్ల పేల్చివేత వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన నీటి నిల్వ‌ కేంద్రాల ఆనవాళ్లు ఉండకూడద‌న్న దురాలోచనా లేక అక్రమ ఇసుక వ్యాపారం కోసమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజలకు ఉపయోగపడే చెక్ డ్యాముల పేల్చివేత దుర్మార్గమైన చర్య. గత నెలలో పేల్చివేసిన చెక్ డ్యామ్ ఘటనపై నేటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పలు విమర్శలకు దారితీస్తున్న‌ది. చెక్ డ్యాం పేల్చివేత వలన నీటి నిల్వలు తోపాటు మత్స్యకారుల జీవనోపాధి కోల్పోనున్నారు.
గత బి ఆర్ ఎస్‌ పార్టీ హయాంలో మానేరు పై నిర్మించిన రెండు చెక్ డాంలను నెల వ్యవధిలోనే పేల్చివేయడం తీవ్ర విమర్శలకు ఆరోపణలకు దారితీస్తున్నాయి నవంబర్ నెల చివరి వారంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట సమీపంలో తనుగుల వద్ద నిర్మించిన చెక్ డాం ను దుండగులు పేల్చివేశారు ఆ సంఘటన మరవకముందే ఈ నెల 17వ తేదీ బుధవారం ఉదయం పెద్దపెల్లి జిల్లా అడవి సోమనపల్లి వద్ద నిర్మించిన చెక్ డాం జిలెటెన్సిక్స్ పెట్టి పేల్చివేయడం విమర్శలకు దారితీస్తున్న‌ది గత ప్రభుత్వం నిర్మించిన చెక్ డాంలను పేల్చివేసి నీటి నిల్వను లేకుండా చేయడం వెనుక దాగి ఉన్న కుట్రలు వెలికి తీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చెక్ డ్యామ్ లో పేల్చివేత వెనక ఇసుక మాఫియా హస్తం ఉందనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ఈ విషయంపై ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్లు ఉన్నాయి .
కాంగ్రెస్‌ నాయకులు తమ ఇసుకదందాను కొనసాగించుకునేందుకే అడవిసోమన్‌పల్లి మానేరుపై నిర్మించిన చెక్‌డ్యాంను బ్లాస్ట్‌ చేసి కూల్చివేశారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ఆరోపించారు. గురువారం సాయంత్రం కూలిపోయిన అడవిసోమన్‌పల్లి చెక్‌డ్యాంను ఆయన పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు పూర్తిగా బ్లాస్టింగ్‌చేసినట్లుగా కన్పిస్తోందన్నారు. ఎవరిపై వృధాగా ఆరోపణలు చేయడం తమ ఉద్దేశ్యం కాదన్నారు.  ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చెక్ డ్యామ్ ఉంటే ఇసుక తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పినట్లుగానే ఎన్నికల తర్వాత కూల్చివేశారన్నారు. వెంకటాపూర్‌, అడవిసోమన్‌పల్లి, నాగేపల్లి సర్పంచ్‌లు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారు కావడంతో ఈ పని సునాయసంగా చేసి అనుకున్నది నెరవేర్చే అవకాశం దొరికిందని తాను బావిస్తున్నట్లు చెప్పారు. 12లక్షల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహన్ని తట్టుకుని నిలబడ్డ చెక్‌డ్యాం ఈనాడు ఎలాంటి ప్రవాహం లేకుండా కేవలం లక్ష క్యూసెక్కుల నీళ్ల‌కే ఎలా కూలిపోతుందో కాంగ్రెస్‌ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. ఓడేడ్‌ బ్రిడ్జి వద్దకు వెళ్లి నాణ్యతలోపం అని చెప్పిన కాంగ్రెస్‌ నాయకులు ఇప్పటి వరకు ఎలా గ్లడ్డర్లు కూలిపోయాయో నిర్థారించలేదని, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్థారించలేదన్నారు. కేవలం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికి బ్లాస్టింగ్‌లతో ప్రాజెక్టులను కూల్చివేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. చెక్‌డ్యాంలో నీరు సమృద్దిగా ఉండటంతో సుమారు రెండు వందల కుటుంబాలు చేపలు పట్టి జీవనోపాధి పొందారని, రోజుకు వేయి రూపాయలు సంపాదించుకునేవారన్నారు.  భూగర్బజలాలు పెరిగి రైతుల పంటలకు సాగు నీరు అందేదన్నారు. మంథని ఎమ్మెల్యేకు చిత్తశుద్ది ఉంటే ఈ సంఘటనపై పూర్తి విచారణ చేసి దోషులను శిక్షించాలని, వెంటనే చెక్‌డ్యాం పునర్మించాలని ఆయన డిమాండ్‌ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *