చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 31 మంది మావోయిస్టులు మృతి

చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇద్దరు భద్రత సిబ్బంది సైతం మరణించారు. ఆదివారం.. బీజాపూర్ జిల్లాల్లోని ఇంద్రావతి జాతీయ పార్క్ సమీపంలో మావోయిస్టులు సమావేశమయ్యారంటూ భద్రతా దళాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో భద్రతా దళాలు కూబింగ్ చేపట్టాయి. ఈ విషయాన్ని గమనించిన మావోయిస్టులు.. భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు.

దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులకు దిగాయి. దీంతో దాదాపు ఐదు గంటల పాటు ఇరు వైపులా హోరా హోరీ కాల్పులు జరిగాయి. అనంతరం ఘటన స్థలంలో 31 మావోయిస్టుల మృత దేహాలను భద్రత సిబ్బంది గుర్తించారు. అలాగే సంఘటన స్థలంలో ఆయుధాలతోపాటు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఏడాది జనవరి నుంచి నేటి వరకు ఛత్తీస్‌గఢ్‌లో వివిధ ప్రాంతాల్లో.. పలు సమయాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో మొత్తం 81 మంది మావోయిస్టులు మరణించారు.

మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఇద్దరు భద్రతా సిబ్బంది.. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి చెందిన జిల్లా రిజర్వ్ గార్డ్‌తోపాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్‌కు చెందిన వారని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. ఈ కాల్పుల్లో మరో ఇద్దరు గాయపడ్డారని చెప్పారు. వీరిని ఆసుపత్రికి తరలించామన్నారు. అయితే వారికి ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారన్నారు. వారికి మెరుగైన వైద్య చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించామని ఐజీ సుందర్ రాజ్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *