” ప్రభుత్వ బాధ్యతలను కార్పొరేట్ సంస్థలకు ఔట్‌సోర్సింగ్ కింద అప్పగించే రీతిలో గతంలో తీసుకొచ్చిన పి-3 విధానం చాలా విమర్శలకు గురైంది. ఈ పి-3 విధానానికి “ప్రజలు” అనే పదాన్ని చేర్చడం ద్వారా పి-4 విధానంగా మార్చి మెడికల్ కళాశాలలకు వర్తింపజేశారు. నిజంగా ఇదొక దుర్మార్గమైన “కాల్పనిక విజన్” అనే చెప్పాలి. అంతేకాదు సమ్మిళిత అభివృద్ధి పేరుతో ప్రభుత్వాన్ని తన బాధ్యతనుంచి తప్పించడం కూడా. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలను అటకెక్కించడమే కాకుండా, ప్రభుత్వ పనితీరు నత్తకు అన్న రీతిలో ఉన్న తరుణంలో చంద్రబాబు నెత్తికెత్తుకున్న సరికొత్త పల్లవి ఇది. అసలు చంద్రబాబు రాజకీయ కెరీర్ మొత్తం అవకాశ వాద సిద్ధాంతంపైనే నడిచింది, నడుస్తోంది. తాజాగా ఆయన కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న క్రోనీ కేపిటలిజంతో అనుసంధానమై, రాష్ట్రానికి సీఈఓ తరహాపాలన అందిస్తున్నారు. రాష్ట్రాన్ని ఒక నమూనాగా తీర్చిదిద్దే ముసుగులో ఆయన చేస్తున్న నిర్వాకమిది!…”
“పిల్లి తెల్లగా ఉన్నదా లేక నల్లగా ఉన్నదా అనేది ప్రశ్న కాదు. ఎలుకను పట్టిందా లేదా అన్నదే ప్రధానం.
ఎలుకను పట్టుకో గలిగితే అది మంచి సమర్థురాలైన పిల్లిగా గుర్తింపు పొందుతుంది” – డెంగ్ జియావో పింగ్.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనితీరు అనుసరిస్తున్న విధానాలను పరిశీలిస్తే, అభివృద్ధిని విజన్‌ల పేరుతో రంగురంగుల లోకంలో, ఒక కాల్పనిక జగత్తులోకి తీసుకు వెళుతున్నట్టుగా ఉన్నది తప్ప, నలుపు-తెలుపుల్లో నిజమైన అభివృద్ధిని చూపిస్తున్నట్టుగా కనిపించడంలేదు. ఈ ప్రభుత్వం “ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం” పేరుతో ఒక సరికొత్త రంగుల ప్రపంచాన్ని ప్రజలకు చూపించడానికి ప్రయత్నిస్తోంది. గతంలో విపరీతంగా ప్రచారం కల్పించిన “స్వర్ణాంధ్ర” నినాదం స్థానంలో ఇప్పుడు కొత్తగా వూదరకొడుతున్న “సంపద సృష్టి” అనే పదం ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి మరో “నృత్యరూపం” తప్ప మరోటి కాదు. విభజన మిగిల్చిన విధ్వంసం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి మరో పదేళ్లు వెనక్కి వెళ్లిందనేది ప్రజాభిప్రాయం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయగల సత్తా తనకే ఉన్నదని భావించే నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర సారథిగా రెండోసారి అధికారాన్ని చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పేదరికాన్ని ఆయన తన ల్యాప్‌టాప్‌లో వీక్షించే హైటెక్ ముఖ్యమంత్రిగా, తన రాజకీయ మనుగడను పవర్ పాయింట్ ప్రజంటేషన్ల ద్వారా , రాష్ట్ర భవిష్యత్తును అందమైన గ్రాఫిక్‌లతో చూపుతూ, రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం తప్ప మరో మార్గం లేదని చెబుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు “ల్యాప్‌టాప్ బాబు”, “పవర్ పాయింట్ నాయుడు” అనే ముద్దుపేర్లను మూటగట్టుకున్నారు. ఇప్పుడు సంపద సృష్టి అనే అజెండాను ముందుకు తెచ్చి ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించాలన్న దృఢ నిశ్చయంతో ముందుకెళుతున్నారు.
ఇదే సమయంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో, పేదరిక నిర్మూలన, కొత్త ఉద్యోగాల సృష్టి (క్వాంటమ్ టెక్నాలజీ సహాయంతో ఇంటినుంచే సుఖంగా పనిచేయడం), రాష్ట్రాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడం తన లక్ష్యంగా చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏకంగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలనేది ఆయన తీసుకున్న తాజా నిర్ణయం విధానపరంగా “ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి” సరికొత్త నృత్యరూపం (కొరియోగ్రఫీ) తప్ప మరోటి కాదు. గత ఎన్నికల్లో సంక్షేమానికి సంబంధించి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల దస్త్రాన్ని ఇంకా పూర్తిగా అటకమీదనుంచి దింపలేదు. అంటే వీటిల్లో చాలావాటిని ఇంకా అమలు చేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో తానొక విజనరీ నాయకుడని చెప్పుకునే చంద్రబాబు, తాజాగా మెడికల్ కళాశాలలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడమనేది మరో “కాల్పనిక ప్రక్రియ” తప్ప మరోటి కాదు. చంద్రబాబు ప్రవచించే ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో సంపద సృష్టికి ఇదొక అభివ్యక్తీకరణంగా భావించాలి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, రాజకీయ నాయకులు- వాణిజ్య వేత్తల మధ్య సంబంధాల ఆధారంగా కేంద్రం అమలు చేస్తున్న ప్రాజెక్టులతో ముడిపడి ఉంటున్నాయన్నది నిష్టుర సత్యం.
గత పదేళ్లుగా అనుసరిస్తున్న విధానం వల్ల దేశంలో అసమానతలు విపరీతంగా పెరిగిపోయాయి.
ప్రజల పట్ల విశ్వసనీయత, నిజాయతీ అనేవి పూర్తి నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ వైద్య కళాశాలల విషయంలో అమలు చేయబోయే ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం వల్ల వీటిపై ప్రభుత్వ నియంత్రణ నామమాత్ర స్థాయికి దిగజారి, ఫీజులు, నిర్వహణ వంటివి ప్రైవేటు సంస్థల గుత్తాధిపత్యం కిందికి వెళతాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ విధంగా ప్రభుత్వ ఆస్తులను ఒక పద్ధతి ప్రకారం ప్రైవేటు సంస్థలకు అప్పగించడమనేది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరించే క్రోనీ క్యాపిటలిజానికి ప్రతికృతి తప్ప మరోటి కాదు. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా కేంద్రం ఈ ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నది. వ్యాపారం చేయడం ప్రభుత్వం చేసే పనికాదు అనేదే ఈ విధానం. ఇప్పుడు చంద్రబాబు, లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ వైద్య కళాశాలల భవనాలు, భూములను అప్పనంగా ప్రైవేటు సంస్థలకు అప్పగించడంవల్ల, వైద్యం పేదలకు అందుబాటులో లేకుండా పోతుందని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అంటే ఆరోగ్య పరిరక్షణ రంగాన్ని లాభదాయకంగా మార్చే ప్రక్రియలో ప్రభుత్వం తీసుకున్న అత్యంత ప్రమాదకరమైన చర్యగా దీన్ని ప్రతిపక్షాలు వర్ణిస్తున్నాయి. ఈవిధంగా చేయడం పౌరుల హక్కులను ఉల్లంఘించడం తప్ప మరోటి కాదని కూడా స్పష్టం చేస్తున్నాయి.
ఈవిధంగా పెద్ద ఎత్తున ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వల్ల, ప్రజలకు వైద్యం ఎంతమేర అందుబాటులో ఉంటుందనేది ప్రశ్నార్థకమే. అదీ కాకుండా ఆయా సంస్థలు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలకు ఎంతమేర కట్టుబడి ఉంటాయో కూడా తెలియదు. ఈవిధంగా చేయడం వల్ల, ఆయా హాస్పిటల్స్ నిర్వహణ, జీతభత్యాలు, తదితర ఖర్చులకోసం బడ్జెట్ కేటాయింపులు వంటి ఇబ్బందులనుంచి బయటపడవచ్చునని విజనరీ నాయకుడైన చంద్రబాబు భావిస్తుండవచ్చు. ఈ ప్రక్రియను వేగంగా ముగించాలని ఆయన భావించడం వెనుక కారణం కూడా ఇదే అయివుండాలి. మెడికల్ కళాశాలల నిర్వహణ విషయంలో చంద్రబాబు తీసుకొచ్చిన తాజా ప్రభుత్వ-ప్రైవేటు విధానమే ఒక “ప్రభుత్వ విధానం”గా టెలివిజన్ వ్యాఖ్యాతలు వూదరకొట్టవచ్చు.
ఆ విధంగా ఈ ప్రభుత్వ-ప్రైవేటు విధానం, నయా సరళీకృత విధానానికి సంబంధించిన ఒక సువార్తగా విపరీత ప్రచారం పొందుతుంది. ఆ విధంగా రాజ్యం సదుపాయాన్ని కల్పించేదిగా కాకుండా, ప్రైవేటు పెట్టుబడులకు దోహదకారిగా రూపొందుతుంది. ఇప్పుడు చంద్రబాబు సామాజిక బాధ్యతలు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం అనే పదాలను వల్లె వేస్తారు. అదేవిధంగా హక్కులు, సామాజిక న్యాయం స్థానంలో కార్పొరేట్ ఫ్రెండ్లీ, రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే ధనవంతుల దాతృత్వం, సమర్థత వంటి పదాలు చంద్రబాబు మాటల్లో ఎక్కువగా స్థానం పొందుతాయి.
ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో పాటు తాజాగా మెడికల్ కళాశాలలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడమనే ప్రక్రియను చంద్రబాబు ప్రవచించే సరికొత్త పి-4 నమూనాగా పరిగణించాలి. నిజం చెప్పాలంటే ఈ నినాదం డొల్లతనం తప్ప మరొకటి కాదు. ప్రభుత్వ బాధ్యతలను కార్పొరేట్ సంస్థలకు ఔట్‌సోర్సింగ్ కింద అప్పగించే రీతిలో గతంలో తీసుకొచ్చిన పి-3 విధానం చాలా విమర్శలకు గురైంది. ఈ పి-3 విధానానికి “ప్రజలు” అనే పదాన్ని చేర్చడం ద్వారా పి-4 విధానంగా మార్చి మెడికల్ కళాశాలలకు వర్తింపజేశారు. నిజంగా ఇదొక దుర్మార్గమైన “కాల్పనిక విజన్” అనే చెప్పాలి. అంతేకాదు సమ్మిళిత అభివృద్ధి పేరుతో ప్రభుత్వాన్ని తన బాధ్యతనుంచి తప్పించడం కూడా. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలను అటకెక్కించడమే కాకుండా, ప్రభుత్వ పనితీరు నత్తకు అన్న రీతిలో ఉన్న తరుణంలో చంద్రబాబు నెత్తికెత్తుకున్న సరికొత్త పల్లవి ఇది. అసలు చంద్రబాబు రాజకీయ కెరీర్ మొత్తం అవకాశ వాద సిద్ధాంతంపైనే నడిచింది, నడుస్తోంది. తాజాగా ఆయన కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న క్రోనీ కేపిటలిజంతో అనుసంధానమై, రాష్ట్రానికి సీఈఓ తరహాపాలన అందిస్తున్నారు. రాష్ట్రాన్ని ఒక నమూనాగా తీర్చిదిద్దే ముసుగులో ఆయన చేస్తున్న నిర్వాకమిది!
-శామ్ సుందర్





