ఉపాధి హామీ చ‌ట్టంపై కేంద్రం కక్ష 

– పేదల పొట్ట కొట్టడమే బీజేపీ లక్ష్యం
– గాంధీ పేరుతో వచ్చిన చట్టాన్ని చెరిపే యత్నం
– కొత్త చట్టంతో కూలీలకు కష్టాలే
– యూత్‌ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రావ్య సుధీర్‌రెడ్డి

సూర్యాపేట, ప్రజాతంత్ర, జనవరి 9: యూపీఏ ప్రభుత్వంనిరుపేదల సంక్షేమం కోసం  2005 లో రూపొందించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంపై కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం క‌క్షగ‌ట్టింద‌ని యువజన కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షురాలు సంకరమద్ది శ్రావ్య సుధీర్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సూర్యాపేటలో శుక్రవారం ప్రజాతంత్ర  ప్రతినిధితో  ఆమె మాట్లాడుతూ  గ‌త యూపీఏ సర్కారు గ్రామీణ నిరుపేద‌ల సంక్షేమం కోసం  ప‌క‌డ్బందీగా ఉపాధిహామీ చట్టం అమలు చేసిందని పేర్కొన్నారు. గాంధీ పేరును చెరిపేయాల‌ని కుట్ర‌తో కేంద్రo లోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు రద్దు చేసిందని విమర్శించారు. గ్రామాల్లో ప్రతీ నిరుపేద‌ కుటుంబానికి ఉపాధిని క‌ల్పించేలా చట్టపరమైన హక్కును నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తే.. నేటి పాలకులు ఆ హక్కును కాలరాస్తున్నారని మండిప‌డ్డారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ జీవనోపాధి భద్రతకు మూలస్తంభంగా ఉంద‌ని, ఏటా దేశవ్యాప్తంగా ఐదు కోట్ల కుటుంబాలకు ఉపాధి పొందుతున్నార‌ని గుర్తు చేశారు. దీనివ‌ల్ల గ్రామాల్లో వలసలను తగ్గించడంతోపాటు.. పేద‌ల జీవ‌న ప్ర‌మాణాలు పెంచే వెసులుబాటు క‌లిగింద‌ని తెలిపారు. గతంలో ఈ పథకం కింద నిధులను కేంద్రమే భరించేదని కానీ, కొత్త చట్టం ద్వారా 40 శాతం బడ్జెట్‌లో కోతపెట్టి రాష్ట్రాల మీద భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీల హక్కులను తీసేసారని ఆరోపించారు.

గ్రామ సభల్లో కాదు.. దిల్లీలో నిర్ణయాలు

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వీబీ జీ రామ్ చట్టం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని  శ్రావ్య సుధీర్ రెడ్డి   అన్నారు. ఉపాధి హక్కు పథకం వలన గతంలో సంవత్సరానికి 100 రోజుల పని హక్కు ఉండేదని, కానీ కొత్త చట్టం వల్ల కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసి బడ్జెట్ కేటాయిస్తేనే ప్రజలకు పని లభిస్తుందని తెలిపారు. గతంలో ఏ గ్రామీణ ప్రాంతంలోనైనా పని కోరే వీలు ఉండేదని కానీ ప్రస్తుత చట్టం వలన కేంద్రం ఎంపిక చేసిన పంచాయతీల్లో మాత్రమే పని చేయాల్సి ఉంటుందన్నారు. గతంలో ఏడాది పొడవునా ప‌ని కల్పించే వారని, ఇప్పుడు వ్యవసాయ సీజన్లో 60 రోజుల పనులపై నిషేధం విధించారని తెలిపారు. దీనివ‌ల్ల కూలీలకు పనులు తగ్గే ప్రమాదం ఉంద‌ని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పనులు గ్రామసభలో నిర్ణ‌యించ‌గా, ప్రస్తుతం దిల్లీ నిర్ణయంపై ఆధారపడి ఉంటాయని వివరించారు. పాత చట్టంలో గ్రామసభలు, పంచాయతీలు ఉపాధి పనుల కోసం ఖర్చులను నిర్ణయిస్తే ఇకపై పనులను నిధులను కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంద‌ని చెప్పారు.

కూలీల శ్ర‌మ‌ దోపిడీ
గతంలో పనులు గ్రామ ఆస్తులుగా ఉండగా, నేడు కాంట్రాక్టర్ ఆధారిత ప్రాజెక్టులుగా మారబోతున్నాయని శ్రావ్య సుధీర్ రెడ్డి  దుయ్యబట్టారు. దీనివలన కనీస వేతనాల కన్నా తక్కువ చెల్లించి కూలీలను దోపిడీకి గురిచేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. కొత్త చట్టంతో మహిళల ఉపాధి అవకాశాలు తగ్గడం, దళిత, ఆదివాసీ కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయని వెల్లడించారు. కొత్త చట్టం వల్ల పంచాయతీలు కేవలం నిర్ణయాలు అమలుపరిచే సంస్థలుగా మారి స్థానిక పనులపై నిర్ణయాధికారాలను కోల్పోతారని శ్రావ్య సుధీర్ రెడ్డి తెలిపారు.
—————————————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *