బాధితులకు బాసటగా కాల్‌ సెంటర్‌

– పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌, మరొకరిపై విచారణ
– ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యునిపై క్రిమినల్‌ కేసు
– ఫిర్యాదు చేసిన 24 గంటల్లోపే చర్యలు
– మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం విషయంలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు చోటులేకుండా ప్రభుత్వం తీసుకుంటున్న గట్టి చర్యలు ప్రజలను చైతన్యపరుస్తున్నాయి. అందుకే ఏ చిన్న సమస్య వచ్చినా లబ్దిదారులు ఇందిరమ్మ ఇండ్ల కాల్‌సెంటర్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ కాల్‌ సెంటర్‌ బాధితులకు బాసటగా నిలుస్తోంది. కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదు వచ్చిన గంటల్లోనే అధికారులే నేరుగా రంగంలోకి దిగి తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఫిర్యాదులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిరోజూ తన కార్యాలయానికి తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. బిల్లుల మంజూరులో లంచాలు అడుగుతున్న అధికారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదు వచ్చిన 24 గంటల్లోనే బాధితులకు న్యాయం చేసి సంబంధిత అధికారులపై చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పలువురు ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ కార్యదర్శులపై వేటు పడిరది. కొంతమంది ఇండ్ల లబ్దిదారుల ఫిర్యాదులను గమనిస్తే వారికి కాల్‌ సెంటర్‌పై ఎంత నమ్మకం ఏర్పడిరదో అర్ధమవుతోంది. అంతేగాక ఓ లబ్దిదారు ఏకంగా పోలీసు స్టేషన్‌లోనే ఇందిరమ్మ కమిటీ సభ్యునిపై ఫిర్యాదు చేయడం కూడా వారిలో పెరిగిన చైతన్యానికి నిదర్శనం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

పంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదు

సంగారెడ్డి జిల్లా నిజాంపేట, ఏదులతండాకు చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారు అంగోత్‌ తులసీబాయి నేరుగా హౌసింగ్‌ కార్పొరేషన్‌లోని కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి తన ఇంటి నిర్మాణం పునాదుల వరకు పూర్తయిందని, అంతవరకు ఫొటో తీసి పంపడానికి పంచాయతీ కార్యదర్శి పి.మహబూబ్‌ అలీ రూ.10 వేలు డిమాండ్‌ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇప్పటికే తాము రూ.5వేలు ఇచ్చామని, అయినా ఇంటి పునాదుల ఫొటోను అప్‌లోడ్‌ చేయలేదని ఫిర్యాదు చేశారు. ఫోన్‌ పే ద్వారా అతనికి డబ్బులు చెల్లించినట్లు అధికారుల విచారణలో తేలింది.

మరో కార్యదర్శిపై కూడా..

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మండలం మాజిద్‌పూర్‌కు చెందిన కల్లె సత్యాలు అనే లబ్దిదారు నేరుగా కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి తమ పంచాయతీ కార్యదర్శి రాఘవేంద్ర పలు రకాలుగా సమస్యలు సృష్టించి వేధిస్తున్నారని, రూ.20 వేలు లంచం డిమాండ్‌ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇల్లు బేస్‌మెంట్‌ వరకు పూర్తయిందని, ఇప్పుడు గ్రామ పైప్‌లైన్‌కు అడ్డంగా ఉందని చెప్పి ఇంటి పొటో తీయకుండా వేధిస్తున్నారని ఆమె తెలిపారు. రెండు నెలలుగా నరకం అనుభవిస్తున్నామని, తమ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటుందని చెబితే అలాగే చేస్కోండంటూ పంచాయతీ కార్యదర్శి సమాధానమిస్తున్నారని ఆమె తెలిపారు. దీనిపై అధికారులు లోతైన విచారణ జరుపుతున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారు ఫిర్యాదు- కేసు నమోదు

నాగర్‌ కర్నూలు జిల్లా తాడూరు మండలం సిర్సవాడ గ్రామానికి చెందిన ఏదుల భీమమ్మ అనే లబ్దిదారు చేపట్టిన ఇంటి నిర్మాణానికి అడ్డుపడుతూ ఆమెను బెదిరించి డబ్బు వసూలు చేసినట్లు అందిన ఫిర్యాదుపై స్థానిక పోలీసుల కేసు నమోదు చేశారు. భీమమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరుకాగా ఆమె బావ ఏదుల నారాయణ తన భార్యాపిల్లలతో కలిసి ఇంటి నిర్మాణానికి అడ్డుపడ్డారు. నారాయణకు అండగా నిలిచిన ఇందిరమ్మ కమిటీ సభ్యుడు చిక్కోండ్ర మల్లేష్‌ రూ.25వేలు డిమాండ్‌ చేశాడు. దీంతో భయపడిన భీమమ్మ రూ.10 వేలు మల్లేష్‌కు ఇచ్చినప్పటికీ నారాయణకు మల్లేష్‌ మద్దతుగా నిలిచి తనను మోసం చేశారని, తన ఇంటి నిర్మాణానికి అడ్డుపడుతున్నందున వీరిపై చర్యలు తీసుకోవాలని భీమమ్మ తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు మల్లేష్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.

పైసా వసూలు చేసినా క్షమించేది లేదు : మంత్రి పొంగులేటి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, చెల్లింపుల విషయంలో అవినీతికి పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. తీందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి లంచం డిమాండ్‌ చేసిన సంగారెడ్డి జిల్లాలోని పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా మాజిద్‌పూర్‌ గ్రామ కార్యదర్శిపై లోతైన విచారణకు ఆదేశించామన్నారు. అలాగే నాగర్‌ కర్నూల్‌ జిల్లా తాండూరు మండలంలో ఇందిరమ్మ కమిటీ సభ్యుడిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశామని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *