– కొత్తగా మూడు వ్యవసాయ కళాశాలలు మంజూరు
– మెట్రో రెండో దశపై సిఎస్ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ
– డిసెంబర్ 1నుంచి ప్రజాపాలన ఉత్సవాలు
– 5,566 కి.మీ మేర హామ్ రోడ్ల నిర్మాణానికి ఆమోదం
హైదరాబాద్, అక్టోబర్ 16: స్థానిక ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీ చేయడానికి వీలులేదని తీసుకున్న నిర్ణయానికి ఎత్తివేస్తూ కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలవుతున్న తరుణంలో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులన్న నిబంధనను అమలు చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈమేరకు మీటింగ్ అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరాలు వెల్లడిరచారు. ఈ వానాకాలంలో 1.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. దేశంలోనే ఇది రికార్డు స్థాయి ఉత్పత్తి. ఇందులో రాష్ట్రంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల విభాగం అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం 50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు అంగీకరించింది. మరో 15 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. వ్యవసాయ, రెవెన్యూ, పౌర సరఫరాల, రవాణా శాఖలు సమన్వయంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. మద్దతు ధరతోపాటు సన్న వడ్లకు ఇచ్చే రూ.500 బోనస్ రైతుల ఖాతాల్లో వెంటవెంటనే జమ చేయాలని నిర్ణయించింది. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలని, ప్రతీ కొనుగోలు కేంద్రం పర్యవేక్షణ, సమన్వయానికి ఒక్కో అధికారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా హుజూర్‌నగర్, కొడంగల్, నిజామాబాద్‌లలో మూడు అగ్రికల్చరల్ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
డిసెంబర్ 1నుంచి ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఉత్సవాల నిర్వహణ, సంబంధిత ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఏన్కూర్ మార్కెట్ యార్డుకు పది ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయానికి ఇప్పుడున్న చోటనే అదనంగా ఏడెకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నల్సార్ వర్సిటీ అడ్మిషన్లలో ఇప్పుడు తెలంగాణ స్థానికులకు కేటాయించిన 25 శాతం సీట్ల కోటాను 50 శాతం పెంచాలని కేబినెట్ తీర్మానం చేసింది.
మెట్రో రైలు స్వాధీనంపై కమిటీ
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మెట్రో 2, 2 విస్తరణకు అడ్డంకిగా మారిన మొదటి దశను పీపీపీ మోడ్‌లో నిర్వహిస్తున్న ఎల్‌అండ్‌టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలు, అందులో ముడిపడి ఉన్న అంశాలన్నింటినీ లోతుగా అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీఎస్ చైర్మన్‌గా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఏయూడీ కార్యదర్శి, లా సెక్రటరీ, మెట్రో రైలు ఎండీ, అర్బన్ ట్రాన్స్‌పోర్టు అడ్వయిజర్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అధికారుల కమిటీ తమ రిపోర్టును కేబినెట్ సబ్ కమిటీకి అందిస్తుంది. కేబినెట్ సబ్ కమిటీ సిఫారసుల ఆధారంగా మెట్రోను ఎల్‌అండ్‌టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించింది.
హామ్ రోడ్ల నిర్మాణానికి ఆమోదం
రాష్ట్రంలో హామ్ మోడ్‌లో మొదటి దశలో 5,566 కి.మీ రోడ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. జాతీయ రహదారులు, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానమయ్యే రహదారులకు సంబంధించి అభివృద్ధి, విస్తరణ పనులు ప్రభుత్వం చేపట్టనున్నది. హైదరాబాద్‌లో ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్ పేట ఓఆర్‌ఆర్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫాం రోడ్ వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సంబంధించి రక్షణ శాఖ భూములు వినియోగించుకుంటున్నందున వారికి ప్రత్యామ్నాయంగా 435.08 ఎకరాల భూములను అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కృష్ణా-వికారాబాద్ బ్రాడ్‌గేజ్ రైలు మార్గం నిర్మాణానికి సంబంధించి 845 హైక్టార్ల భూ సేకరణకు అయ్యే రూ.438 కోట్ల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరిస్తూ కేబినెట్‌లో తీర్మానం చేశారు. మన్ననూర్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి మొత్తం వ్యయంలో మూడో వంతు రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు కూడా అంగీకరిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది.





