60 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు..
వైద్యం నిమిత్తం భద్రాచలం హాస్పిటల్ కు తరలింపు. భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 02 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో ఉన్న కేఎల్ఆర్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు మణుగూరు నుండి పాల్వంచకు వెళ్తూ మొండికుంట సమీపంలో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ సంఘటన లో బస్సులో 60 మంది ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారు. ఈ సంఘటన చూసిన ఆ ప్రాంతవాసులు హుటాహుటిన బస్సు వద్దకు వచ్చి బస్సులో ఉన్న విద్యార్థిని ,విద్యార్థులను బలవంతంగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

విద్యార్థిని విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వైద్యం నిమిత్తం భద్రాచలం ఏరియా హాస్పిటల్ తరలిస్తున్నారు. కొంతమంది విద్యార్థిని ,విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా చదువుకునే విద్యార్థిని, విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అవగాహన లేని డ్రైవర్ల కారణంగా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బస్సు బోల్తా విషయం తెలుసుకున్న పోలీసు యంత్రాంగం సంఘటన స్థలం వద్ద చేరుకొని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. విద్యార్థిని విద్యార్థులను ఆసుపత్రికి తరలించే పనిలో ఉన్నారు.





