కాగుతున్న అక్షరం

మాటకు మాటంటే అర్బన్ నక్సలైట్

వాదానికి వాదిస్తే అర్బన్ నక్సలైట్

రాతకు రాత రాస్తే అర్బన్ నక్సలైట్

 ప్రశ్నలు జవాబులు ఖాళీ చేసిన బుర్ర

కళ్ళల్లో ఎర్రకోట కారిపోతుంటే

కాషాయం రజాకార్లు

ఉపా సంకెళ్లు పట్టుకు తిరుగుతుంటారు

 

మిణుగురులు నిద్రించని

మెదళ్ళకు తాళాలు వేసి

మనసులోంచి ఎగిరే పావురాలకి

ఉచ్చు స్వప్నిస్తారు

 

అజ్ఞానానికి క్షీరాభిషేకం చేస్తూ

మతము దేవుడు చట్టపట్టాలతో

సలసల కాగుతున్న అక్షరం మీద పడతారు

 

బహుళ రంగుల చిత్రం ఇష్టపడి

మనిషి పక్కన నిలబడ్డ అక్షరం

దేశద్రోహ రాజద్రోహ చిత్రమై పోతుంది

 

ఎవడు రాజయితే

వాడి గుళ్ళు వాడి దేవుళ్ళై పోయిన

నియంత కాల

పురా మత కట్టడాలకు మంటలంటించి

మతం ఇటుకలు పేర్చి

కట్టుకున్న అబద్దాల పునాదుల

అధికార సౌదాల కలలు పట్టుకు తిరుగుతారు

 

ప్రకృతి లోంచి జాలువారి

భూకంప సునామి ప్రశ్నై నిలబడుతున్నప్పుడు

రకరకాల తెరల్లో

బూతుముర్గుల ట్రోలై పారి

కాలం చుట్టూ కంచె నాటుకోవాలని చూస్తారు

 

నిచ్చెన మెట్ల గావు పట్టిన గొంతుల చుట్టూ

కాలంపుటల్లో సమూహ హృదయాన్ని పరిచిన

పదరాశుల చుట్టూ  కత్తులు తుపాకులు కర్రలై అవతారమెత్తి

సర్కారు ముళ్ల గొంతులేసుకుని

మరుగుజ్జు సాంస్కృతిక సర్జికల్ స్ట్రైకై

చుట్టూ మంచుతెరలా కమ్ముకోవాలని చూస్తారు

వెలుగుల సూర్యునికి కరుగుతూనే

మడుగు కట్టిన భావజాలం మురుగుతూనే

 (ఎన్ వేణుగోపాల్స్కైబాబామెర్సి మార్గరెట్ కు సంఘీభావంగా)

 వడ్డెబోయిన శ్రీనివాస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *