సర్కార్‌కు సవాల్‌ ‌కానున్న బడ్జెట్‌

– ఆరు గ్యారంటీలపై విపక్షాల వత్తిడి
– రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రానికి డిమాండ్‌

హైదరాబాద్,ప్రజాతంత్ర, మార్చ్ 12 : ఈ నెల 20న ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌ ‌ప్రభుత్వానికి సవాల్‌గా మారనుంది. కాంగ్రెస్‌ ‌అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్ళు పూర్తికావస్తుండడంతో ఈసారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ ‌కీలకంకానుంది. మరో రెండేళ్ళలో ప్రభుత్వం అమలుచేసే కార్యక్రమాలు ఈ బడ్జెట్‌తో ముడివడి ఉండడంతో ప్రభుత్వం ఆచితూచి బడ్జెట్‌ ‌రూపకల్పన చేయనుందనుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలనుండి ఎదురయ్యే సవాళ్ళకు దీటుగా రూపొందించేందుకు ప్రభుత్వం కుస్తీపడుతున్నట్లు వినికిడి.  అధికారం చేపట్టి మూడేళ్ళు కావస్తున్నప్పటికీ ఎన్నికలకు ముందు చేసిన వాగ్ధానాలను నిలబెట్టుకోలేదన్న విమర్శను చాలాకాలంగా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఎదుర్కొంటున్నది. వాగ్ధానాలపై విపక్షాలు ప్రశ్నించినప్పుడల్లా గత ప్రభుత్వం తమకు ఖాళీ ఖజానాను ఇచ్చిందంటూ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం దాటవేసుకుంటూ వచ్చింది. తాము చేసిన ఆరుగ్యారంటీల హామీని వందరోజుల్లో అమలు చేస్తామన్న కాంగ్రెస్‌ ఇక్కడ లంకెబిందెలు ఉంటాయనుకుంటే ఖాళీకుండలు దర్శనమిచ్చాయంటూ గత బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై వేలెత్తి చూపించడంతోపాటు, వాగ్దానాలకు కాలదోషం పట్టిస్తూ వచ్చింది. కాని, 2028లో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునైనా ఇచ్చిన హామీలను తప్పక అమలు చేయాల్సిన అవసరం ఇప్పుడీ ప్రభుత్వానికి ఏర్పడింది. ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్‌ ఆరు గ్యారంటీల విషయంలో ప్రభుత్వానికి నిద్రపట్టకుండా చేస్తున్నది. ఏ సమావేశం జరిగినా అదే విషయాన్ని చ‌ర్విత‌చరణంగా ప్రస్తావిస్తూ వస్తున్నది. ఆరు గ్యారంటీలు, 420 హామీల విషయంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం  ప్రజలను మోసం చేసిందంటూ గ్రామీణప్రాంతం మొదలు రాష్ట్ర రాజధానిలో విస్తృ ప్రచారం చేస్తూ వస్తున్నది. అలాగే బిజెపి కూడా ఈ విషయంలో తీవ్ర విమర్శలుచేస్తున్నది. ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్న ప్రభుత్వం ఇంకా హామీలమీద హామీలు చేయడాన్ని ప్రశ్నిస్తున్నది. గత ప్రభుత్వం తమ నెత్తిమీద మోయలేనంత అప్పు భారాన్ని మోపిందని ఒకపక్క విమర్శిస్తూనే మరో పక్క ఉచితాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని అప్పులను చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికితోడు ఫ్యూచర్‌ ‌సిటీ అని, మూసీ ప్రక్షాళన లాంటి భారీ ప్రాజెక్టులను ముందుపెట్టుకున్న ప్రభుత్వం పెద్ద ఆర్థిక భారాన్నే మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని ప్రకటించాలని బిజెపికి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్‌ ‌చేస్తున్నారు. గత ప్రభుత్వాన్ని విమర్శించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తమ పాలనలో మరెంత అప్పుల భారాన్ని ప్రజలపై మోపనుందన్నది స్పష్టంకావాలంటున్నారు. అదికూడా బడ్జెట్‌కు ముందే ప్రకటించాలన్నది ఆయన డిమాండ్‌. ‌పెన్షన్లపెంపు, మహిళలకు నగదు పథకం లాంటివాటికే వేలకోట్ల రూపాయలు అవసరమవుతాయి. విద్యార్ధుల రీయింబర్స్‌మెంట్‌ ‌చెల్లింపులు నిలిచిపోయాయి. నాలుగు సీజన్‌లుగా రైతుబంధు నిలిచిపోవడాన్ని బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌తరుచూ గుర్తు చేస్తూనే ఉన్నారు. వాటి విషయాన్ని పక్కకు పెట్టి కాలేజీ విద్యార్థినులకు ఇవి స్కూటీలు ఇస్తామంటూ తాజాగా సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. వీటన్నిటి అమలు చేసేందుకు నిధులు ఎక్కడినుండి తెస్తారని మరో కేంద్రమంత్రి బండి సంజయ్‌ ‌ప్రశ్నిస్తున్నారు. గత బడ్జెట్‌కన్నా ఈసారి ఏ కొద్దిగానో ఎక్కువ ఉంటుందన్న వార్తలు వస్తున్నాయి. గత ఏడాది బడ్జెట్‌ ‌మూడు లక్షల కోట్లకు లోపే ఉండగా, ఈసారి మూడు లక్షల 25 వేల కోట్లవరకు ఉండవచ్చని అంచనావేస్తున్నారు. అలాంటి పరిస్థితిలో ఆరు గ్యారంటీలు, 420 హామీలకు బడ్జెట్‌ ఏవిధంగా సరిపోతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉంటే ప్రపంచంతో పోటీపడే విధంగా ఈసారి బడ్జెట్‌ ‌రూపకల్పన ఉంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పేర్కొంటున్నారు. అంకెల గారడి కాకుండా సంక్షేమం, ఆర్థికం మధ్య సమతూకాన్ని పాటిస్తామంటున్నారాయన. ముఖ్యంగా ప్రజా సంక్షేమం, వ్యవసాయరంగాన్ని పెద్ద పీట వేయనున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *