- బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నోటీసుపై స్పందించిన కేటీఆర్.
- బీఅర్ఎస్ ను చూసి రేవంత్ భయపడుతున్నట్టు మరోసారి స్పష్టమైందన్న మాజీ మంత్రి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈనెల 28న విచారణకు హాజరుకావాలన్న ఏసీబీ నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. రాజకీయంగా వేధించే ఉద్దేశంతో తనపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసు పెట్టిందన్న సంగతి తెలిసినప్పటికీ.. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా విచారణ సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, బీఆర్ఎస్ రజతోత్సవాలకు హాజరయ్యేందుకు లండన్, అమెరికా పర్యటన ముందే ఖరారైనందున మే 28న విచారణ కు హాజరుకాలేనన్నారు. అయితే, విదేశాల నుంచి తిరిగి వొచ్చిన తర్వాత కచ్చితంగా విచారణకు వస్తానని ఏసీబీ అధికారులకు కేటీఆర్ లిఖితపూర్వకంగా తెలిపారు.
48 గంటల క్రితం నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ ద్వారా డబ్బులు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి పేరును ఈడీ ఛార్జిషీట్‌లో నమోదు చేసిందని కేటీఆర్ తెలిపారు. సరిగ్గా 24 గంటల తర్వాత ప్రధాని మోదీతో సహా బిజెపి అగ్ర నాయకులతో రేవంత్ రెడ్డి సన్నిహితంగా కనిపించారని వెల్లడించారు. మనీలాండరింగ్ కేసులో రేవంత్ రెడ్డి పేరును ఈడీ పేర్కొన్నప్పటికీ ఒక్క తెలంగాణ బీజేపీ నేత కూడా అతడి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఆ రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహనకు, అనైతిక సంబంధానికి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలు, అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు రగిలిపోతున్న రేవంత్ రెడ్డి.. తనపై ప్రతీకారంతో ఎంతకైనా దిగజారుతారన్న సంగతి ఈ ఏసీబీ నోటీసులతో అర్థమైందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు, రేవంత్ రెడ్డి నాయకుడిగానే కాకుండా, మనిషిగా కూడా ఎంతగా పతనమవుతున్నారో చెప్పడానికి ఈ చౌకబారు ప్రతీకార చర్యలే నిదర్శనమని కేటీఆర్ స్పష్టంచేశారు. బీఆర్ఎస్ ను చూస్తే రేవంత్ లో రోజురోజుకూ భయం పెరిగిపోతోందని స్పష్టంగా అర్థమవుతోందన్న కేటీఆర్ పేర్కొన్నారు.





