ఇప్పటికైనా పద్దతి మార్చుకోండి..

బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన బిఆర్‌ఎస్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 16 : ‌కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఆదేశాలను భారత రాష్ట్ర సమితి స్వాగతం తెలిపింది. ఇది ప్రభుత్వానికి గుణపాఠం కావాలని అన్నారు.  కంచ గచ్చిబౌలిలో ధ్వంసం చేసిన అడవులను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు  పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర చీఫ్‌ ‌వైల్డ్ ‌లైఫ్‌ ‌వార్డెన్‌కు వన్యప్రాణులను కాపాడాలంటూ ఆదేశాలు ఇవ్వడం గొప్ప విజయమని పేర్కొన్నారు.. వన్యప్రాణుల పట్ల, పర్యావరణ పరిరక్షణకు పాటుపడే ప్రతి ఒక్కరికి దక్కిన విజయం అంటూ పేర్కొన్నారు. గొంతులేని మూగజీవాల కోసం, చెట్ల కోసం, పర్యావరణం కోసం అండగా నిలబడిన హైదరాబాద్‌ ‌సెంట్రల్‌ ‌యూనివర్సిటీ విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు.

సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కేంద్ర సాధికారిక కమిటీ ఇచ్చిన సిఫారసులను కూడా భారత రాష్ట్ర సమితి స్వాగతిస్తున్నదని పేర్కొన్నారు. కంచ గచ్చిబౌలిని ప్రైవేట్‌ ‌పార్టీకి తాకట్టు పెట్టిన రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వ వ్యవహారంలో ఆర్థిక అవకతవకలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసిన కేంద్ర సాధికారిక కమిటీ మా పార్టీ వాదనను బలపరుస్తున్నదని తెలిపారు. కంచ గచ్చిబౌలి భూముల తాకట్టు విషయంలో పదివేల కోట్ల రూపాయల అవినీతికి రేవంత్‌ ‌రెడ్డి పాల్పడ్డారని చేసిన ఆరోపణలను పునరుద్ఘాటించారు. అడవుల పట్ల, వన్యప్రాణుల పట్ల రేవంత్‌ ‌రెడ్డి నెంబర్‌ ‌వన్‌ ‌విలన్‌గా మారాడని విమర్శించారు. పర్యావరణ విధ్వంసానికి… పర్యావరణ హత్యకు పాల్పడి తప్పించుకోలేరనే కనీస సోయి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి ఇకనైనా వొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి తనను తాను మోసం చేసుకున్న విషయాన్ని అర్థం చేసుకుని పర్యావరణ విధ్వంసం ఆపాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *