- బిఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు
- ఎన్నికలు జరిగితే మాదే అధికారం
- బనకచర్లను అడ్డుకుంటాం
- సచివాలయానికి ఎందుకు రావు?
- చిన్న కాంట్రాక్టర్లకు ఎందుకు చెల్లింపులు లేవు
- బడా కాంట్రాక్టర్లకు రూ.12వేల కోట్లు ఎట్లా చెల్లించావు?
- తెలంగాణ నినాదం కూడా చేయలేదు
- మిల్లీ మ్యాగీతో అసభ్యంగా ప్రవర్తించిందెవరు?
- రికార్డు స్థాయి ధాన్యం ఉత్పత్తి కె.సి.ఆర్. వల్ల కాదా?
- రేవంత్‌ను నిలదీసిన బీఆర్ ఎస్ నేత హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 2: కేసీఆర్ (KCR) లేకుంటే ఈరోజు వేడుకలు జరిగేవా? ఈరోజు ముఖ్యమంత్రి రాష్ట్ర ఆవిర్బావ వేడుకలు జరుపుకుంటున్నారంటే అంటే దానికి కేసీఆర్ కారణమని బీఆర్ ఎస్ (BRS Party) నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు (MLA Harish Rao) అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలకు శుభాకాంక్షలు తెలిపారు. బిఆర్ఎస్ రజతోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో ఈ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా వున్నదన్నారు. పార్టీ పెట్టిన నాడు జై తెలంగాణ పదాన్ని నిషేధించిన పరిస్థితిలో కేసీఆర్ పట్టుబట్టి, పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం ప్రారంభించారని గుర్తు చేశారు. రెండున్నర దశాబ్దాల క్రితం బొంబాయి బొగ్గుబాయి దుబాయి, వలసలు, ఆత్మహత్యలు, ఆకలి చావులు సర్వసాధారణంగా వుండేవవన్నారు. కె.సి.ఆర్. తన గుండెబలం, రాజీలేని పోరాట పటిమతో తెలంగాణ సాధించారన్నారు. రాజీలేని పోరాటమే ఆయన బలమన్నారు.
మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రజాసమితి 11 ఎంపీ స్థానాలను గెలిచినా, నాటి ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వలేదని గుర్తుచేశారు. మలి దశ ఉద్యమంలో సోనియా గాంధీ చేత తెలంగాణ ఇచ్చే పరిస్థితి తెచ్చిన ఘనత కె.సి.ఆర్.దేనన్నారు. చంద్రబాబును ఎదుర్కొనేందుకు నాడు ఎవరు దైర్యం చేయలేదు. జయశంకర్ సారుతో సహా అందరూ ధైర్యం చెప్పడంతో డిప్యూటీ స్పీకర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పదవులకు రాజీనామా చేసి 2001లో పార్టీని స్థాపించారన్నారు. ఒకపక్క పార్టీలను ఒప్పిస్తూనే, అంబేద్కర్ చూపిన బోధించు, సమీకరించు, పోరాడు అఅనే మార్గంలో ఉద్యమాన్ని నడిపిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ఈ క్రమంలోనే ఆయన దేశంలోని 33 పార్టీలను తన వాక్చాతుర్యంతో ఒప్పించగలిగారన్నారు. మూడు సార్లు ఎంపీ, కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే ఇలా అనేక సార్లు రాజీనామా చేసి త్యాగాలకు మారుపేరుగా కేసీఆర్ నిలిచారన్నారు. అలుపెరుగని పోరాటం చేసి, చివరకు చావునోట్లో తలపెట్టి మరీ తెలంగాణా సాధించిన గొప్పనాయకుడు కె.సి.ఆర్. అన్నారు. డిసెంబర్ 9 ప్రకటనకు వ్యతిరేకంగా నాడు ఏపీ నాయకులు అడ్డుపడ్డ సంగతి గుర్తు చేశారు.
అందుకు అందరం రాజీనామాలు చేయాలని నిర్ణయిస్తే, ఇదే తెలుగు దేశం పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి జిరాక్స్ పేపర్ ఇచ్చారు తప్ప, ఒరిజినల్ రాజీనామా ఇవ్వలేదని ఆరోపించారు. ఒక్క నాడు జై తెలంగాణ అనలేదు, ఒక్క నాడు అమరులకు దండం పెట్టని నాయకుడు రేవంత్ అని విమర్శించారు. ఆనాడు బిజేపీకి ఇద్దరే ఎమ్మెల్యేలు యండల లక్ష్మినారాయణ, కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి రాజీనామా చేయలేదని గుర్తు చేశారు.
ఇటువంటి వాళ్లు కేసీఆర్ ను విమర్శించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. బిఆర్ఎస్ లేకుంటే, కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చునా గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పాలని సవాల్ విసిరారు. గులాబి జెండా పుట్టి ఉండకుంటే స్వయపాలన సాధ్యమయ్యేదా? తెలంగాణ వచ్చినంక కూడా అవమానించారు. చేసారు. పాలన చేతగాదు అన్నరు. నక్సలైట్ల రాజ్యం అయితది అన్నరు. చివరకు ఏమైంది. ఆ నోళ్లతోనే కేసీఆర్ శభాష్ అనిపించుకున్నారన్నారు. కేసీఆర్ అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపితే, రేవంత్ అబద్దాలలో అగ్రగామిగా నిలుపుతున్నాడని ఆరోపించారు.
మహిళలకు రూ. 21వేల కోట్ల వడ్డీ లేని రుణం అని ఈరోజు కూడా అబద్దాలు మాట్లాడుతున్నడు. దీనికి సంబంధించిన జీ.ఓ. లేదా ఆధారం చూపిస్తే రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నానని సవాల్ విసిరారు. 60వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు ముఖ్యమం త్రి చెబుతున్నా నిజంగా ఇచ్చినవి పదివేలు కూడా దాటలేదన్నారు. వీటికైనా నోటిఫికేషన్లు ఇచ్చింది,పరీక్షలు పెట్టింది కేసీఆర్ మాత్రమేనని గుర్తుచేశారు.
275 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందని గొప్పలు చెప్పుకుంటున్నారు సరే. ఇది కేవలం కేసీఆర్ వల్లనే సాధ్యమైందన్న సత్యాన్ని మరచిపోతే ఎట్లా? అన్నారు. ఏడాది పాలనలో ముఖ్యమంత్రి సాగుపరంగా చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. నీళ్లు, కరెంటు ఇచ్చి కేసీర్ ప్రాజెక్టులు కట్టారు. ఇదే రేవంత్ రెడ్డి చారాణా రుణమాఫీ చేసి బారాణా ఎగ్గొట్టారని ఎద్దేవా చేశారు. రైతుబంధు ఇవ్వలేదు, ధాన్యం కొనుగోళ్లమీద సమీక్ష లేదు, కానీ అందాల పోటీల మీద తెగ రివ్యూ మీటింగ్‌లు పెట్టారని ఆరోపించారు.
ధాన్యపు రాశుల మీద గుండాగి చనిపోయే రైతులను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. రూ. 16వేల కోట్ల మాఫీ చేసినవు సరే మిగతా డబ్బు ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. రైతు బందు ఈరోజుకు పడలేదని గుర్తు చేశారు. అదే కె.సి.ఆర్. పాలనలో అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్‌గా వున్నదన్నారు.
మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న తెలంగాణ ప్రజల కోసం పని చేయాలని చెప్పే గొప్ప మనసు కె.సి.ఆర్‌ది అన్నారు. అయినా రూ. 16వేల కోట్ల రుణమాఫీ కూడా బిఆర్ఎస్ వల్లనే అయింది కదా అన్నారు. మూసీ బాధితులకు, హైడ్రా బాధితులకు అండగా నిలవడమేకాదు బీఆర్ ఎస్ తెలంగాణ ప్రజలకు ఒక కవచంగా మారిందన్నారు. ఉన్నపథకాలు బంద్ చేయడం తప్పమీరు చేసిందేమిటని ప్రశ్నించారు. 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తే, దాని మీద కమిషన్ వేసారు. కాళేశ్వరం కట్టి 20లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది బిఆర్ఎస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. ఇది నీ ఇంజినీర్లు ఇచ్చిన నివేదికే చెబుతున్నది. మీది 20శాతం కమిషన్ల ప్రభుత్వమన్న ఆరోపణలున్నాయికదా అన్నారు.
బిజేపీకి తెలంగాణ మీద హక్కు లేదు, 1996లో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని మోసం చేసారు. చంద్రబాబుకు బయపడి తెలంగాణ ఇవ్వేలేదు బిజేపీ 8 మంది ఎంపీలు గెలిపిస్తే నిధులు కేటాయించడంలో మొండి చేయి చూపింది నిజం కాదా అని ప్రశ్నించారు. పోలవరం జాతీయ హోదా ఇవ్వడమే కాక, గోదావరి బనకచర్ల లింకు అక్రమ ప్రాజెక్టుకు నిధులు ఇస్తున్నది బిజేపీ. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదన్నారు. గోదావరి బనకచర్ల మీద, కిషన్ రెడ్డి , బండి సంజయ్, ఈటల రాజేందర్ మాట్లాడటం లేదని విమర్శించారు. తెలంగాణకు బనకచర్ల ప్రాజెక్టు శాపం కాబోతున్నది, దీనివల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయితే బనకచర్ల విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్తం, బనకచర్ల ప్రాజెక్టు ఆపుతామన్నారు. బనకచర్ల ప్రాజెక్టు ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
బిఆర్ఎస్ సొంతంగానే ఎన్నికల్లో పోరాడుతుంది. వంద సీట్లతో గులాబి జెండా ఎగరడం ఖాయమన్నారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. పథకాలకు పైసలు లేవు, అందాల పోటీలకు పైసలు ఎక్కడికెల్లి వచ్చినయని ప్రశ్నించారు. యంగ్ ఇండియా పేరుతో ముందు రూ.80కోట్ల కు ఒక స్కూల్ అన్నారు. తర్వాత రూ.130 కోట్లు ఆ తర్వాత రూ. 200 కోట్లు అంటున్నారు. నిజం చెప్పాలంటే ఇది రూ.5వేల కోట్ల స్కాం అని ఆరోపించారు. విద్యార్థులకు ఫీజు రియింబర్స్ మెంట్ లేదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల మీద భట్టికి ప్రేమ లేదా? పిల్లల చదువులు ఆగిపోతున్నా పట్టింపు లేదా అని ప్రశ్నించారు. అక్రమ కేసులు పెట్టి సోషల్ మీడియా వారియర్స్ ను వేధిస్తున్నారని ఆరోపించారు. ఎవరు ఎక్కువ చేస్తున్నారో, రెడ్ బుక్ లో రాసి పెట్టండి. అధికారులు అతిగా వ్యవహరిస్తే అన్నీ గమనిస్తున్నామని హెచ్చరించారు.
సర్పంచుల నుంచి జెడ్పీ చైర్మల్ల దాకా అందరిని ఏదో రకంగా బెదిరిస్తున్నారని ఆరోపించారు. చిన్న కాంట్రాక్టర్లకు రూ. 1200 కోట్లు ఇవ్వలేదు. రూ. 12000 కోట్ల బడా కాంట్రాక్టర్లకు ఎట్లా చెల్లించారని ప్రశ్నించారు. మీ సన్నిహితుడైన ఒక ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్, ఐఏఎస్ అధికారి మిస్ ఇంగ్లాండ్ పట్ల అనుచితంగా వ్యవహరించారిన వార్తలు వచ్చాయి. మీకు చిత్తవుద్ది ఉంటే వీడియో బయట పెట్టి, వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయమని డిమాండ్ చేశారు. తెలంగాణను కేసీఆర్ ప్రపంచ పటంలో నిలబెడితే, తెలంగాణకు తలవంపులు తెచ్చావన్నారు.
సచివాలయానికి పోకుండాజూబ్లీ హిల్స్ ప్యాలెస్, లేదంటే పోలీసు పహారా మధ్య కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రివ్యూలు చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ పేరు , బిఆర్ఎస్ పేరు వుంటుందన్నారు. అధికారం ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఉద్యమంలో అరెస్టు చేస్తే భోజనం పెట్టి, కొంత సేపు తర్వాత పంపించేవారు. కానీ రేవంత్ పాలనలో అర్ధరాత్రి, అపరాత్రి అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. మహిళా జర్నలిస్టులను కూడా అర్ధరాత్రి అరెస్టులు చేయడం అన్యాయమన్నారు. సీమాంద్ర ప్రభుత్వం ఉన్నా, సబితక్క లాంటి హోం మంత్రి మమ్మల్ని మంచిగ చూసుకున్నారని గుర్తు చేసుకున్నారు. రేవంత్ వచ్చాక అన్ని రంగాలు అధోగతికి చేరుకున్నాయని ఆరోపించారు.




