కాంగ్రెస్‌ పాలనలో గురుకులాల్లో మరణ మృదంగం

– మాజీ మంత్రి హరీష్‌ రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14: రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థులు మృతిచెందడం బాధాకరమని, కాంగ్రెస్‌ 20 నెలల పాలనలో గురుకులాల్లో మరణమృదంగం చోటుచేసుకుందని మాజీ మంత్రి టి.హరీష్‌రావు ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాలపై స్వయంగా పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి ప్రకటించి నెలలు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు లేకపోవడం దారుణమన్నారు. ధర్మసాగర్‌ మండలం కరుణాపురం మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకుల కళాశాలలో విద్యార్థి మృతి, చౌటుప్పల్‌ మండలం తుప్రాన్‌పేట బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య నల్గొండ జిల్లా దేవరకొండ ఎస్టీ బాలికల గురుకులంలో ఫుడ్‌ పాయిజన్‌, 15 మంది విద్యార్థులు హాస్పిటల్‌పాలు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం బీసీ గురుకులంలో పురుగులన్నం మాకొద్దు అంటూ విద్యార్థులు రోడ్డెక్కడం వంటి సంఘటనలను ఆయన ఉదహరించారు. ఈ మరణ మృదంగానికి బాధ్యులు రేవంత్‌ రెడ్డేనని అన్నారు. గురుకులాల ఖ్యాతి నానాటికీ దిగజారుతున్నదంటే దానికి కారకులు రేవంత్‌ రెడ్డేనని, విద్యార్థులకు కడుపు నిండా అన్నం కూడా పెట్టలేని దుస్థితిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉందా అని హరీష్‌రావు నిలదీశారు. విద్యావ్యవస్థ పట్ల కాంగ్రెస్‌ చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరితో లక్షలమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతున్నన్నదన్నారు. గురుకులాల్లో వరుసగా చనిపోతున్న విద్యార్థుల వార్తలు విని తల్లిదండ్రులు భయపడుతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలకు మెస్‌ చార్జీలు చెల్లించేందుకు గ్రీన్‌ చానల్‌ ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికి ఏడాది గడిచినా అమలు జరగలేదని ఎద్దేవా చేశారు. ఉడకని అన్నం, నీళ్ళ చారు, నాణ్యత లేని పప్పు తినకలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో గుడ్లు, పండ్లు విద్యార్థులకు అందించలేని పరిస్థితి నెలకొందంటూ ఇంకెన్ని రోజులు విద్యార్థులు పస్తులుండాలి, ఇంకెన్ని రోజులు గొడ్డు కారం అన్నం తినాలి అని ప్రభుత్వాన్ని నిలదీశారు. గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, ఫుడ్‌ పాయిజన్లు నిరోధించాలని, ఆత్మహత్యలు జరగకుండా తక్షణం చర్యలు చేపట్టాలని బీఆర్‌ఎస్‌ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామని హరీష్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *