బీఆర్‌ఎస్‌కు ఓట్లడిగే హక్కు లేదు

– ఆ పార్టీ, బీజేపీ ఒక తాను ముక్కలే
– మాజీ మంత్రులు భాషను సంస్కరించుకోవాలి
– జూబ్లీహిల్స్‌ ప్రచారంలో మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 1: పదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకుతిన్న బీఆర్‌ఎస్‌ నాయకులకు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఓటు అడిగే హక్కు లేదని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి, రెహమత్‌ నగర్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత పీజేఆర్‌ తల్లిదండ్రుల పేరు కలిగిన శివమ్మ, పాపిరెడ్డి హిల్స్‌లో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్ధి నవీన్‌ యాదవ్‌కు మద్దతుగా శనివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గతంలో పీజేఆర్‌ ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేసిన తర్వాత ఇంతవరకు మళ్లీ అలాంటి అభివృద్దే లేదన్నారు. ధనిక తెలంగాణను అప్పుల్లో ముంచిన గత పాలకులు పేదలకు ఇండ్లు కట్టిస్తే కమీషన్లు రావని కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని ఆరోపించారు. పదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ది చేయలేని బీఆర్‌ఎస్‌ నేతలు కేవలం 20 నెలల్లో కాంగ్రెస్‌ ఏమీ చేయలేదంటూ మాట్లాడుతున్నారని, వారి అజ్ఞానానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని మండిపడ్డారు. ఎన్నికల తర్వాత తాను ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి వచ్చి పేదలకు ఇండ్ల పట్టాలు, ఇండ్లు మంజూరు చేస్తామని, ఇక్కడి సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు.  కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో రెండు విడతల్లో పేదలకు ఇండ్లు మంజూరు చేసి వాటి నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున అందజేస్తుందని తెలిపారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలు ఒక తాను ముక్కలేనని, గత పార్లమెంటు ఎన్నికల నుంచి వాటి మధ్య పొత్తు ఉందని అన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ గెలుపు తథ్యమని, అందువల్లే బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులు అక్కసుతో మాట్లాడుతున్నారంటూ వారు భాష మార్చుకోవాలని పొంగులేటి హితవు పలికారు. బీఆర్‌ఎస్‌ నేతల చెంప ఛళ్లుమనేలా కాంగ్రెస్‌ అభ్యర్ధికి మెజారిటీ ఇవ్వాలని కోరారు. అంబేద్కర్‌ స్టడీ సర్కిల్‌లో రూ.కోటితో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరలో పూర్తి చేసి అందరికీ అందుబాటులోకి తెస్తామన్నారు. కాగా, ఎస్‌.పి.ఆర్‌ హిల్స్‌ ప్రాంతంలో బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వందమంది మైనారిటీ యువకులకు, మరో వందమంది మహిళలకు కాంగ్రెస్‌ కండువాలు కప్పి మంత్రి పొంగులేటి ఆహ్వానించారు. మంత్రికి గజ మాల, నృత్యాలతో అక్కడి ప్రజలు స్వాగతం పలికారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *