2013 లో ఇచ్చిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు కర్ణాటక ఆల్మట్టి జలాశయం ఎత్తు పెంచుకొనే అవకాశం ఉంది . ఈ తీర్పు సుప్రీంకోర్టు స్టే తో కేంద్రం నోటిఫై చేయనందున చట్టబద్ధత లేదని బేసిన్ లోని మిగిలిన రాష్ట్రాలు అడ్డుపడుతున్నాయి. అదే సమయంలో తెలంగాణలోని అధికార ప్రతిపక్షాలు రెండు కూడా ఆల్మట్టి జలాశయం ఎత్తు పెంపుదలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. అమలులో లేని ట్రిబ్యునల్ తీర్పు మేరకు ఎత్తు పెంచడం కుదరదని వాదిస్తున్నారు. అలాంటప్పుడు ఆ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చేసిన కేటాయింపులకు చట్ట బద్దత ఉండదు కదా? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఈ స్పష్టత తెలియదని భావించలేము.
బచావత్ ట్రిబ్యునల్ తీర్పు కాలపరిమితి ముగిసిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో కృష్ణ జలాలను బేసిన్ లోని అన్ని రాష్ట్రాల మధ్య తిరిగి పంపిణీ చేసేందుకు 2004 లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నియామకం జరిగింది. ఈ ట్రిబ్యునల్ 2010 లో మధ్యంతర తీర్పు 2013 లో తుది తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఏకపక్షంగా ఉందని అప్పట్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. సుప్రీంకోర్టు ఈ తీర్పుపై స్టే విధించడంతో కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వ లేదు. ఏ ట్రిబ్యునల్ తీర్పుకు గాని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన తరువాతనే చట్ట బద్దత ఏర్పడుతుంది. ఇప్పటికీ సుప్రీంకోర్టు స్టే తో ఈ తీర్పు గాలిలో వుంది. ఫలితంగానే 1976 లో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు నేటికీ కృష్ణ బేసిన్ లో అమలులో ఉంది. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ (2013) తీర్పును ఏ సందర్భంలోనూ ప్రామాణికంగా తీసుకోవడం లేదు. పార్లమెంటు ఆమోదించిన రాష్ట్ర విభజన చట్టంలో కూడా స్పష్టంగా చెప్పారు. 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం కింద నియమింపబడిన ట్రిబ్యునల్ కేటాయింపులను ప్రతి సందర్భంలో ప్రామాణికంగా తీసుకోవాలని విభజన చట్టంలో పొందు పర్చారు.
ఈ రోజు తెలంగాణలో అధికార ప్రతిపక్షాలు వాదులాడుకుంటున్నట్లు కృష్ణ జలాల్లో తెలంగాణకు 299 టిఎంసిలు ఆంధ్ర ప్రదేశ్ కు 510 టిఎంసిలు కేటాయింపు తాత్కాలికమూ కాదు పర్మినెంట్ కాదు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం అమలులో ఉన్న బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు రెండు రాష్ట్రాలకు యాజమాన్య బోర్డు పంపిణీ చేసింది. ఈ పదేళ్ల కాలంలో కెసిఆర్ ప్రభుత్వం పలు వేదికల మీద ఫిఫ్టీ ఫిఫ్టీ వాటాకు డిమాండ్ చేసినా యాజమాన్య బోర్డు సమ్మతించలేదు. బోర్డుకు కూడా ప్రామాణికం రాష్ట్ర విభజన చట్టమే. మున్ముందు ఇప్పుడు విచారణ జరుపుతున్న ట్రిబ్యునల్ తీర్పు ఇస్తే ఈ తీర్పు న్యాయ సంబంధమైన గండాలు దాటి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తే ఆ తీర్పు మేరకు బోర్డు రెండు రాష్ట్రాల మధ్య నీటిని విడుదల చేస్తుంది. ఒక వేళ ఈలోపు సుప్రీంకోర్టులో ఉన్న స్టే తొలగిపోయి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తే 2013 లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు అమలు లోకి రావచ్చు. నోటిఫికేషన్ జారీ వరకు అది ఉనికిలో లేనట్లే. అంతేకాదు. 2013 లో ఇచ్చిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు కర్ణాటక ఆల్మట్టి జలాశయం ఎత్తు పెంచుకొనే అవకాశం ఉంది . ఈ తీర్పు సుప్రీంకోర్టు స్టే తో కేంద్రం నోటిఫై చేయనందున చట్టబద్ధత లేదని బేసిన్ లోని మిగిలిన రాష్ట్రాలు అడ్డుపడుతున్నాయి. అదే సమయంలో తెలంగాణలోని అధికార ప్రతిపక్షాలు రెండు కూడా ఆల్మట్టి జలాశయం ఎత్తు పెంపుదలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. అమలులో లేని ట్రిబ్యునల్ తీర్పు మేరకు ఎత్తు పెంచడం కుదరదని వాదిస్తున్నారు. అలాంటప్పుడు ఆ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చేసిన కేటాయింపులకు చట్ట బద్దత ఉండదు కదా? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఈ స్పష్టత తెలియదని భావించలేము.
వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా తెలంగాణలోని అధికార ప్రతిపక్షాలు రెండు కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు పరిగణనలోనికి తీసుకొని రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని కోరడంతో ఔచిత్యం ఎక్కడ వుంది? దిల్లీ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒక వైపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2013 తీర్పులో పొందు పరచిన ఆల్మట్టి జలాశయం ఎత్తు వ్యతిరేకిస్తూ మరో వైపు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు కేటాయించిన 194 టిఎంసిలను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీకి ప్రామాణికంగా తీసుకోవాలని కోరడం చట్ట విరుద్ధం కాదా ? ట్రిబ్యునల్ కూడా తన కేటాయింపులకు చట్ట బద్దత లేనపుడు వాటిని ప్రామాణికంగా ఏలా తీసుకొంటుంది? దిల్లీ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు 811 టిఎంసిలు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 65 శాతం నీటి లభ్యత కింద కేటాయించిన 49 టిఎంసిలు సరాసరి కింద కేటాయించిన 145 టీఎంసీలతో పోలవరం నీళ్లు 45 టీఎంసీలు మొత్తం 1050 టిఎంసిల్లో 70 శాతం అంటే 763 టిఎంసిలు తెలంగాణకు కేటాయించాలని కోరారు. తెలంగాణ 763 టిఎంసిలు కాదు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరినట్లు 904 టిఎంసిలు కోరడంలో తప్పు లేదు. అది వారి డిమాండ్ కు తను చెప్పిన తీర్పుకు చట్ట బద్దత లేనపుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అయినా ఆ కేటాయింపులను ప్రామాణికంగా తీసుకొంటే చట్ట విరుద్ధమౌతుందని తెలియదని భావించలేము. ప్రస్తుతం విచారణ జరుపుతున్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అంశంలో న్యాయ సంబంధమైన సమస్యలు అనేకం ఉన్నాయి. ఒక వేళ చట్టబద్దత లేని తను కేటాయించిన నీళ్లను పరిగణన లోనికి తీసుకోక పోతే రెండు రాష్ట్రాల మధ్య మిగులు జలాల అంశం పెండింగ్ లో ఉండి పోతుంది. పైగా ఆంధ్ర ప్రదేశ్ సుప్రీంకోర్టు లో వేసిన కేసు కు లోబడి ట్రిబ్యునల్ తీర్పు ఉండే అవకాశం ఉంది. మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

-వి. శంకరయ్య
విశ్రాంత పాత్రికేయులు





