గుజరాత్ వడోదరా జిల్లాలో ఘటన
గుజరాత్: వడోదర జిల్లాలోని మహిసాగర్ నదిపై ఉన్న గంభీరా వంతెన ఒక్కసారిగా కుప్పకూలిన ప్రమాదం బుధవారం ఉదయం జరిగింది. ఈ ఘటనలో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న నాలుగు వాహనాలు నదిలో పడిపోగా తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు రెండు ట్రక్కులు, ఒక ఎకో వ్యాన్, ఓ పికప్ వ్యాన్, ఆటో రిక్షా నదిలో పడిపోయినట్లు గుర్తించామని వడోదర జిల్లా కలెక్టర్ అనిల్ ధమేలియా తెలిపారు. 1985లో ప్రారంభించిన ఈ వంతెన పాతది కావడం, కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు పడుతుండటం వల్ల వంతెన కూలిపోయి ఉండొచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. వడోదర-ఆనంద్ పట్టణాలను కలిపే ఈ వంతెన కూలడంతో ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 45 ఏళ్ల కింద ప్రారంభించిన ఈ వంతెన చాలాకాలంగా శిథిలావస్థలో ఉందని స్థానిక ప్రజలు అంటున్నారు. పలుమార్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ మరమ్మతులను పట్టించుకోలేదని తెలుస్తోంది. అయితే, ఆనంద్-వడోదర జిల్లాలను అనుసంధానించే ఈ వంతెన నిర్వహణ పనులు అవసరమైనప్పుడల్లా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి రుషికేష్ పటేల్ అన్నారు. కాగా, ఈ సంఘటనపై ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. వంతెన కూలడానికి గల కారణాలను పరిశోధించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.





