జర్నలిజం -’కాదు,ఇది’ఎర్న’లిజం..!      

మాయా దర్పణం -4

                జర్నలిస్టు కధనాలు కూడా ప్రజా అవసరాల కంటే తమ అనుకూలదారుల అవసరాలకు ప్రాధాన్యత పెరిగింది.యాజమాన్యం-జర్నలిజం మధ్య అంతరం పెరిగిపోతుంది.యాజమాన్యాల ఆస్థులు వందల,వేల కోట్లకు పరుగెత్తుతుంటే, జర్నలిస్టు కుటుంబాలకు ఇంకా చాలావరకు పూట గడవని స్థితినే ఉంది.వార్తలు నమ్ముకోవడం కంటే అమ్ముకునే వారి సంఖ్య పెరిగింది.ఇంతజేసిన పొట్ట నిండని, కుటుంబం గడవని జర్నలిస్టు ల సంఖ్య పెద్దగానే ఉంటుంది.అందుకే జర్నలిజం దారి తప్పింది.అది ఒక వ్యాపార వస్తువులా,సరుకులా మారిపోయింది.

           ఒకప్పుడు జర్నలిజం అంటే వార్త సేకరణలో పోటీ, సేకరించి వార్తను కళాత్మకంగా రాయడంలో పోటీ,ఈ రెండింటికి మించి ఆ జర్నలిస్టు వ్యక్తిత్వం కు గౌరవం ఉండేది.రాబడి,సంపాదన సంగతి పెరుమాళ్ కెరుక కానీ జర్నలిస్ట్ అంటే నిండైన, నిఖార్సైన సామాజిక వ్యక్తిత్వం సొంతం అయి ఉండేది. ప్రజలు కూడా ఆ మేరకు గౌరవం ఇచ్చేవారు.అన్యాయం కు గురైన ప్రజలు రాజకీయ నాయకుల ఇళ్ళకంటే, అధికారుల కార్యాలయాలు కంటే విలేకఖల ఇండ్లకు వెళ్ళి తమ బాధలు చెప్పుకోవడానికే క్యూ కట్టేవారు.అంటే జర్నలిస్ట్ ను సమాజం లో మోసం చేయడం తెలియని నమ్మకమైన వ్యక్తిగా భావించేవారు.ఇప్పుడు ఆ పరిస్థితి మారింది.ప్రజలకంటే ముందు,విలేఖరులే సుర్యోదయం కాకముందే నాయకులు ఇళ్ళు ముందు పడిగాపులు కాస్తున్నారు.అధికారులు లంచాలు అడిగితే వార్తలు రాసి నిలదీసే విలేఖరులే ప్రస్తుతం పైరవీ కారులు అవతారం ఎత్తి కార్యాలయాల చుట్టు చక్కెర్లుకొట్టి నయానో,భయానో పనులు అంటే పైరవీలు చేయించుకుంటున్నారు.ప్రజల నుండి నేరుగా ప్రతిఫలం ఆశిస్తున్నారు. కొందరైతే ముఠాలుగా ఏర్పడి దందాలు చేస్తున్నారు.మరికొందరు సమాచారం హక్కు చట్టం ఉపయోగించుకొని వాటి ఆధారంగా వచ్చిన నివేదికలను చూపి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారు.

మరికొందరైతే రియల్ ఎస్టేట్ లో తలదూర్చడం తోపాటు,దందాలలో భాగంగా భూముల పై కోర్టులో కేసులు వేసి అందిన కాడికి సెంటిమెంట్ పేరుతో దండుకుంటున్నారు.ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయం చుట్టూ చక్కెర్లు కొట్టి ఎవరు అధికారంలో ఉన్నా పాడి గేదె లాంటి పదవులు, కోట్లాది రూపాయల ఇండ్లు స్థలాలు కొల్లగొట్టే అతిలౌక్యపు జర్నలిస్ట్ ల సంఖ్య తక్కువేం లేదు. ఇట్లాంటి పరిస్థితి జర్నలిజం కు ఎందుకు వచ్చింది? గతంలో జర్నలిస్టులుగా నిరుద్యోగుల్లో,కాస్తా ఆసక్తి ఉన్న , వెసులుబాటు ఉన్న ఉన్నత విద్యావంతులు,వ్యక్తులు అ ఆరంగాన్ని ఆశ్రయించేవారు. జర్నలిజం ప్రవృత్తిగా,వృత్తిగా స్వీకరించారు .కానీ, ప్రస్తుతం ఆ లెక్క మారిపోయింది.పదిలోపు చదివిన జర్నలిస్టుల సంఖ్య ,కాస్తా దబాయింపు స్వభావం ఉన్న వారి సంఖ్య పెరిగిపోయింది. జర్నలిజం విలువలు కంటే వీరు మనీ ,ఎర్నింగ్ విలువలకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. జర్నలిజం ఫక్తు వ్యాపారం అయ్యింది.రాజకీయాల్లో అంతర్లీనంగా మారిపోయింది.ప్రజల సమస్యలకు బదులు రాజకీయ నాయకులు,అధికారులకు అవసరం అయిన వార్తలు రాయడం ఆ మేరకు ఖరీదు కట్టి వసూళ్ళు చేసుకోవడం ఓ కళగా జర్నలిజం అభివృద్ధి చెందింది. ఆ వసూలు చేసిన దాంట్లో వారు పనిచేసే పత్రిక లేక యూట్యూబ్ ఛానల్ కు ముందస్తు చెల్లింపులు చేసి జర్నలిస్టులుగా నియామకం అవుతున్నారు. కప్పం గట్టి వృత్తి లోకి వస్తున్న వారి సంఖ్య పెరిగి పోయింది.

గతంలో ఐదారు ప్రింట్ మీడియా, ఐదారు ఛానళ్ళు ఉంటే ఇప్పుడు విపరీతంగా ఛానళ్ళు పెరిగిపోయాయి.యూ ట్యూబ్ ఛానెల్ వచ్చిన తర్వాత కుప్పలుతెప్పలుగా జర్నలిస్టులుగా మారిపోయారు.సెల్ పోన్ , హ్యాండిల్ ఉంటే ఇక జర్నలిస్ట్ ..!గతంలో ప్రెస్ మీట్ పెడితే మర్యాదగా ఛాయ్ త్రాగడం కూడా గిల్టీగా ఫీలయ్యో విలువల నుండి, ఇప్పుడు ప్రెస్ మీట్ అంటే మనీ నింపిన కవరు, ఖరీదైన గిఫ్టులు, మంచి భోజనం ఏర్పాటు చేయాలసిందే. జర్నలిస్టు సంఖ్య జిల్లా కేంద్రం అయితే పది నుంచి వందకు పెరిగిపోగా,మండల కేంద్రం అయితే ఐదు నుంచి రెండు డజన్ల కు పెరిగిపోయింది.ఇప్పుడు ప్రజలకోసం పని చేసేవాళ్ళు కానీ,చిన్నాచితకా పార్టీలు గానీ విలేఖరుల సమావేశం పెట్టే అవకాశం లేదు.సమస్య ప్రజలదే అయినా దాన్ని కరివేపాకు లా వాడుకునే జర్నలిస్టు లే అధికం..! ఒకవేళ ప్రజలకు  అవసరం ఉన్నా దగ్గరగా వెళ్ళడానికి భయపడుతున్నారు. బాగా ధనికులు, అధికార పార్టీ నాయకులు,పెద్ద పెద్ద కంపెనీలు తప్ప అట్లాంటి సాహసం ఎవరూ చేయడంలేదు. ఒకచిన్న పార్టీ నాయకుడు చెప్పిన దాన్ని బట్టి తమ పార్టీ రాష్ట్ర స్థాయిలో కార్యాలయం, కార్యక్రమాల నిర్వాహణకు ఐన ఖర్చుతో పోలిస్తే, ప్రెస్ మీట్ కోసం, వార్తల కోసం జర్నలిస్టులకు ఇచ్చిన బడ్జెట్ ఎక్కువట..!దీన్నిబట్టి జర్నలిజం ప్రస్థుత పరిస్థితి అర్థం చేసుకోవచ్చు .

జర్నలిస్టు కధనాలు కూడా ప్రజా అవసరాల కంటే తమ అనుకూలదారుల అవసరాలకు ప్రాధాన్యత పెరిగింది.యాజమాన్యం-జర్నలిజం మధ్య అంతరం పెరిగిపోతుంది.యాజమాన్యాల ఆస్థులు వందల,వేల కోట్లకు పరుగెత్తుతుంటే, జర్నలిస్టు కుటుంబాలకు ఇంకా చాలావరకు పూట గడవని స్థితినే ఉంది.వార్తలు నమ్ముకోవడం కంటే అమ్ముకునే వారి సంఖ్య పెరిగింది.ఇంతజేసిన పొట్ట నిండని, కుటుంబం గడవని జర్నలిస్టు ల సంఖ్య పెద్దగానే ఉంటుంది.అందుకే జర్నలిజం దారి తప్పింది.అది ఒక వ్యాపార వస్తువులా,సరుకులా మారిపోయింది.అసలీ పరిస్థితికి మొదటి కారణం ఆయా పత్రికల యాజమాన్యాలు, మీడియా యాజమాన్యాలే అనడంలో అతిశయోక్తి లేదు.పత్రికా నిర్వాహణా పెట్టుబడుల్లో కి ఆశ్రిత పెట్టుబడి దారులు, రాజకీయ నాయకుల షేర్లు ఆహ్వానించడం,రెన్యూమరేషన్ ,లైన్ అకౌంట్ ఇవ్వకపోవడం,టార్గెట్లు పెట్టి యాడ్లు,వసూళ్ళకు తెరలేపడం,పత్రిక డిస్టిభ్యుషన్ కూడా పాత్రికేయులకే అంటగట్టడం లాంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి.”ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా?”అన్న విధంగా పరిస్థితి తయారైంది.

రెండవ అంశం నిరుద్యోగం విపరీతంగా పెరగడం,ఉపాధికి తమకు తాము ఎంపిక చేసుకునే సులువైన మార్గంగా జర్నలిజం ఎంపిక చేసుకోవడం,మూడవ అంశం రాజకీయ పక్షాలు,ధనాపేక్షగల వ్యాపార సంస్థలు జర్నలిజం తమ అనుకూల మైన అబద్దాలు,పుకార్లు, బూతు పురాణం తో ప్రత్యర్థుల ట్రోలింగ్ కు ఉపయోగించడం లాంటి చర్యలతో పతనం అంచులకు జర్నలిజం చేరింది.ఎలాంటి ఆధారాలు లేని తప్పుడు కధనాలు,బూతు పురాణాలు,పుక్కిటి కధనాలు పుట్టినిల్లుగా జర్నలిజం మారింది.  ప్రజలు కూడా ఏది నిజం? ఏది అబద్దం? తేల్చుకోలేని కన్ఫ్యూజన్ అంశంగా ప్రస్తుతం జర్నలిజం మారిపోయింది. జర్నలిజం వ్యాపార సూత్రం కాకూడదు. అది ఒక వృత్తి నిబద్దత.ప్రవృత్తి గా స్వీకరించ గలిగిన వ్యసనం. నైతిక సూత్రం,జీవన యానం.సచ్చిలమైన సమాచారం పొందే హక్కు ప్రజల హక్కు.ఇట్లాంటి స్థితి లో జర్నలిజం నే నమ్ముకుని ఉన్న కుటుంబాలు లేవా? ఉన్నాయి..చావలేక బ్రతకలేక వార్తలు చుట్టే ఆత్మ ప్రదర్శన చేస్తున్న వృత్తి నిబద్దత కలిగిన జర్నలిస్టు లు చాలా మంది ఉన్నారు.కాని,వారి పరిస్థితి ఇప్పుడు జీవచ్ఛవాలుగా కాలం వెళ్లదీస్తున్నారు. అటు నీతి బాహ్య విధానాలు మింగుడు పడక,ఇటు ప్రస్థుత కాలంలో ఇమడలేక గతాన్ని నెమరు వేసుకుంటూ బ్రతికే ఎర్నలిస్టులుకాని జర్నలిస్టులకు హాట్స్ ఆఫ్ ! నా నమస్కారం?

thirumal rao (1)
ఎన్.తిర్మల్
(సీనియర్ జర్నలిస్టు, రచయిత, సామాజిక కార్యకర్త)
సెల్:9441864514.
ఇమెయిల్:Thirumala.1960@gmail.com

ఎన్.తిర్మల్

(సీనియర్ జర్నలిస్టు, రచయిత, సామాజిక కార్యకర్త)

మొబైల్ :9441864514, ఇమెయిల్: thirmal.1960@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *