“నవంబర్ 1 లోగా 900 కోట్లు ప్రభుత్వం ప్రకటించిన విధంగా చెల్లించక పోతే, 3వ తేదీ నుండి కళాశాలలు మూసి వేస్తామని, మార్చి ఏప్రిల్ నెలలలో న8ర్వాహించే పరీక్షలకు సహకరించేది లేదని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి తగు చర్యలు చేపట్టడం అనివార్యం.”
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తెలుగు రాష్ట్రాల్లో విద్యా రంగంలో ఒక పెద్ద సంస్కరణగా నిలిచింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్య అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో 2008లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి దీన్ని ప్రవేశపెట్టారు. ప్రారంభంలో రెండు వేల కోట్ల రూపాయల వ్యయం ఉండగా, కాలక్రమంలో విద్యార్థుల సంఖ్య పెరగడం, కోర్సుల విస్తరణ జరగడం వల్ల ఇది ఏటా ఎనిమిది నుండి పది వేల కోట్ల వరకు చేరింది. ఈ పథకం ద్వారా ఇంజనీరింగ్, మెడిసిన్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్ తదితర కోర్సుల్లో చదివే సుమారు ఇరవై లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు. ఇంజనీరింగ్ కళాశాలల్లోనే ఏడు నుండి ఎనిమిది లక్షల మంది విద్యార్థులు పూర్తిగా ఈ పథకం ఆధారంగానే చదువులు కొనసాగించారు. మొదట్లో ఇది సామాజిక సమానత్వానికి దారి తీసే గొప్ప ఆలోచనగా నిలిచింది కానీ చెల్లింపులు ఆలస్యమవడం, బడ్జెట్ కేటాయింపులు తగినంతగా లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తాయి.
ప్రభుత్వం నుంచి సమయానికి నిధులు రాక విద్యాసంస్థలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఉపాధ్యాయులకు జీతాలు ఆలస్యమయ్యాయి, లైబ్రరీలు, లాబ్‌లు వంటి మౌలిక సదుపాయాల నిర్వహణ దెబ్బతింది. నాణ్యత తగ్గిపోవడంతో పాటు అనేక కళాశాలలు మూతపడ్డాయి. గత దశాబ్దంలో రెండు వందలకు పైగా ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ కళాశాలలు తలదాచుకోలేక మూసివేయ బడ్డాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విడివిడిగా అమలు చేసినప్పటికీ రెండు రాష్ట్రాల్లోనూ బకాయిలు వేల కోట్లలో పేరుకు పోయాయి.
ఈ నేపథ్యంతో విద్యార్థుల ఆందోళనలు తెలంగాణలో మరింత ఉధృతమయ్యాయి. బకాయిలు సకాలంలో చెల్లించాలని, కాలేజీల ఆర్థిక సంక్షోభం పేరుతో విద్యార్థులు నష్ట పోకూడదని విద్యార్థి సంఘాలు నిరసనలు వ్యక్తం చేశాయి. కళాశాల యాజమాన్యాలకు కాకుండా నేరుగా విద్యార్థుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు జమచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కూడా కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. విద్యాసంస్థలకు కాకుండా నేరుగా విద్యార్థుల వ్యక్తిగత ఖాతాల్లోనే నిధులు జమ చేసే విధానం పరిశీలనలో ఉంది. దీని వల్ల డబ్బుల దుర్వినియోగం తగ్గి విద్యార్థులకే ప్రయోజనం నేరుగా అందుతుంది. అయితే ఇలాంటి విధానం అమలు చేయాలంటే విద్యార్థులు నిజంగా కళాశాలల్లో చేరారన్నది, వారు తరగతులు హాజరవుతున్నారన్నది, కోర్సులు కొనసాగిస్తున్నారన్నది కచ్చితంగా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఈ సదుపాయం కూడా లోపాల పాలయ్యే ప్రమాదం ఉంటుంది.
ప్రస్తుతం తెలంగాణలో సుమారు 900 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని యాజమాన్యాలు చెబుతుండగా, విద్యార్థులు విద్య కొనసాగించడానికి తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వెనుకాడు తున్నాయి. ఫలితంగా అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మరోవైపు చెల్లింపులు ఆలస్యమవడం వల్ల ఉపాధ్యాయులు జీతాలు సమయానికి పొందలేక నిరాశలో ఉన్నారు. నవంబర్ 1 లోగా 900 కోట్లు ప్రభుత్వం ప్రకటించిన విధంగా చెల్లించక పోతే, 3వ తేదీ నుండి కళాశాలలు మూసి వేస్తామని, మార్చి ఏప్రిల్ నెలలలో న8ర్వాహించే పరీక్షలకు సహకరించేది లేదని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి తగు చర్యలు చేపట్టడం అనివార్యం.
ఈ పరిస్థితిలో పరిష్కార మార్గాలు అత్యవసరంగా అవసరం. ప్రభుత్వం విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తగిన బడ్జెట్ కేటాయింపులు చేసి త్రైమాసికాల వారీగా నిధులు విడుదల చేయాలి. అర్హులైన విద్యార్థుల వివరాలను పారదర్శకంగా ఆన్‌లైన్ ద్వారా ధృవీకరించి చెల్లింపులు జరగాలి. ప్రైవేట్ కళాశాలలు పూర్తిగా ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వీయ నిధులతో కొంత శాతం నిర్వహణ చేపట్టాలి. అదేవిధంగా విద్యార్థుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేసే విధానం అమలులోకి వస్తే వారు నేరుగా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం విద్యార్థుల భవిష్యత్తుకు ఒక శక్తివంతమైన సాధనం. కానీ సమయపాలన, పారదర్శకత, బాధ్యత లేకుంటే ఇది విద్యార్థులకే కాకుండా విద్యాసంస్థలకు, ఉపాధ్యాయులకు, సమాజానికి నష్టాన్ని కలిగిస్తుంది. అందువల్ల దీన్ని రాజకీయ వాగ్దానాల పథకంగా కాకుండా విద్యారంగ అభివృద్ధి పునాదిగా పరిగణించి అమలు చేయాలి. అప్పుడే ప్రతి విద్యార్థి తన చదువును ఆర్థిక ఇబ్బందులు లేకుండా కొనసాగించ గలుగుతాడు, ప్రతి విద్యాసంస్థ నిలదొక్కుకుంటుంది, సమాజం ముందుకు దూసుకుపోతుంది.
రామ కిష్టయ్య సంగన భట్ల
సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్…
9440595494





