ప్రధాని మోదీనే అవమానిస్తారా..

– పొన్నంనో, మహేశ్‌ గౌడ్‌నో సీఎం చేస్తారా
– సీఎం వ్యాఖ్యలకు బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు కౌంటర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25: రేవంత్‌ రెడ్డికి ఆస్కార్‌ అవార్డు కాదు.. భాస్కర్‌ అవార్డు ఇవ్వాలి.. నోబెల్‌ ప్రైజ్‌ కాదు, గోబెల్స్‌ ప్రైజ్‌ ఇవ్వాలి అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు సెటైర్లు వేశారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగా నరేంద్ర మోదీ బీసీ కాదని రేవంత్‌ రెడ్డి అవమానించారంటూ తీవ్రంగా మండిపడ్డారు. నరేంద్రమోదీ సీఎం అయ్యే ముందు నుంచే బీసీ.. అప్పటికే ఎన్నో కులాలు బీసీల్లో కలిసాయని గుర్తు చేశారు. ఇక రాహుల్‌ గాంధీ తల్లిదండ్రులు వేర్వేరు మతాలకు చెందినవారు.. ఆయన కులం ఏంటని రామచందర్‌రావు ప్రశ్నించారు. నిజాలు తెలుసుకుని సీఎం మాట్లాడాలన్నారు. బీసీి రిజర్వేషన్లపై తప్పుదారి పట్టించరాదన్నారు. దత్తాత్రేయని వైస్‌ ప్రెసిడెంట్‌ చేయమన్నట్టే తాము కూడా పొన్నం ప్రభాకర్‌ను లేదా మహేష్‌ గౌడ్‌ను సీఎం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం.. బీజేపీ బీసీ పక్షపాతి.. బీసీలను పార్టీకి దూరం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని అన్నారు.. తాము 42 శాతం రిజర్వేషన్‌కు మద్దతు ఇస్తున్నాం.. కేంద్రంపై నెపం నెట్టొద్దు.. రాష్ట్ర ప్రభుత్వంపై రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత ఉందని అన్నారు. బీజేపీలో ఉన్న రెడ్డి నేతలెవరూ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా లేరని, పార్టీ లీడర్‌ మహేశ్వర్‌ రెడ్డి కూడా ఈ విషయాన్ని తెలియజేశారని రామచందర్‌ రావు చెప్పారు. గవర్నర్‌ దత్తాత్రేయపై రేవంత్‌ రెడ్డికి ప్రేమ ఉండడం సంతోషం అన్నారు. కాగా, పార్టీలో పదవుల కోసం ఒత్తిడి చేయొద్దు, మనం అందరం పార్టీ కార్యకర్తలమే, పదవులు వచ్చిన వారు ఎక్కువ కాదు, రానివారు తక్కువ కాదు అని బీజేపీ కార్యకర్తలకు ఉద్బోధించారు. వారం రోజుల్లో పార్టీ కొత్త కమిటీని ప్రకటిస్తుందని, అందులో మొత్తం 20 మందిని నియమిస్తామని, 33 శాతం మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని రామచందర్‌ రావు చెప్పుకొచ్చారు. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సూచనల మేరకు పార్టీ నేతలు ఎక్కువ పర్యటనలు చేయాలని, కార్యకర్తల్ని కలవాలని సూచించారు. పార్టీ అంతర్గత సమస్యలు కుటుంబ సమస్యల వంటివే.. వాటిని బయటకు తీసుకురావద్దు అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *