భస్మాసుర హస్తంలా కాంగ్రెస్‌ పాలన

– 23 నెలల పాలనలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదు
– మీడియాతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు
– అసమర్థ, మోసాల పాలనపై బీజేపీ చార్జిషీట్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 1: మోసపూరితమైన మాటలతో అధికారంలోకి వచ్చి 23 నెలలు పూర్తయ్యాయి.. కానీ ఇప్పటికీ ఏ వర్గానికీ మీరు న్యాయం చేయలేదని బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ అసమర్థ, మోసాల పాలనపై చార్జిషీట్‌ను పార్టీ కార్యాలయంలో శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక విద్యార్థుల చదువులు ఆగిపోతున్నాయి.. కోట్లాది రూపాయల బకాయిలతో హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీ సేవలు సక్రమంగా అందడంలేదు.. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి చివరికి ప్రజలే మిమ్మల్ని మాఫీ చేయాలా అని ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చారు అని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఎన్నికలపుడు ఇచ్చిన హామీలలో ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. స్కూటీల కోసం విద్యార్థులు నిరసన ప్రదర్శన చేసిన ఘటన కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమన్నారు. మోసపూరిత వాగ్దానాలు, ఎన్నికల ముందు ఇచ్చిన ఆకర్షణీయ హామీలు ఇవన్నీ ప్రజలను మోసం చేసే రాజకీయ నాటకం మాత్రమేనని స్పష్టమవుతోందన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు ఓట్ల కోసం వేసిన వల మాత్రమేనంటూ, ఈ ప్రభుత్వం బీసీ వర్గాల ఆశలను కూడా వమ్ము చేసిందని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా ఓటు బ్యాంకు రాజకీయాల దారిలోనే నడుస్తోందన్నారు. ప్రజల ఆస్తులు, అభివృద్ధి, శాంతిభద్రతలకు మించి అధికారాన్ని కాపాడుకోవడమే ఆ పార్టీ ప్రధాన లక్ష్యమైపోయిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దేశ గౌరవం, జవాన్ల త్యాగాలు, జాతీయ భద్రత వంటి అంశాలపై అసభ్య వ్యాఖ్యలు చేయడం బాధాకరం.. బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్‌ నేతలు తమ వ్యాఖ్యలపై ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని, లేకుంటే సహించేది లేదని హెచ్చరించారు. ఈ చార్జిషీట్‌ ద్వారా ప్రజల ముందు కాంగ్రెస్‌ వైఫల్యాలను స్పష్టంగా ఉంచుతున్నాం. ప్రజలకు నిజాలు తెలియజేయడం తమ బాధ్యతగా భావిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తమ పనితీరు గురించి ప్రజలకు సమాధానమివ్వాలని డిమాండ్‌ చేస్తున్నామని అన్నారు.

సీతారాంపూర్‌ ఆలయ భూముల అమ్మకాన్ని రద్దు చేయాలి

ఎంపీ కొండా విశ్వశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సీతారాంపూర్‌ సీతారాముల స్వామి గుడికి చెందిన 1100 ఎకరాల ఎండోమెంట్‌ భూమిని ప్రభుత్వం నోటిఫై చేసి వ్యాపారులకు అమ్మేసింది.. ఇది పూర్తిగా అక్రమం అని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ భూమిని తిరిగి దేవాదాయ శాఖకు అప్పగించి రిజిస్ట్రేషన్‌ రద్దు చేయాలి కానీ అది కూడా చేయలేదు. అందువల్ల బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ ఒకటేనని స్పష్టమవుతోంది అని అన్నారు. జూబ్లీహిల్స్‌లో ప్రభుత్వ భూములు, డిఫెన్స్‌ భూములను ఖబర్‌స్తాన్‌లకు ప్రభుత్వం ఇస్తోంది. గుడి భూములను మాత్రం కబ్జా చేసి అమ్మేస్తున్నారు. గుడి భూముల విషయంలో వీరికి ధైర్యం ఎక్కువ. కానీ మసీదు భూములను మాత్రం ఎకరం కూడా తాకే ధైర్యం లేదు. ఇదే వీరి సెక్యులరిజం. ఇప్పుడు ఈ పని అభివృద్ధి కోసం అని చెప్పుకుంటున్నారు. కానీ ఇది అభివృద్ధి కాదు దేవాలయ భూములపై దాడి అని అభివర్ణించారు. రేపు మదర్సాలకు ఇస్తారు. ఇలా కొనసాగితే జూబ్లీహిల్స్‌ కూడా ఓల్డ్‌ సిటీలా మారిపోతుంది.. సాధారణ ప్రజలు అక్కడ నివసించలేని పరిస్థితి వస్తుంది.. అందుకే తాము ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్‌-ఎంఐఎం ఆగడాలను, మోసాలను, వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో బీజెఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి, మెదక్‌ ఎంపీ రఘునందన్‌ రావు, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌ రావు, రాష్ట్ర కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు లక్ష్మీబసవ నరసయ్య, పార్టీ సీనియర్‌ నాయకులు ప్రకాశ్‌ రెడ్డి, సంగప్ప, దిలీప్‌ ఆచారి, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *