అబద్ధాలు చెప్పడంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ దిట్ట

– అప్పుడు అభివృద్ధి సాధ్యం కానిది ఇప్పుడు అవుతుందా?
– బీజేపీి పాలిత రాష్ట్రాల్లో సన్న బియ్యం ఎందుకు ఇవ్వడం లేదు ?
– మంత్రి పొంగులేటి  ప్ర‌శ్న‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 6: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్ధి నవీన్‌ యాదవ్‌ గెలుపు తథ్యమని తెలిసి బీఆర్‌ఎస్‌, బీజేపీలు లేనిపోని అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి, పార్టీ రెహమత్‌ నగర్‌ డివిజన్‌ ఎన్నికల ఇన్‌చార్జి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ డివిజన్‌లో వివిధ పార్టీలకు చెందిన వందలాదిమంది నాయకులు మంత్రి పొంగులేటి సమక్షంలో పార్టీ రెహమత్‌ నగర్‌ డివిజన్‌ ఇన్‌చార్జి కొలను హనుమంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. వీరికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి మంత్రి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక కాంగ్రెస్‌ అభివృద్ది, సంక్షేమానికి, బీఆర్‌ఎస్‌ అబద్దాలకు మధ్య జరుగుతున్న యుద్దమని అన్నారు. గత పదేళ్లలో ఈ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిన బీఆర్‌ఎస్‌ ఇప్పుడు వేలాది కోట్లు ఖర్చు చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. అప్పుడు సాధ్యం కానిది ఇప్పుడు అవుతుందా అని ప్రశ్నించారు. రెండేళ్లలో కాంగ్రెస్‌ చేసిన అభివృద్దిలో భాగంగా ఇప్పుడు నియోజకవర్గంలో రూ.400 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని, 14వేల కొత్త రేషన్‌ కార్డులు వచ్చాయని, 8వేల మంది పేర్లు రేషన్‌ కార్డులలో చేరాయని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ప్రజలకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో సగం ఖర్చు కేంద్రానిదే అని కిషన్‌ రెడ్డి చెబుతున్నారని, అలాంటప్పుడు బీజేపీి పాలిత రాష్ట్రాల్లో ఎందుకు సన్న బియ్యం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రం ఆవిర్భావం నుంచి కూడా కేంద్రం వాటా పెరగడం లేదని, లబ్ధిదారుల సంఖ్యను పెంచడం లేదని విమర్శించారు. పేదలు కూడా ధనవంతులు తినే బియ్యంతోనే అన్నం తినాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టామని, రాష్ట్రంలో కొత్తగా 10 లక్షలకు పైగా రేషన్‌ కార్డులు ఇచ్చామని, అలాగే పదేళ్లుగా రేషన్‌ కార్డుల్లో పేరు నమోదు కోసం ఎదురుచూస్తున్న దాదాపు 13 లక్షల మంది పేర్లను రేషన్‌ కార్డులలో నమోదు చేశామని తెలిపారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ చెప్పే అవాస్తవాలను ప్రజలు నమ్మే స్ధితిలో లేరంటూ, ఈనెల 11న జరిగే ఎన్నికలో వాటికి బుద్ది చెబుతారన్న నమ్మకాన్ని మంత్రి పొంగులేటి వ్యక్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *