– గుజరాత్ వెళ్లి వివరాలు తెలుసుకోవాలి
– మండిపడ్డ మంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2:హైదరాబాద్ నగరంలో మూసీ ప్రక్షాళన చేసి గోదావరి నీటిని తెచ్చి కలపాలని సీఎం రేవంత్‌రెడ్డి యత్నిస్తుంటే బీజేపీ, బీఆర్‌ఎస్‌లు అడ్డుపడుతున్నాయని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. మూసీ ప్రక్షాళనతో నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. సబర్మతి నది ప్రక్షాళనకు, మూసీ ప్రక్షాళనతో సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అంటున్నారని, ఆయన మాటలన్నీ అవాస్తవాలని తమ పరిశీలనలో తేలిందన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సబర్మతి నదిని 22 కిలోమీటర్ల మేర ప్రక్షాళన చేయడానికి గుజరాత్ ప్రభుత్వం పది వేల మందిని తరలించినట్లు అక్కడి అధికారులే స్వయంగా చెప్పారని మంత్రి అన్నారు. విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలతో కలసి ఆయన గుజరాత్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్‌ను ఆదివారం సందర్శించారు. అలాగే విజయ డెయిరీ ఛైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, మదర్ డెయిరీ ఛైర్మన్ మధుసూదన్‌రెడ్డిలతో కలిసి ఆనంద్ అమూల్ పాల ఉత్పత్తి ప్లాంటును కూడా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సబర్మతి నీటిని ప్రక్షాళన చేసి పంటలకు అందిస్తున్నారని తెలిపారు. సబర్మతికి నీళ్లు నర్మదా నది నుంచి వస్తుంటే మూసీకి గోదావరి నుంచి తేవాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని వివరించారు. సబర్మతి ప్రక్షాళనకు 2004 నుంచి 2014 వరకు 10 వేల మందిని తరలించినట్లు గుజరాత్ అధికారులు చెప్పారని, కానీ ఎవరినీ తరలించలేదని రామచందర్‌రావు అబద్దాలాడుతున్నారని శ్రీహరి మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన చేపట్టకుండా మురికి కూపంలోనే బతుకుదామా అని ప్రశ్నించారు. రేవంత్ మూసీ ప్రక్షాళన చేస్తే ఎప్పటికీ సీఎంగా ఉండిపోతారని భయపడి బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారని చామల విమర్శించారు. హరీశ్, రామచందర్‌రావు సబర్మతి ప్రక్షాళన జరిగిన తీరు చూసి మాట్లాడాలన్నారు. అలాగే గుజరాత్ తరహాలో తెలంగాణలో పాడి రంగాన్ని అభివృద్ధి చేస్తామని, రైతులకు ఆదాయం, మహిళలకు ఆర్థిక సాధికారత, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని శ్రీహరి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.