– నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు
– 14న కౌంటింగ్.. అదేరోజు ఫలితాలు
– ఈవీఎంలపై తొలిసారి అభ్యర్థుల కలర్ ఫొటోలు
– వోటు వేయనున్న 7.43 కోట్ల మంది ఓటర్లు
– షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
న్యూదిల్లీ ,అక్టోబర్ 6: బిహార్ శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. రెండు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. 14న వోట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ ఖరారు చేసింది. పోలింగ్ తేదీలు, ఇతర వివరాలను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ సోమవారం విూడియా సమావేశంలో వెల్లడించారు. బిహార్‌లో మొత్తం 243 శాసనసభ స్థానాలుండగా ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చే నెల చివరి వారంతో ముగియనుంది. బిహార్‌లో నిర్వహించిన వోటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్‌ఐఆర్‌పై జ్ఞానేశ్ కుమార్ స్పందించారు. ఎస్‌ఐఆర్ ముసాయిదాను ఆగస్టు 1న విడుదల చేశాం., దానిని అన్ని రాజకీయ పార్టీలకు అందజేశాం.. అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేసే అవకాశం ఇచ్చాం., తుది జాబితాను సెప్టెంబర్ 30న ప్రకటించాం.. ఇప్పటికీ అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తాం అని తెలిపారు. ఈ ఎన్నికలను ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని జ్ఞానేశ్ చెప్పారు. 90 వేల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. 7.43 కోట్ల మంది వోటు వేయనున్నారని, వారిలో 3.92 కోట్ల మంది పురుషులు, 3.50 కోట్ల మహిళా ఓటర్లు ఉన్నారని చెప్పారు. 14 లక్షల మంది కొత్త ఓటర్లని సీఈసీ చెప్పింది. ఒక్కో బూత్‌లో 1200 మంది ఓటు వేసేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈవీఎంలపై తొలిసారి అభ్యర్థుల కలర్ ఫొటోలు వేసే పక్రియను ఈ ఎన్నికలతోనే ప్రారంభిస్తున్నామని తెలిపారు. రెండు దశల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. నవంబర్ 22లోపు ఎన్నికల పక్రియ పూర్తి చేస్తామని సీఈసీ చెప్పింది. వోటర్ల జాబితాపై అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ఆగస్టు 1న ఓటర్ల తుది జాబితా ప్రకటించామని సీఈసీ సభ్యులు తెలిపారు. బిహార్‌లో మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, ఓటర్ల జాబితాలో సవరణలకు ఇంకా అవకాశం ఉందని కూడా సీఈసీ తెలిపింది. నామినేషన్లకు 10 రోజుల ముందు కూడా వోటరు జాబితాలో మార్పులు చేసుకోవచ్చని సూచించింది. ఈసారి ఎన్నికల పక్రియ మరింత సులభతరం చేస్తున్నామని సీఈసీ వెల్లడిరచింది. మొదటి విడత ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ అక్టోబర్ 10న వస్తుంది. నామినేషన్ల దరఖాస్తుకు చివరి తేదీ 17. నామినేషన్ ఉపసంహరణ గడువు 20తో ముగుస్తుంది. నవంబర్ 6న మొదటి విడత ఎన్నికలు జరుగుతాయి. ఇక, రెండో విడత ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ అక్టోబర్ 13న విడుదల చేస్తారు. నామినేషన్ల దరఖాస్తుకు 20 చివరి తేదీ. ఉపసంహరణకు 23 వరకూ అవకాశం ఉంటుంది. తుది దశ ఎన్నికల పోలింగ్ నవంబర్11న జరుగుతుంది. నవంబర్14న కౌంటింగ్ చేపట్టి అదేరోజు ఎన్నికల ఫలితాలు విడుదల చేస్తారు. వృద్దులు, దివ్యాంగ ఓటర్లకు ఇంటి దగ్గరే ఓటింగ్ అవకాశం కల్పిస్తున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. ఎలాంటి ఫిర్యాదుకైనా 1950 నెంబర్‌కు ఫోన్ చేసే అవకాశం ఉంటుందని, సోషల్ విూడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. బిహార్ ఎన్నికల నుంచి కొత్తగా 17 సంస్కరణలు తీసుకొస్తున్నామని కూడా చెప్పింది. ఈ సంస్కరణలను భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా అమలు చేస్తామంది. ప్రస్తుతం బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. దీంతో జేడీయూ, భాజపా కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నీతీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ, రెండేళ్లకే నీతీశ్ ఎన్డీయేను వీడి ఆర్జేడీ, కాంగ్రెస్‌తో మహాగఠ్‌బంధన్‌లో చేరి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, ఈ బంధమూ ఎంతోకాలం నిలవలేదు. 2024 జనవరిలో మహా కూటమిని వీడిన జేడీయూ మళ్లీ ఎన్డీయేతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో మరోసారి నీతీశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



