నాటి జర్నలిజానికి నేటి జర్నలిజానికి ఎంతో తేడా

– విలువలతో కూడిన జర్నలిజాన్ని నడిపిన ఎంఎస్ ఆచార్య
– ఆచార్య విగ్రహావిష్కరణలో మంత్రులు దుద్దిళ్ల, పొన్నం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: ప్రముఖ తెలంగాణ పోరాటయోధుడు, సీనియర్ జర్నలిస్ట్ ఎం.ఎస్.ఆచార్య విగ్రహాన్ని హైదరాబాద్‌లోని గోపనపల్లిలోని జర్నలిస్ట్ కాలనీలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ శనివారం ఆవిష్కరించారు. ఆచార్య కుమారుడు మాడభూషి శ్రీధర్ రూపొందించిన ఈ విగ్రహ్నాన్ని శిల్పి ఉపేంద్ర తయారు చేశారు. ఎం.ఎస్.ఆచార్య పేపర్ బాయ్ నుంచి ఎడిటర్‌గా ఎదిగి జనధర్మ, వరంగల్ వాణి వంటి పత్రికలను నడిపి ఎన్నో అంశాలను వెలుగులోకి తీసుకొచ్చారని, ఆయన లాంటి జర్నలిస్టులు నేటితరం వారికి ఎంతో స్పూర్తి అని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు, పదిమందికి విషయాలు తెలియాలని తపించేవారని అన్నారు. వివిధ పత్రికల్లో పనిచేసి అక్షరాన్ని నమ్ముకున్న వ్యక్తిగా, చరిత్రలో నిలబడే వ్వక్తిగా ఆచార్య పేరు తెచ్చుకున్నారన్నారు. వారి కుమారుడు మూడభూషి శ్రీధర్ కూడా తండ్రి విలువలను ముందుకు తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. ఎం.ఎస్.ఆచార్య విగ్రహావిష్కరణకు రావడం తమకు గొప్ప అవకాశమని అన్నారు. అక్షరం అమ్ముడుపోయే వస్తువు కాదన్నారు. మారుతున్న ప్రపంచానికనుగుణంగా జర్నలిజం మారదు అని ఆయన అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ రంగం మీడియాలో అడుగుపెట్టడం శుభపరిణామం కాదనీ, అందరినీ నియంత్రించడం, జర్నలిజాన్ని డిక్టేట్ చేయడం సరికాదని అన్నారు. జర్నలిజం ఫీల్డ్‌లో కూడా రెడీమేడ్ కాకూడదనీ, గతంలో ఒక జర్నలిస్టు క్యారెక్టర్ చూస్తే ఒక ఇన్‌స్టిట్యూట్‌లా ఉండేదని, నేడు ఆ పరిస్థితి లేకపోవడం శోచనీయమని, విలువలతో కూడిన జర్నలిజాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత నేటి తరంపై ఉందని అన్నారు. జనధర్మ పత్రిక మళ్లీ రావడం చాలా సంతోషకరమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో నాటి తరం నుంచి నేటి తరం వరకూ అందరికీ స్పూర్తిని అందించిన వ్యక్తి ఎం.ఎస్.ఆచార్య అని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో చిన్న పత్రికలు ఎంతో ప్రముఖ పాత్రను పొషించాయనీ, అందులో జనధర్మ, వరంగల్ వాణి చాలా కీలక పాత్ర పోషించాయని కొనియాడారు. కాంగ్రెస్ అందరి పార్టీ అని, జర్నలిస్టులకు న్యాయం చేస్తుందని అన్నారు. తాము ప్రజాస్వామ్యాన్ని విశ్వసించాము.. కాబ‌ట్టే ఇంతవరకూ పేపర్, ఛానల్ పెట్టలేదన్నారు. జర్నలిస్టులు విలువలతో కూడిన విమర్శలు చేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదన్నారు. ప్రముఖులను మార్గదర్శంగా తీసుకొని నేటి తరం మీడియా ముందుకు వెళ్లాలని సూచించారు. మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎం.ఎస్.ఆచార్య కేవలం వరంగల్‌కే పరిమితమయ్యారని, వారు హైదరాబాద్‌లో ఉండి ఉంటే ఎక్కడో ఉండేవారని అన్నారు. వరంగల్‌లో జర్నలిస్ట్ అంటే ఎం ఎస్ ఆచార్యగారే. ఆయన వద్ద చాలామంది పనిచేశారు. వారి నుంచి ఎంతోమంది జర్నలిస్టులు ఎంతో నేర్చుకున్నారని అన్నారు. ఈ సొసైటీకి కూడా స్థలాలు వచ్చే విధంగా మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాలని కోరారు. సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మాండభేరి గోపరాజు మాట్లాడుతూ మంత్రులకు హౌసింగ్ సొసైటీ పరిస్థితిని వివరించారు. కాంగ్రెస్ హయాంలోనే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చారనీ, వారి వల్లనే మూడు కాలనీలు ఏర్పాడ్డాయని గుర్తు చేశారు. ఈ సొసైటీలోని నాన్ అలాటీస్‌కు న్యాయం చేసే విధంగా మంత్రులు ప్రయత్నించాలని కోరారు. నాన్న చూపిన బాటలోనే నడిచానని, ఆయన వల్లనే నేను ఇంతటివాడిని అయ్యానని, వారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని మాడభూషి శ్రీధర్ అన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరిక్రిష్ణ, సీనియర్ జర్నలిస్టులు ఎన్.రామచంద్రమూర్తి, ధరూరి వెంకటాచారితోపాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు, కాలనీవాసులు, ఆచార్య కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *