భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికే భూభార‌తి

– మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
భూభారతి చట్టం.. రైతుల చుట్టం
– 18 రాష్ట్రాల్లో భూభారతి పై అధ్యయనం
-జూన్ 2 నుంచి గ్రామాలకు రెవెన్యూ అధికారులు
-రెవెన్యూ వ్యవస్థ మ‌రింత బ‌లోపేతం
-త్వరలో ధర్మపురికి ఆర్డిఓ, సబ్ రిజిస్టర్ కార్యాలయాల మంజూరు
– ఎండపల్లి.. బీర్పూర్ కు మండల కార్యాలయాల మంజూరు

జగిత్యాల, ప్రజాతంత్ర, మే 17: భూభారతి చట్టం రైతుల చుట్టమని, రైతులు, ప్రజల భూ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని, పేదలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో లక్షలాదిమంది ప్రజలు, మేధావుల అభిప్రాయాలు సేకరించి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. శనివారం జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో భూభారతి పైలెట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సును మంత్రి  ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయ‌న‌తోపాటు ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా  పొంగులేటి మాట్లాడుతూ భూభారతి చట్టం దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని, 18 రాష్ట్రాలలో భూ చట్టాలపై అధ్యయనం చేశామని, అక్కడ భూ సమస్యలకు సంబంధించి ఏమేం చర్యలు చేపట్టారో తెలుసుకున్నామన్నారు.  పేదవారికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే అద్భుతమైన చట్టాన్ని తెచ్చామని తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, అందులో భాగంగానే జూన్ రెండు నుంచి రాష్ట్రంలోని పదివేల పైగా గ్రామాలను రెవెన్యూ అధికారులకు కేటాయిస్తామని చెప్పారు.
పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టిన రెవెన్యూ గ్రామ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వివిధ భూ సమస్యలకు సంబంధించి 13వేల దరఖాస్తులు వచ్చాయని, వీటిని సత్వరమే పరిష్కరించేందుకు దృష్టి పెట్టామని పేర్కొన్నారు. ప్రతి భూ సమస్యకు పరిష్కారం లభించే విధంగా భూభారతి చట్టాన్ని రూపొందించామని, తాసిల్దార్ స్థాయి నుంచి సిసిఎల్ఏ వరకు అధికారాలను వికేంద్రీకరించి రైతులకు మేలు జరిగేలా చూస్తున్నామన్నారు. భూ సమస్యలకు సంబంధించి అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
ఈ నెలాఖ‌రు వ‌ర‌కు రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ నిర్మాణం చేపట్టేందుకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి పూర్తి చేస్తామని, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు అందించి తీరుతామని స్ప‌ష్టం చేశారు. ఈ కార్యక్రమం ఐదేళ్ల వరకు కొనసాగుతుందని, ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తామన్నారు. ఈ నెలాఖరు వరకు ప్రతి నియోజకవర్గానికి 3500 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో 20 లక్షల ఇళ్లు కట్టించి ఇస్తామని, పేదల సొంతింటి కల నెరవేరుస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేపట్టాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 28 మండలాల‌కు చెందిన 28 గ్రామాల్లో భూభారతి పైలట్ ప్రాజెక్టు కింద రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. వీటిలో అత్యధికంగా సాదా బైనామాలకు సంబంధించిన భూ సమస్యలే వచ్చాయని తెలిపారు. భూభారతి చట్టంలో ట్రిబ్యూనల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని, భూమికి సరిహద్దులు ఏర్పాటు చేసుకోవడంతో పాటు భూ పంచాయతీలు రాకుండా చట్టంలో పలు అంశాలను పొందుపర‌చామని పేర్కొన్నారు. స్వచ్ఛందంగా భూమిని సర్వే చేసుకునే రైతులకు సంబంధించి పాసుబుక్ లో మ్యాపులను పొందుపరుస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్ సమయంలో భూమికి సంబంధించిన సర్వే మ్యాప్ ను కూడా పొందుపరుస్తామన్నారు. భవిష్యత్తులో భూ సమస్యలు రాకుండా కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని ఇందులో భాగంగా 10956 రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులను కేటాయిస్తామని తెలిపారు. డిసెంబర్ 31 కి భూమి అమ్మకాలు, కొనుగోళ్ల‌కు సంబంధించి పక్కాగా లెక్కలు తీసేలా భూభారతి చట్టం రూపొందించామని తెలిపారు.  రెవెన్యూ అధికారులు రైతులను ఇబ్బందులు పెట్టకుండా భూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ధర్మపురి లో ఆర్డీవో కార్యాలయం, సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ప్రకటించే జాబితాలో ధర్మపురి పేరే మొదటగా ఉంటుందన్నారు. ఇందిరమ్మ పాలన అంటేనే పేదల కష్టాలు తీరుస్తుందన్నారు.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
భూభారతి చట్టాన్ని రైతులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని  ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణకుమార్ కోరారు.  బుగ్గారం మండల కేంద్రంలో జరిగిన భూభారతి పైలెట్ ప్రాజెక్టు సదస్సులో మాట్లాడుతూ ధరణి వల్ల రైతులు అరిగోషపడ్డారని, భూభారతి చట్టం రైతులకు చుట్టమని చెప్పారు. రైతులు చట్టాన్ని ఉపయోగించుకొని భూ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ధర్మపురి లో రెవెన్యూ డివిజన్ కార్యాలయం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు చేయాలని మంత్రిని కోర‌గా సానుకూలంగా స్పందించారు.
గతంలో ఎన్నడూ చూడని విధంగా కనివిని ఎరుగని రీతిలో పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా పని చేస్తున్నదని, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు అహర్నిశలు కష్టపడుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు.భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం అద్భుతంగా ఉందన్నారు. భూభారతి చట్టం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమయంలో తనకు మాట్లాడే అవకాశం దక్కడం జీవితంలో మర్చిపోలేనని పేర్కొన్నారు.
844 ద‌ర‌ఖాస్తులు: క‌లెక్ట‌ర్
రైతులు ప్రజలకు సంబంధించిన భూ సమస్యలు పరిష్కరించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. బుగ్గారం గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకున్నామని, భూ సమస్యలకు సంబంధించి 844 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో అత్యధికంగా సాదాబైనామాకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయనీ, భూ సమస్యలను అన్నింటిని సత్వరమే పరిష్కరిస్తామన్నారు. గ్రామాల వారిగా రెవెన్యూ రికార్డులు భూ రికార్డులు భద్రంగా ఉండేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు.  ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పలువురు రైతులకు భూమి హక్కు పత్రాలను అందించారు. అంతకుముందు మంత్రి శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి శేష వస్త్రం, గజమాలతో ఘనంగా సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *