భూదాన్‌ భూములపై విచారణ కమిషన్‌ వేయడం లేదు

– హైకోర్టుకు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 28, ప్రజాతంత్ర భూదాన్‌ భూములపై విచారణ కమిషన్‌ వేయడంలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. ఇది కేవలం ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇందులో జోక్యం చేసుకోబోమని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్‌ నియామకం చేయాల్సిన అవసరం లేదని సోమవారం నివేదించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నెం.181, 182, 194, 195ల్లో భూదాన్‌ భూముల్లో అవకతవకలపై సీబీఐ, ఈడీలతో దర్యాప్తునకు ఆదేశించాలనే పిటిషన్లను జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారించారు. గత విచారణ సమయంలో విచారణ కమిషన్‌ వేసే యోచన ప్రభుత్వానికి ఉందో లేదో చెప్పాలని ఆదేశించారు. సోమవారం జరిగిన విచారణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదిస్తూ, ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల వినతిపత్రాల ఆధారంగా విచారణ కమిషన్‌ వేయాల్సిన అవసరం లేదన్నారు. ఆ ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. దీనిపై హైకోర్టు కల్పించుకుని, ఇదే విషయాన్ని కోర్టు రికార్డుల్లో నమోదు చేసి తదుపరి విచారణను మూసివేస్తామని చెప్పింది. రజనీకాంత్‌రెడ్డి వాదనలు కొనసాగిస్తూ, కమిషన్‌ వేస్తే వందల సంఖ్యలో వినతిపత్రాలు వస్తాయని, వాటిపై కమిషన్లు వేసుకుంటూ ప్రభుత్వం వెళ్లలేదని చెప్పారు. వెల్లువలా వినతి పత్రాలు ప్రభుత్వానికి చేరుతాయని, వాటిని పరిశీలించడం కూడా చాలా కష్టమన్నారు. ఈ కేసుకు సంబంధించి కౌంటరు దాఖలు చేస్తామని, వాదనల తర్వాత కోర్టు తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రతివాదులుగా ఐఏఎస్, ఐపీఎస్‌ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ సీబీఐ, ఈడీలతో దర్యాప్తు జరిపించాలంటూ ఇక్కడ పిటిషన్‌లు వేశారని, వినతి పత్రాలను ప్రధాన మంత్రికి కూడా పంపారని చెప్పారు. కేవలం ప్రచారానికి, బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు హైకోర్టులో పిటిషన్లు వేశారన్నారు. ఎకరా భూమికి సంబంధించిన వివాదంలోకి ఐఏఎస్, ఐపీఎస్‌లను లాగి విచారణ కమిషన్‌ ఏర్పాటు చేయాలని కోరడం అన్యాయమన్నారు.∙దిశ వంటి కేసులో సుప్రీం కోర్టు కమిషన్‌ ఏర్పాటు చేసిందని, ఇదేమీ అలాంటి జాతీయ స్థాయిలో సంచలనం రేకెత్తిన ఘటనకు సంబంధించిన కేసు కాదన్నారు. ఎకరా భూమి అదీ ప్రైవేటు వ్యక్తుల మధ్య ఉన్నందని చెప్పారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మొత్తం 700 ఎకరాలుండగా పిటిషనర్‌కు మూడు సర్వే నెంబర్లలో 1.30 ఎకరాలు ఉందని చెప్పారు. దీనిపై హైకోర్టు జోక్యం చేసుకుని, ఆ భూమికి సంబంధించిన ఆధారాలు సమర్పించడానికి ఒక్క రోజు గడువు ఇస్తున్నట్లు చెప్పింది. భూదాన్‌బోర్డు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మొత్తం 1.40 లక్షల ఎకరాలు ఉన్నాయని, వాటిలో 40 వేల ఎకరాలను పేదలకు పంపిణీ చేయగా, వాటిని ఇతరులకు అమ్ముకున్నారని చెప్పారు. దీనిపై హైకోర్టు.. అత్యున్నత లక్ష్యంతో దానం చేసిన భూములు అన్యాక్రాంతం కావడంతో శోచనీయమని, దానం చేసిన వాళ్ల స్ఫూర్తి దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ప్రతివాదులను ఆదేశించింది అదేవిధంగా ఈ వివాదం విచారణ కమిషన్‌ చట్ట పరిధిలోకి వస్తుందో లేదో చెప్పాలని పిటిషనర్లను ఆదేశించింది. విచారణ మంగళవారం కొనసాగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *