కుల గణన దేశ దిశను మారుస్తుంది

– దేశంలో ఎక్కడా ఇలాంటి సైంటిఫిక్‌ సర్వే జరగలేదు
– సర్వే నివేదిక సమర్పణ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి మల్లు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే. విశ్లేషణ ఈ దేశ దిశను మారుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల భవనంలో సర్వే నివేదిక సమర్పణ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ కుల సర్వే సమాచారం ఆధారంగా స్వతంత్ర మేధావుల కమిటీ చేసిన అధ్యయనం చరిత్రాత్మకమైనదని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రముఖులు, ఎలాంటి ముద్రలు లేని వివాదరహితులను కమిటీ సభ్యులుగా ప్రభుత్వం నియమించిందని తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన సర్వే దేశంలో ఇప్పటివరకు ఎక్కడా జరగలేదని, ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం గర్వంగా ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా తమ నాయకుడు రాహుల్‌ గాంధీ ఇచ్చిన మాట మేరకు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుల సర్వే చేపట్టిందన్నారు. కేబినెట్‌ మొత్తం సీరియస్‌గా చర్చించి ప్రశ్నాపత్రాలు రూపొందించి, లెక్కింపు, బ్లాక్‌ల ఏర్పాటు అన్ని కార్యక్రమాలు విజయవంతంగా ముగించుకొని కుల సర్వే నిర్వహించామని తెలిపారు. ఈ సర్వేను అసెంబ్లీలో ప్రవేశపెడితే సభ్యులు అనేక ప్రశ్నలు అడిగారు తప్ప లోపం ఉందని ఎవరూ చెప్పలేదని డిప్యూటీ సీఎం వివరించారు. కుల గణన సమాచారం వచ్చిన తర్వాత ఏం చేద్దాం, భవిష్యత్తు ప్రణాళిక ఏంటి అని సీఎం రేవంత్‌ రెడ్డి, కేబినెట్‌ సభ్యులం చర్చించి దేశంలోనే ఉన్నత స్థానంలో ఉన్న జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి, కంచ ఐలయ్య, ప్రవీణ్‌ చక్రవర్తి, తోరట్‌ వంటి మహామహులతో కమిటీ ఏర్పాటు చేసినట్టు వివరించారు. సమాజం పట్ల అనురాగం, నిబద్ధత, ప్రేమ ఉన్న వ్యక్తులు కమిటీలో సభ్యులుగా ఉన్నారని భట్టి తెలిపారు. కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కుల గణన కమిటీ చైర్మన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇంతమంది రెడ్లు ఉన్నప్పటికీ ఎలాంటి భేదాలు లేకుండా అణగారిన వర్గాలకు ప్రయోజనం చేకూర్చాలని బాధ్యతతో పనిచేయడంతో సర్వే నిర్వహణ, విశ్లేషణ కార్యక్రమంలో విజయవంతమయ్యామని తెలిపారు. కమిటీ సభ్యుల కష్టం చెప్పడానికి తనకు మాటలు రావడంలేదని, సామాజిక న్యాయం, సమానత్వం, సంపద పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. మేధావుల సూచనలను ప్రభుత్వం కచ్చితంగా వినియోగించుకుంటుందని డిప్యూటీ సీఎం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *