– జనవరి నుంచి విద్యుత్ ఉత్పాదన
-స్టేజ్-1లోని ఒకటవ యూనిట్‌ను జాతికి అంకితం చేసిన మంత్రులు
దామరచర్ల, ప్రజాతంత్ర, ఆగస్టు 1: యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్(వైటీపీఎస్)లోని అన్ని యూనిట్లను డిసెంబర్ చివరి నాటికి పూర్తిచేసి 2026 జనవరి నుండి పూర్తిస్థాయిలో విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్కమల్లు తెలిపారు. ఇందుకుగాను నిర్దేశించిన క్యాలెండర్ ప్రకారం పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఇదివరకే రూపొందించిన క్యాలెండర్‌ను తూ.చ తప్పకుండా పాటించాలన్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అట్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో కలిసి నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మించిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో 800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన స్టేజ్-1లోని ఒకటవ యూనిట్‌ను శుక్రవారం జాతికి అంకితం చేశారు. అంతేకాక రూ.970 కోట్లతో వైటీపీఎస్ ఆవరణలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే వనమహోత్సవం కింద మొక్కలు నాటారు. అనంతరం వైటీపీిఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ నిర్దేశించిన సమయంలోగా అన్ని యూనిట్ల ద్వారా విద్యుత్ అందించేందుకు వైటీపీఎస్ అధికారులు పనులను ప్రాధాన్యత క్రమంలో విభజించుకోవాలన్నారు. ఏడాది కాలంలోనే స్టేజ్-లోని రెండు యూనిట్లను పూర్తి చేసి విద్యుత్ అందించడం పట్ల ఆయన వైటీపీఎస్ అధికారులు, సిబ్బందిని అభినందించారు . డిసెంబర్‌లోగా మిగతా అన్ని యూనిట్లను పూర్తి చేసి 2026 జనవరి 1 నుండి పూర్తిస్థాయిలో విద్యుత్ అందించేలా సమయాన్ని, అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పనిచేయాలన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి ప్రొటోకాల్‌ను పాటించాలని, అంతేకాక యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో అన్ని సౌకర్యాలు బాగున్నాయనే విధంగా అభివృద్ధి చేయాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాల, హాస్పిటల్ నిర్మించి పరిసర ప్రాంతాల ప్రజలకు మేలు జరిగేలా చూడాలని చెప్పారు. పవర్ ప్లాంట్ ఆవరణలో డీఏవీ పాఠశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలను పవర్ ప్లాంట్‌లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా పనికొచ్చే విధంగా హాస్పిటల్ నిర్మాణం, అంబులెన్స్ ఏర్పాటు చేయాలన్నారు. బొగ్గు లారీలు, బూడిద లారీలతో రోడ్లు దెబ్బతిన్న కారణంగా సీసీ రోడ్లను మంజూరు చేశామని, యుద్ధప్రాతిపదికన రోడ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని, ఇందుకు సంబంధించి నష్టపరిహారం, భూసేకరణకు సంబంధించిన పనులు సైతం వెంటనే పూర్తి చేయాలని భట్టి ఆదేశించారు. నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ తాను పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలోనే విష్ణుపురం డబుల్ రైల్వే లైన్ మంజూరైందని, అయితే ఇప్పటివరకు పనులు పూర్తికాలేదని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని చెప్పారు. 93 కి.మీ డబుల్ లైన్ రైల్వే పనులకు సరైన నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి రానందున ఆలస్యం అవుతున్నట్లు తెలిపారు. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రహదారుల పూర్తికి రూ.280 కోట్లు మంజూరు చేయడమేకాక క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలిపారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసినప్పటికీ సామాజిక బాధ్యతగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ప్రాజెక్టు నుండి ఎలాంటి సహకారం అందించడం లేదని తెలిపారు. ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సీఎస్‌ఆర్ కింద నిధులు విడుదల చేశామని, ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.10 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. పాఠశాల, హాస్పిటల్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జెన్‌కో సిఎండి డాక్టర్ హరీష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైటీపీఎస్ ప్రస్తుత పరిస్థితిని వివరించారు. వైటీ పీఎస్‌కు సంబంధించి రెండు యూనిట్లను పూర్తి చేని, స్టేజి -2లో ఉన్న మూడు యూనిట్లు ఇదివరకే నిర్దేశించిన క్యాలెండర్ ప్రకారం పూర్తి చేయడం జరుగుతుందని, కంట్రోల్ యూనిట్లు, రైల్వే లైన్, ఇతర పనులపై ఆయన వివరాలు తెలియజేశారు.
గత ప్రభుత్వంలో రెండేళ్ల జాప్యం
ఉప ముఖ్యమంత్రి భట్టి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వైటీపీఎస్‌లోని యూనిట్-1ద్వారా 800 మెగావాట్ల విద్యుత్తు అందించే యూనిట్‌ను జాతికి అంకితం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జనవరి 21న రెండవ యూనిట్‌ను జాతికి అంకితం చేశామని, స్టేజ్-లోని అన్ని యూనిట్లు పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా, స్టేజి-2కు సంబంధించిన యూనిట్లలో టార్గెట్ ఏర్పాటు చేసుకుని డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు, జనవరి 26 నుండి పూర్తిగా అంకితం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం రెండేళ్లు వైటీపీఎస్‌కు సంబంధించిన పర్యావరణ అనుమతులను క్లియరెన్స్ తీసుకురాకపోవడం వల్ల ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయని, తాము అధికారంలోకి వచ్చాక ఒక సమయాన్ని నిర్దేశించుకుని అనుకున్న కార్యాచరణ ప్రకారం సంవత్సరం, నెల, వారానికి చేయాల్సిన పనులపై క్యాలెండర్ ప్రకారం ముందుకు వెళ్లి సంవత్సర కాలంలోని రెండు యూనిట్లు పూర్తి చేయడమేకాక ఈ డిసెంబర్ నాటికి మిగతా యూనిట్లు పూర్తి చేసేందుకు ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. పనులు ఆలస్యం కావడం వల్ల ప్రజలపై పడే భారాన్ని తగ్గించాలని క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. భూములు కోల్పోయిన వారికి గత ప్రభుత్వం పరిహారాన్ని గాలికి వదిలేస్తే తాము ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి ఉద్యోగాలు, పునరావాస కల్పన చేస్తున్నామని, పులిచింతల కింద చిట్యాల మండలంలో నష్టపోయిన రైతులకు కూడా ఉద్యోగాలు, పరిహారం అందజేస్తున్నట్లు వెల్లడిరచారు. శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్, హైడల్ డైరెక్టర్ బాలరాజు, కోల్ డైరెక్టర్ నాగయ్య, థర్మల్ డైరెక్టర్ వై.రాజశేఖర్ రెడ్డి, జెన్‌కో సివిల్ డైరెక్టర్ అజయ్, జెన్‌క్ణో హెచ్‌ఆర్ డైరెక్టర్ వి.కుమార్ రాజు, వైటీపీఎస్ పర్యవేక్షక ఇంజనీర్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు





