– డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన, ప్రణాళిక శాఖల మంత్రి భట్టి
– మధిరలో విద్యుత్ రంగం ఆధునీకరణకు నాంది
– 27.76 కోట్లతో భూగర్భ విద్యుత్ కేబుల్ పనులకు శ్రీకారం
మధిర, ప్రజాతంత్ర, అక్టోబర్ 28: భారీ వర్షాలు, తుఫాన్ల సమయంలో కూడా పట్టణంలోని ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా దిశగా చర్యలు చేపట్టామని డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన, ప్రణాళిక శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మధిర పట్టణంలో మంగళవారం రూ.27.76 కోట్లతో చేపట్టనున్న భూగర్భ విద్యుత్ కేబుల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యం నెరవేరాలంటే విద్యుత్ శాఖ చాలా కీలకమని, ప్రతీ రంగ అభివృద్ధికి నాణ్యమైన విద్యుత్ సరఫరా కీలకమని అన్నారు. మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం ఎదగాలని పాలసీలను రూపొందించుకుని ప్రభుత్వం సీరియస్‌గా పనిచేస్తోందని తెలిపారు. పట్టణ ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. పట్టణ పరిధిలో ముందస్తుగా రూ.27.76 కోట్లు ఖర్చు చేస్తూ 3.5 కి.మీ 33 కేవి లైన్, 17.3 కి.మీ 11కేవి లైన్, 15 కి.మీఎల్.టీ లైన్ భూగర్భంలో నిర్మిస్తున్నట్లు చెప్పారు. మధిర సబ్ స్టేషన్ నుంచి ఆత్కూరు రింగ్ రోడ్డు, విజయవాడ రోడ్డులోని హెచ్‌పీ గ్యాస్ గోడౌన్ (రెండు వైపులా), వైఎస్సార్ విగ్రహం నుండి అంబర్‌పేట చెరువు వరకు ప్రస్తుత 11 కేవి ఓవర్ హెడ్ లైన్లను భూగర్భంలో మార్చేందుకు ప్రతిపాదించామని, నందిగామ బైపాస్ రోడ్డు హెచ్‌పీ పెట్రోల్ బంకు నుండి డంప్ యార్డ్ వరకు భూగర్భ విద్యుత్తు లైన్ పనులు ప్రతిపాదించామని వివరించారు. భూగర్భ విద్యుత్ లైన్ల వల్ల పట్టణంలో వైర్లు వేలాడకుండా అందంగా కనపడుతుందని, కాలుష్యం, విద్యుత్ ప్రమాదాలు తగ్గుతాయని, రోడ్ల పక్కన మంచి చెట్లు పెంచుకోవచ్చని అన్నారు. విద్యుత్ సమస్యలపై 1912 ద్వారా వచ్చిన ఫిర్యాదులకు అధికారులు, సిబ్బంది వెంటనే హాజరవుతారని చెప్పారు. ఇందిరా గిరి జల వికాసం కింద సోలార్ పంప్ సెట్ల ద్వారా సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ పెంపు లక్ష్యంగా ప్రత్యేక పాలసీ తీసుకొచ్చామని, మహిళా సంఘాలతో రూరల్ ప్రాంతాల్లో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మఠ్టి విక్రమార్క చెప్పారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండి వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాష్ట్ర హస్తకళల సంస్థ అభివృద్ధి చైర్మన్ నాయుడు సత్యనారాయణ, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ శ్రీనివాసాచారి, ఆర్‌అండ్‌బి ఈఈ తానేశ్వర్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




