రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు
చింతకాని, ప్రజాతంత్ర, జులై 14: ఇందిరమ్మ ఇల్లు మొదలుపెట్టండి.. ప్రతివారం ఇంటి బిల్లులు చెల్లిస్తాం.. మీరు ఎంత త్వరగా నిర్మాణం పూర్తి చేసుకుంటే అంత త్వరగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అన్ని పార్టీలను పిలవండి.. అందరూ కలిసి ముగ్గుపోసే కార్యక్రమాన్ని పండుగలా చేయాలి.. గృహప్రవేశానికి పిలవండి వచ్చి పాలుపంచుకుంటా అని ఉప ముఖ్యమంత్రి భట్టి వికమ్రార్క అన్నారు. చింతకాని మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ఏ కుటుంబం కూడా ఇల్లు లేకుండా ఉండకూడదనేది, కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న పథకాలు ప్రజా ప్రభుత్వం హృదయాంతరాల్లోంచి వచ్చినవని చెప్పారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క ఇల్లు రాలేదు.. బయటకు వచ్చి చెప్పుకోవాలంటే భయం.. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పేరిట తాను చేపట్టిన పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర ప్రజలు తన చేయి పట్టుకుని నడిచారు.. ధైర్యంతో తమ బాధలు చెప్పుకున్నారు.. వచ్చేది ఇందిరమ్మ ప్రభుత్వం.. ఆ ప్రభుత్వంలో పేదలందరికీ ఇల్లు నిర్మిస్తామని ఆనాడే తాను హామీ ఇచ్చినట్టు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఆర్థిక భారం అయినా వెనుకాడకుండా మొదటి సంవత్సరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు ఖర్చు చేసే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతోందన్నారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగా రాష్ట్రంలోని వివిధ పార్టీల పెద్దలు మొదట నవ్వారు.. అలా నవ్విన వారే ఆశ్చర్యపోయేలా మొదటి సంవత్సరం మహిళా సంఘాలకు రూ.21,600 కోట్లు వడ్డీ లేని రుణాలు అందజేశామని తెలిపారు. తీసుకున్న రుణాలను ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియక ఆ రుణం భారంగా మారుతుందని మహిళా సంఘాలు ఆలోచిస్తుంటే ప్రభుత్వం ముందుకొచ్చి ఆ సంఘాలతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయించి వారికి ప్రతి నెలా కచ్చితమైన ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు భట్టి తెలిపారు. ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ ఈ తరహా కార్యక్రమం ఆలోచన, అమలు జరగలేదన్నారు. మహిళా సంఘాలు ముందుకొచ్చి సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం వ్యవసాయ భూములు లీజుకు అడిగితే ఇవ్వాలని రైతులకు సూచించారు. భూమిని లీజుకు ఇవ్వడం ద్వారా ఎకరాకు ఏడాదికి రూ.35 వేల ఆదాయం సంపాదించే అవకాశం ఉందని వివరించారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి 650 బస్సులను కొనుగోలు చేయించి ఆర్టీసీకి లీజుకు ఇప్పిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా మైక్రో ఇండస్ట్రియల్ పార్కులను ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేస్తుందని తెలిపారు. మహిళా సంఘాలకు రుణ బీమా సౌకర్యం కల్పిస్తున్నాం.. ఊహించని ప్రమాదం జరిగితే రూ.2 లక్షల రుణం మాఫీ అవుతుంది, మహిళా సంఘాల సభ్యులకు దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే రూ.10లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ప్రమాద బీమా సౌకర్యం సైతం కల్పించినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులకు యూనిఫామ్‌లు కుట్టే కార్యక్రమాన్ని మహిళా సంఘాలకు అప్పగిస్తున్నామన్నామన్నారు. ఇందుకు మహిళా సంఘాలకు కుట్టు శిక్షణ ఇచ్చేందుకు ట్రైనింగ్ సెంటర్లు పెడుతున్నామని, మధిర నియోజకవర్గంలోని ఐదు మండలాలకు ఇప్పటికే మిషన్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. మహిళా సంఘాలు ఉన్నతంగా ఆలోచించాలి, ఆత్మగౌరవంతో బతకాలి..అందరం కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని స్వర్గలోకంగా మారుద్దామంటూ డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు.





