– అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
– ఆలయ విస్తరణ, ప్రాకార నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి
– ఖమ్మంలో టిటిడి వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం
– దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో మంత్రి తుమ్మల సమీక్ష
భద్రాచలం ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : దక్షిణ అయోధ్య భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయానికి నూతన శోభ సంతరించుకొనుందని ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన భద్రాద్రి ఆలయ అభివృద్ధి పనులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పనులు శరవేగంగా చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్‌తో పాటు ఆలయ అభివృద్ధి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు దిశ నిర్దేశం చేశారు. ఆయన మాటల్లో ఇలా….
మాడ వీధుల విస్తరణకు దిశానిర్దేశం…
“ఆలయ విస్తరణ కోసం భూసేకరణ పూర్తయింది. ఇప్పుడు ఆలయం చుట్టూ ఉన్న మాడ వీధుల విస్తరణ పనులు, ప్రాకార గోడల నిర్మాణాలు తక్షణమే ప్రారంభించాలని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఆగమశాస్త్ర ప్రమాణాలకు అనుగుణంగా ఆర్కిటెక్ట్ రూపొందించిన డిజైన్లను ఫైనల్ చేసి ఆలయ రూపకల్పనను వేగవంతం చేయాలని సూచించారు.
ఆగమశాస్త్రానికి అనుగుణంగా రూపకల్పన
ఆలయ నిర్మాణంలో ప్రతి అంశం ఆగమశాస్త్రం ప్రకారం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. “భద్రాద్రి ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. దీనిలో ఏ దశలోనూ నిర్లక్ష్యం ఉండరాదు” అని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. భక్తులకు వసతి, రవాణా, పార్కింగ్, నీటి సదుపాయాలు వంటి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల సూచించారు. భద్రాద్రి రామాలయం పునరుద్ధరణ పూర్తయిన తర్వాత దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షించేలా ఉండాలని అన్నారు.
ఆలయ అభివృద్ధి పనులు సమయ పాలన ప్రకారం సాగుతున్నాయో లేదో నిరంతరంగా పర్యవేక్షించాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ప్రతి దశ పనుల పురోగతిపై అధికారులు సమయానుకూల నివేదికలు సమర్పించాలని సూచించారు.భద్రాద్రి రామాలయం పునరుద్ధరణ పనులు పూర్తయిన వెంటనే అక్కడ విశాలమైన యజ్ఞశాల, రామకోట మాడ వీధులు, ఆధునిక కట్టడాలతో కొత్త చరిత్ర సృష్టించనున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలోని ప్రాముఖ్యమైన దేవాలయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి తెలిపారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడేలా దేవాదాయ శాఖ పనులు పారదర్శకంగా కొనసాగుతున్నాయని, భద్రాద్రి రామాలయం అభివృద్ధి ద్వారా తెలంగాణలో ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి నాంది పలుకుతుందని అన్నారు. ప్రభుత్వం భక్తుల నమ్మకాన్ని కాపాడే విధంగా దేవాదాయ శాఖను పారదర్శకంగా నడిపిస్తోంది. ఆలయాల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను కాపాడుతూ అభివృద్ధిని సమతుల్యంగా కొనసాగిస్తాం” అని మంత్రి స్పష్టం చేశారు.
ఖమ్మంలో టిటిడి ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కోసం మూడు అనువైన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ టిటిడి అధికారులకు ప్రతిపాదించినట్లు తెలిపారు. “సోమవారం టిటిడి అధికారులు ఖమ్మం నగరానికి వచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి ఆలయ స్థలాన్ని ఖరారు చేస్తారని మంత్రి తుమ్మల వెల్లడించారు.
ఈ కొత్త ఆలయం నిర్మాణం పూర్తయితే ఖమ్మం జిల్లాలో భక్తి, పర్యాటక రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. తిరుమల తత్వం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో భక్తులకు మరింత దగ్గరగా ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుందని తుమ్మల అన్నారు.





