– క్షేత్రం అభివృద్ధికి కేంద్రం బాధ్యతగా వ్యవహరిస్తోంది
– బీజేపీ చీఫ్ రామచందర్‌రావు
భద్రాచలం, ప్రజాతంత్ర, జులై 30: గతంలో కిషన్ రెడ్డి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధికి రూ.98 కోట్లు కేటాయించారని, అందులో రూ.42 కోట్ల నుండి రూ.48 కోట్ల వరకు ఇప్పటికే విడుదలయ్యాయని, మిగిలిన నిధులు డీపీఆర్ వచ్చిన తర్వాత విడుదలయ్యే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ప్రదేశాన్ని రామాయణ సర్క్యూట్లో చేర్చాలని అప్పట్లోనే నిర్ణయించారని, ఈ క్షేత్రం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తోందని, తాను వ్యక్తిగతంగా, పార్టీ తరఫున ప్రయత్నం చేస్తాననని చెప్పారు. ప్రస్తుత సాంస్కృతిక శాఖ మంత్రిని కూడా కలిసి మాట్లాడతానన్నారు. గత ప్రభుత్వాలు గానీ, ప్రస్తుత ప్రభుత్వం గానీ భద్రాద్రి రాముడిపై గౌరవంగా వ్యవహరించలేదని, కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం, పాలకులు కూడా అభివృద్ధికి తగిన సహకారం అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘కొంతకాలంగా రాష్ట్రంలో హిందూ ఆలయాలపై, హిందూ సంస్థలపై దాడులు జరుగుతున్నాయి.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు బ్యాంకు రాజకీయాలే ముఖ్యమయ్యాయి.. అందుకే ఆలయాలపై దాడులు జరిగినా స్పందించడంలేద’న్నారు. మరోవైపు టీటీడీ భూములను మదర్సాలకు కేటాయించడం, ఆ భూముల్లో మార్కెట్ నిర్మాణాలు చేయడం జరిగాయి. ఇలా దేవాలయ భూములను ఇతర మతస్తులకు అప్పగించడం జరుగుతోంది. వీటన్నింటిని తీవ్రంగా ఖండిస్తున్నామని రామచందర్‌రావు అన్నారు. ఈ విధమైన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దేవాలయ భూములను తిరిగి దేవాలయాలకే కేటాయించే చర్యలు తీసుకోవాలన్నారు.
అడ్వొకేట్స్ ప్రొటెక్షన్ యాక్టు అవసరం
కొత్తగూడెం కోర్ట్ బార్ అసోసియేషన్ సభ్యుల సమావేశంలో రాంచందర్ రావు పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అడ్వకేట్లపై దాడులు జరుగుతున్నాయని, ఈ అంశంపై తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక మొదటగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశానని చెప్పారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ చాలా అవసరమన్నారు. తాను ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో అన్ని కోర్టులకు సరైన భవనాలు లేవని గుర్తించి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కొత్త కోర్టు భవనాల కోసం డిమాండ్ చేశానని, న్యాయవాదుల సంక్షేమానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.100 కోట్లతో ఏర్పాటు చేశామన్న సంక్షేమ నిధి ఏమైపోయిందనే విషయంపై ప్రశ్నించామని ఆయన తెలిపారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌పై గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా లేఖ రాశానని వివరించారు. తెలంగాణ ఉద్యమంలోనూ అడ్వకేట్ల పాత్ర మరువలేనిదన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డబ్బున్నవారు రాజకీయాల్లోకి ఎక్కువగా వస్తున్నారు.. కానీ ప్రజోపయోగమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులు, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్న మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి అని ఆకాంక్షించారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో 256 మంది అడ్వకేట్లు ఎంపీలుగా ఉన్నారని తెలిపారు. యంగ్ అడ్వకేట్లు తమ ప్రాక్టీస్‌ను చాలా సీరియస్‌గా తీసుకోవాలని, సీనియర్ అడ్వకేట్లు నెలకు ఒకసారి లెక్చర్ ద్వారా జూనియర్ అడ్వకేట్లకు మార్గదర్శనం ఇవ్వాలని రామచందర్‌రావు సూచించారు.



