నిత్య విద్యార్థులే ఉత్తమ వైద్యులు

– ప్రతిభ, నైతికత, కరుణ వృత్తిలో మూల సూత్రాలు
– ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: వైద్య వృత్తిలో ప్రతిభ, నైతికత, కరుణ అనేవి మూల సూత్రాలని, ఆధునిక ప్రపంచంలో వస్తున్న మార్పులకనుగుణంగా నిత్యం అధ్యయనం చేస్తూ వృత్తిని కొనసాగించే వారే ఉత్తమ వైద్యులుగా గుర్తింపు సాధిస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సికింద్రాబాద్‌లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. వైద్య రంగం మనకు నేర్పే ముఖ్యమైన పాఠం ఏమిటంటే చదువు ఎప్పుడూ ముగియదు.. శాస్త్రీయ జ్ఞానం మారుతూ ఉంటుంది.. సాంకేతికత అభివృద్ధి చెందుతుంది.. రోగుల అవసరాలు మారుతుంటాయి అని చెప్పారు. మీ వృత్తి ప్రయాణంలో మీరు ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన మూడు ముఖ్యమైన సూత్రాలు ఏమిటంటే మొదటిది వృత్తిపరమైన ప్రతిభను కొనసాగించడం. మీ జ్ఞానం, నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకోవడం, రెండవది నైతికత నిజాయతీతో సేవ చేయడం.. రోగుల నమ్మకం ఆరోగ్య సేవల పునాది, మూడవది కరుణను ఎప్పటికీ మర్చిపోవద్దు.. ఎందుకంటే వైద్య సేవల హృదయం మానవ సేవే అని వివరించారు.  2026 సంవత్సరపు పట్టభద్రులైన అందరికీ ఈ కాన్వకేషన్ ఒక ముఖ్యమైన మైలురాయి అని, ఎన్నో ఏళ్ల కృషి, అనేక రాత్రుల చదువు, క్లినికల్ శిక్షణలో గడిపిన గంటల సమష్టి ఫలితమే ఈ రోజు అని డిప్యూటీ సీఎం అభివర్ణించారు. అంతకంటే ముఖ్యంగా ఇది ఒక కొత్త అధ్యాయం ప్రారంభం.. ఇకపై మీరు సంపాదించిన జ్ఞానం సమాజ సేవగా మారాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు. డెంటిస్ట్రీ.. వైద్య రంగంలోని ఇతర శాఖల మాదిరిగా ఒక వృత్తి మాత్రమే కాదు.. అది ప్రజల నమ్మకానికి ప్రతీక. మీ క్లినిక్‌కు వచ్చే ప్రతి రోగి వైద్య సహాయం కోసం మాత్రమే కాదు.. మీ నిర్ణయంపై, మీ దయపై విశ్వాసంతో వస్తాడు.. మీ నైపుణ్యంతో మీరు వారి నొప్పిని తగ్గిస్తారు, వారి ఆత్మవిశ్వాసాన్ని తిరిగి అందిస్తారు అని చెప్పారు. నిజంగా చెప్పాలంటే వారి జీవితాల్లో మళ్లీ చిరునవ్వులు పూయిస్తారని, ఈ బాధ్యతను మీరు ఎల్లప్పుడూ వినయం, నైతికత, మనస్ఫూర్తితో నిర్వర్తించాలి అని డిప్యూటీ సీఎం సూచించారు. ఈ రోజు పట్టభద్రులలో పెద్ద సంఖ్యలో యువతులు ఉండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇది మన సమాజంలో జరుగుతున్న ఒక మంచి మార్పును సూచిస్తున్నదన్నారు. ఆరోగ్య రంగం, పరిశోధన, నాయకత్వం వంటి అనేక రంగాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారంటూ మీరు సాధించిన విజయాలు మీ తర్వాత ఈ మార్గంలో రావాలనుకునే మరెంతోమందికి ప్రేరణగా నిలుస్తాయి అని అన్నారు. ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ వంటి విద్యాసంస్థలు ఈ ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన దంత వైద్య సేవలు అందించడం, తెలంగాణవ్యాప్తంగా నిర్వహిస్తున్న కమ్యూనిటీ ఆరోగ్య కార్యక్రమాలు, విద్య, సేవ ఒకటిగా ఎలా సాగవచ్చో చూపిస్తున్నదని అన్నారు. అలాగే, తెలంగాణలో నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(ఎనఐఆరఎఫ్) ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న ఏకైక డెంటల్ కళాశాలగా ఈ సంస్థ నిలవడం గర్వకారణమన్నారు. దీనికి నిర్వహణ వర్గం, అధ్యాపకులు, విద్యార్థులు అందరి కృషి కారణం అంటూ ఈ విజయానికి సంబంధించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రభుత్వం తరఫున పట్టభద్రులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. కార్యక్రమంలో కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రమేష్ రెడ్డి, తెలంగాణ డెంటల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కె.రాజేష్ రెడ్డి, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మమత కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *