’డబుల్‌‘ ఇండ్లు లబ్దిదారులే పూర్తిచేసుకోవచ్చు

ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల సహాయం
2.65 లక్షల మంది లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు
రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 16 : అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను పూర్తిచేయడానికి కాంట్రాక్టర్‌ ముందుకు రాని పక్షంలో లబ్దిదారులే వాటిని పూర్తిచేసుకోవడానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో ఇండ్ల స్ధలాలు లేని అర్హత కలిగిన లబ్దిదారులకు అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత కాంట్రాక్టర్‌ మోడ్‌ నుంచి లబ్దిదారులు నేతృత్వంలోని నిర్మాణం (బిఎల్‌సి) మోడ్‌లో చేపట్టి పూర్తిచేయాలని నిర్ణయించినట్లు వెల్లడిరచారు. సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్లు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణం, మౌలిక వసతులపై అధికారులతో సోమవారం సమీక్షించారు. గత తొమ్మిదిన్నరేళ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్‌ఎస్‌ పాలకులు అవసరమైన వారందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు నిర్మించి ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. పదేళ్లలో 60 వేల ఇండ్లను మాత్రమే అరకొరగా పూర్తిచేశారని, తాగునీరు, సిమెంట్‌ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్‌ వంటి కనీస సదుపాయాలను విస్మరించారన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల వద్ద మౌలిక వసతులు కల్పించడంతోపాటు అసంపూర్తిగా ఉన్న 1.61లక్షల ఇండ్లను రూ.640 కోట్లతో పూర్తిచేసి 98వేల మంది లబ్దిదారులకు కేటాయించామనిని మంతి పొంగులేటి తెలిపారు. ఇంకా 69 వేల ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని, వీటిని బిఎల్‌సి మోడ్‌లో పూర్తిచేస్తామన్నారు. ఇందుకోసం అర్హులైన లబ్దిదారులను గుర్తించి వారికి కేటాయించాలని, ఈ ప్రక్రియను వీలైనంత త్వరితగతిన పూర్తిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

2.65 లక్షల లబ్దిదారులకు మంజూరు పత్రాలు

ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇండ్లు నిర్మించాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకు సంబంధించి ఇప్పటివరకు 2.65 లక్షల లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేసినట్లు మంత్రి పొంగులేటి చెప్పారు. ఇప్పటివరకు 71వేల ఇండ్లు గ్రౌండిరగ్‌ అయ్యాయన్నారు. దాదాపు మూడు వేల ఇళ్లు గోడలు, శ్లాబ్‌ల వరకు పూర్తయ్యాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *