- హక్కుల సాధనకు యువత ముందుకు రావాలి
- తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు
హైదరాబాద్ : తెలంగాణలో 42% రిజర్వేషన్లు (BC Reservations) సాధించే వరకు విశ్రామించేది లేదని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు స్పష్టం చేశారు. కూకట్పల్లి, యెల్లమ్మ బండ, గోదా కృష్ణ కళ్యాణ మండపంలో ‘బీసీ యువ గర్జన’ కార్యక్రమం జాతీయ బీసీ యువసేన అధ్యక్షుడు పెచ్చేటి మురళి రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. సమన్వయకర్తగా గాజుల రామారాం కార్పొరేటర్ రవుల శేషగిరిరావు వ్యవహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది బీసీ యువత తరలివచ్చి, తమ హక్కుల కోసం గళమెత్తారు.
సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు (Dr Vakulabharanam Krishnamohan Rao) మాట్లాడుతూ.. “గత 19 నెలలుగా బీసీ రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వం తప్పుడు విధానాలను అవలంబిస్తూ మోసం చేస్తోందన్నారు. దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలతో ప్రయోజనం లేదు. రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన మార్గాలతోనే రిజర్వేషన్లు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జిఓల ఆధారంగా ఏర్పడిన కమిషన్లు న్యాయస్థానాల్లో నిలబడవని ఆయన పేర్కొన్నారు.
“చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన కమిషన్లు కాకుండా తాత్కాలికంగా నియమించిన కమిషన్ల సిఫారసులు చెల్లవని అన్నారు. న్యూదిల్లీలో ధర్నాలు నిర్వహించడం, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇవ్వడం వల్ల కాలయాపన తప్ప అసలు పరిష్కారం కాదని డాక్టర్ వకుళాభరణం విమర్శించారు. “యువతే మార్పునకు బాట” “బీసీ యువత ఉద్యమిస్తే సాధించలేనిది ఏమీలేదు. హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు రావాలి. సమాజంలోని వెనుకబడిన వర్గాల సాధికారతకు యువతే మార్గదర్శి” అని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్త ఉద్యమాల హెచ్చరిక “బీసీ యువ గర్జనలు ఇక్కడితో ముగియవు. రాష్ట్రమంతటా ప్రతి జిల్లాలో భారీ ఉద్యమాలను చేపడతామని. 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రామించేది లేదని అని స్పష్టం చేశారు.
ఏకతాటిపైకి వచ్చిన బీసీ సమాజం ఈ సభలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బీసీ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వందలాది బీసీ యువత ఏకస్వరంతో నినాదాలు చేస్తూ సభ ప్రాంగణాన్ని మార్మోగించారు. “మా హక్కులు – మా రిజర్వేషన్లు”, “42% సాధించాలి – వెంటనే అమలు చేయాలి” వంటి నినాదాలు ప్రత్యేక ఉత్సాహాన్ని తెచ్చాయి. బీసీల హక్కుల సాధన కోసం నిర్వహించిన ఈ ‘బీసీ యువ గర్జన’ కేవలం ఒక సభగాక, భవిష్యత్తులో పెద్ద ఉద్యమాలకు నాంది పలికే చరిత్రాత్మక వేదికగా నిలిచింది.





