– కేంద్రానికి రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 31: కేంద్ర ఓబీసీ జాబితాలో 40 కులాలను చేర్చాలని రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర ఓబీసీ జాబితాను 2016లో ప్రకటించిందన్నారు. అయితే అప్పటికే రాష్ట్ర బీసీ జాబితాలో 112 కులాలుండగా కేంద్రం మాత్రం 90 కులాలతో మాత్రమే జాబితా ప్రకటించిందని, అనంతర కాలంలో రాష్ట్ర జాబితాలో అనాధలను, మరో 17 కులాలను రాష్ట్ర ప్రభుత్వం చేర్చడంతో రాష్ట్రంలోని బీసీ జాబితాలో మొత్తం కులాల సంఖ్య 130కి చేరిందని తెలిపారు. దాంతో కేంద్ర జాబితాలో చేర్చవలసిన కులాల సంఖ్య 40కి చేరిందని, కేంద్ర జాబితాలో లని కులాలను చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం 2016 నుండి వివిధ దఫాలుగా కేంద్రాన్ని కోరుతూ వస్తున్నదన్నారు. 2016 నుంచి 2020 వరకు అప్పటి బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ లేఖలు రాశారని, 2021 డిసెంబర్‌లో మొత్తం 40 కులాలను కేంద్ర జాబితాలో చేర్చే విషయంలో జాతీయ బీసీ కమిషన్ ఆధ్వర్యంలో దిల్లీలో విచారణ కూడా జరిగిందన్నారు. ఆ తర్వాత 2023 సెప్టెంబర్ 5న జాతీయ బీసీ కమిషన్ అధ్యక్షుడు హంసరాజ్ గంగారామ్ ఆహీర్ ఆధ్వర్యంలో మరోమారు న్యూదిల్లీలో విచారణ చేపట్టినప్పటికీ ఈ 40 కులాలను కేంద్ర జాబితాలో చేర్చే విషయంలో కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించలేదని ఆయన వెల్లడిరచారు. దీంతో ఈ 40 కులాలకు చెందినవారు కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలలో, ఉద్యోగరంగంలో తమ అవకాశాలను కోల్పోతున్నారని, కావున ఈ 40 కులాలను వెంటనే కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్‌కు నిరంజన్ లేఖ రాశారు.





