– బిజెపి నేతలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సవాల్
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై25: బీజేపీ అగ్రకుల పార్టీ అని, బీసీ బిల్లుకు ఆమోదం తెలపకుండా ఆ పార్టీ నేతలు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆక్షేపించారు. బిసిలపై చిత్తశుద్ది ఉంటే వెంటనే బిల్లును ఆమోదించేలా ఒత్తిడి తేవాలన్నారు. బిల్లును ఆమోదించాలని కేంద్రం, భాజపా అధిష్ఠానాన్ని ఎంపీ రఘునందన్‌రావు ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కావొద్దని ఆయన కోరుకుంటున్నారని మండిపడ్డారు. మా పీసీసీ అధ్యక్షుడు బీసీ బిడ్డ. మరి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? బీసీలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్ఠానాన్ని ఎందుకు డిమాండ్ చేయట్లేదు? మేం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో అన్ని అవకాశాలు కల్పించి తీరుతాం. బీసీ బిడ్డ కాకపోయినా మా సీఎం రేవంత్‌రెడ్డి బీసీ బిల్లు తీసుకొచ్చారు. కాంగ్రెస్‌కు రఘునందన్‌రావు పాఠాలు అవసరం లేదు. సామాజిక న్యాయం అంటేనే కాంగ్రెస్. వల్ల కాకపోతే రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక బిల్లును ఆమోదించుకుంటాం అని ఆది శ్రీనివాస్ అన్నారు.



