హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్-2025 పోటీకి యువత నుండి అపూర్వమైన స్పందన లభించింది. ఈ పోటీకి 500కిపైగా షార్ట్ ఫిల్మ్స్, సాంగ్స్ సబ్మిషన్లు వచ్చాయి. రాష్ట్రంలోని యువ దర్శకులు, రచయితలు, టెక్నీషియన్లు ఈ పోటీలో తమ ప్రతిభను చూపారు. పోటీలో భాగంగా ఫిలిం మేకర్స్ తెలంగాణలోని ప్రజాపాలనపై సామాజిక అవగాహన కలిగించే షార్ట్ ఫిల్మ్‌లతోపాటు, తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, బతుకమ్మ పండుగను ప్రతిబింబించేలా వీడియో సాంగ్స్ రూపొందించి పంపారు. ఈ సందర్భంగా ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ తెలంగాణ యంగ్ ఫిలిం మేకర్స్‌లో సృజనాత్మకతను వెలికితీయడం, రాష్ట్ర సాంస్కృతిక గర్వకారణమైన బతుకమ్మ పండుగను ప్రపంచానికి పరిచయం చేయడం తమ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ప్రజాపాలన, తెలంగాణ చరిత్ర, బతుకమ్మ చరిత్ర వంటి అంశాలపై వచ్చిన వీడియోలు చూసి ఎంతో ఆనందించామన్నారు. ఎఫ్‌డిసి ఎండీ సిహెచ్. ప్రియాంక మాట్లాడుతూ తమ సృజనాత్మకతను ప్రదర్శిస్తూ తెలంగాణ ఆత్మను సినిమాల రూపంలో ప్రతిబింబించిన యువ కళాకారులకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ప్రముఖుల సమక్షంలో బహుమతుల ప్రదానోత్సవం నిర్వహిస్తామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





