బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా వుండాలి

– 2025-26 వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవాలి
–  రాజీవ్ యువ వికాస పథకానికి రూ. 6,250 కోట్లు సబ్సిడీ
-రూ.21వేల కోట్ల రైతు రుణ‌మాఫీ మొత్తం బ్యాంకుల్లో జ‌మ‌
– ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌

బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే ఆ సమాజం, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, కాబట్టి బ్యాంకింగ్ రంగం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన‌ని ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. హైదరాబాదులో బేగంపేటలోని మారిగోల్డ్ హోటల్ లో  గురువారం జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ ఎల్ బీసీ) సమావేశంలో ఆయ‌న ప్ర‌సంగించారు.  2025-26 వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవాలని బ్యాంక‌ర్ల‌కు సూచించారు. ఐదు లక్షల మంది యువతకు స్వయం ఉపాధి పథకం ద్వారా ఆర్థిక సహకారాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకం తీసుకొచ్చామ‌న్నారు.  రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకానికి రూ. 6,250 కోట్లు సబ్సిడీ రూపేణా అందిస్తున్న‌ద‌న్నారు. చదువుకొని ప్రజ్ఞ పాటవాలు మేధస్సు కలిగిన యువతను  ఉత్పత్తి రంగంలోకి తీసుకువచ్చి రాష్ట్ర జిడిపి పెరిగే విధంగా ఈ పథకం రూపకల్పన చేసిన‌ట్టు తెలిపారు. జూన్ రెండున ఐదు లక్షల మంది యువతకు రాజీవ్ యువ వికాసం మంజూరు లెటర్లు పంపిణీ చేస్తున్నాం. నిర్దేశించుకున్న ఈ లక్ష్యాన్ని అనుకున్న సమయంలోగా చేరుకోవడానికి బ్యాంకర్లు తగిన తోడ్పాటు అందించాల‌న్నారు.
అన్ని బ్యాంకుల అధికారులతో సమన్వయంగా పర్యవేక్షించ‌డానికి  రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియ‌మించిన‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు. ప్రజా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నది. ఇందులో ఉద్యానవన పంటలకు పెద్దపీట వేస్తున్నది. ఆయిల్ ఫామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామ‌న్నారు. రూ. 21 వేల కోట్లు  రైతు రుణమాఫీకి సంబంధించిన మొత్తాన్ని బ్యాంకుల్లో జమ చేశామ‌న్నారు.  రైతు భరోసా ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం. రైతు బీమా ప్రీమియం డబ్బులు ప్రభుత్వమే చెల్లిస్తున్నద‌ని గుర్తుచేశారు. అడవి బిడ్డల జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రజా ప్రభుత్వం ఇందిరా సౌర గిరి జల వికాస పథకం తీసుకొచ్చింద‌న్నారు. రూ. 12600 కోట్ల వ్య‌యంతో అటవీ ప్రాంతంలో ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు పొందిన‌ ఆరు లక్షల 70 వేల ఎకరాలను సౌర విద్యుత్తు ద్వారా సాగులోకి తీసుకువచ్చే నూతన పథకాన్ని ప్రారంభించామ‌న్నారు. ఈ ఏడాది మహిళా సంఘాలకు రూ.20,000 కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలు ఇచ్చామ‌న్నారు. రానున్న ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని చెప్పారు. మ‌హిళ‌ల చేత ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయించి వాటిని ఆర్టిసి సంస్థలో అద్దెకు నడిపించడం, మహిళలతో సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేయించడం లాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళుతున్నామ‌న్నారు.
రాష్ట్ర ప్రభుత్వం న్యూ ఎనర్జీ పాలసీ తీసుకువచ్చి 2030 సంవత్సర నాటికి రాష్ట్రంలో 20వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళుతున్నామ‌న్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తున్నామ‌న్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు.  పరిశ్రమల్లో పనిచేయడానికి కావలసిన శిక్ష‌ణ ఇందులో ఇప్పిస్తామ‌న్నారు. ప్రభుత్వం మూసి పునర్జీవం కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళుతున్నద‌న్నారు. ఔటర్ రింగ్ రోడ్ రీజినల్ రింగ్ రోడ్ మధ్యన అనేక రకాలైన క్లస్టర్ తో పారిశ్రామికీకరణ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నామ‌న్నారు.

సమావేశానికి హాజరైన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా,
ఎస్సీ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఇన్ శ్రీధర్, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రెటరీ శరత్, బీసీ వెల్ఫేర్ సెక్రెటరీ శ్రీధర్, ఆర్బిఐ రీజినల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్, నాబార్డ్ సీజిఎం ఉదయ్ భాస్కర్, ఎస్బిఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ కుమార్, ఎస్ ఎల్ బి సి కన్వీనర్ ప్రకాష్ చంద్ర తదితరులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *