బంగ్లాదేశ్‌లో ఆగని దాడులు

– వరుస దాడుల్లో హిందువుల హతం
– తాజాగా మరో హిందూ వ్యాపారి మృతి

ఢాకా, జనవరి 3: బంగ్లాదేశ్‌లో వరుస దాడులతో హిందువులు భయాందోళనలకు గురవుతున్నారు. ఆ దేశంలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వరుసగా హిందువులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవల ఖోకన్‌ చంద్ర దాస్‌(50) అనే వ్యాపారిపై కొందరు దుండగులు దాడి చేసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. వారి నుంచి తప్పించుకునేందుకు నాడు చెరువులో దూకిన ఆయన తాజాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు స్థానిక విూడియాలో కథనాలు వస్తున్నాయి. చంద్రదాస్‌ క్యూర్‌బంగా బజార్‌లో ఔషధాలు, మొబైల్‌ బ్యాంకింగ్‌ వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల దుకాణాన్ని మూసివేసి ఆటోలో ఇంటికి బయలుదేరగా మార్గంమధ్యలో కొందరు దుండగులు ఆటోను ఆపారు. పదునైన ఆయుధాలతో దాడి చేసి తలపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. వారి నుంచి తప్పించుకునేందుకు రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూకారు. తర్వాత స్థానికులు ఆయనను కాపాడి హాస్పిటల్‌కు తరలించారు. తమకు శత్రువులు ఎవరూ లేరని, ఆయనపై ఎందుకు దాడి చేశారో తెలియదని ఖోకన్‌ భార్య సీమా దాస్‌ పేర్కొన్నారు. విద్యార్థి నాయకుడు ఉస్మాన్‌ హాదీ హత్యతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దీపూదాస్‌ హత్య జరిగింది. కొన్ని రోజులకు సామ్రాట్‌ అనే వ్యక్తి గ్రామస్థుల మూక దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం బజేంద్ర బిశ్వాస్‌ అనే మరో వ్యక్తిని సహోద్యోగి కాల్చి చంపాడు. ఆ తర్వాత ఖోకన్‌పై దాడి జరగ్గా ఆయన తాజాగా మరణించాడు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *