తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత వెలువడిన తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ ను ఆది నుంచి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. లీకేజీ కారణంగా ఒకసారి, హాజరులో వచ్చిన వ్యత్యాసం కారణంగా మరోసారి ప్రిలిమ్స్ పరీక్షలు రద్దు కావడం, తిరిగి కొత్త నోటిఫికేషన్ వెలువడడం, ప్రిలిమ్స్ 3.0 ను నిర్వహించడం, మెయిన్స్ పరీక్షలకు అర్హత జాబితా వెలువర్చడం, తదనుగుణంగా మెయిన్స్ పరీక్షలు నిర్వహించబడడం చకచకా జరిగిపోయాయి. అయిననూ వివాదాలు మాత్రం ఇంకా టీజీపీఎస్సీని వెంటాడుతూనే ఉన్నాయి.
మెయిన్స్ పరీక్షల నిర్వహణ తీరుపై, వెలువడ్డ ఫలితాలపై పలు అనుమానాలను వ్యక్తపరుస్తూ కొందరు అభ్యర్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. అటు అభ్యర్థుల తరఫున, ఇటు టీజీపీఎస్సీ తరఫున వాద,ప్రతి వాదనలను విన్న కోర్టు నియామక ప్రక్రియ మీద నిలుపుదల ఉత్తర్వులను విడుదల చేసింది. మరోపక్క అభ్యర్థులు టీజీపీఎస్సీ పరీక్షల నిర్వహణ తీరు మీద, అభ్యర్థులు లేవనెత్తిన పలు అనుమానాల మీద సరైన వివరణ ఇవ్వాలని కోరుతూ గత ఏప్రిల్ 30వ తేదీన టీజీపీఎస్సీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాయడంతో వివాదం మరింత ముదిరింది. ఆ లేఖలో ఏముంది? టీజీపీఎస్సీ సమాధానం ఏంటి? వివాదాలను అధిగమించేందుకు మధ్యేమార్గంగా పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకుందాం.
బండి సంజయ్ తన లేఖలో పలు అంశాలకు వివరణ కోరగా, మరికొన్ని అంశాల మీద కొన్ని ప్రశ్నలను సంధించారు. మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాలో ప్రిలిమ్స్ మెయిన్స్ హాల్ టికెట్ నంబర్లు, వయసు, కేటగిరి, మీడియం, లింగం మరియు పేపర్ వారీగా పొందిన మార్కులు వంటి పూర్తి వివరాలు బహిరంగ పరచడంతో పాటు పరీక్షా కేంద్రాల వారిగా అసమాన ఫలితాలు చోటు చేసుకోవడంపై సరైన వివరణను కోరారు.
అట్లే జనరల్ ర్యాంకింగ్ లిస్టు కంటే ముందే ప్రొవిజినల్ ర్యాంకింగ్ లిస్టు అందించక పోవడానికి గల కారణం ఏంటని, నోటిఫికేషన్ లో పేర్కొన్న నిబంధనలు 15.2 మరియు15.3 ఉల్లంఘనకు గల కారణాలు ఏంటని, అట్లే సుప్రీంకోర్టు ఆదేశానుసారం యూపీఎస్సీ తరహాలో మూల్యాంకన ప్రక్రియను మోడరేషన్ చేయకపోవడానికి గల కారణాలు ఏంటని, బయోమెట్రిక్ హాజరులో వ్యత్యాసం ఎందుకొచ్చిందని, ఫలితాల ప్రకటనకు ముందే డేటా లీక్ ఎలా జరిగిందని, మెయిన్స్ హాల్ టికెట్ల నంబర్లు కేంద్రాల కేటాయింపు యాదృచ్ఛికంగా జరిగినదా? లేదా దానిలో ఏమైనా మానవ ప్రమేయం దాగి ఉన్నదా? అంటూ పలు ప్రశ్నలను సంధించారు. టీజీపీఎస్సీ వెంటనే స్పందించి అటు అభ్యర్థులకు ఇటు తెలంగాణ సమాజానికి సమాధానమిచ్చి తన పారదర్శకతను చాటుకోవాలని సూచించారు. కానీ ఇంతవరకు టీజీపీఎస్సీ నుండి ఎలాంటి సమాధానం రాలేదు.
ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం తీసుకువచ్చిన కొన్ని జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టకపోవడంతో ఆ జీవోలు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఉన్నాయా? లేవా? అనే విషయాలు తెలియడం లేదని, అట్లే వాటి ప్రభావం నియామక ప్రక్రియలో ఏ మేరకు ఉంటుందో అంచనా వేయలేకపోతున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవో 29 రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నదనే ఉద్దేశంతో కోర్టులను ఆశ్రయిస్తే ఆలస్యం కారణంగా పిటిషన్లను కొట్టివేశారని అభ్యర్థులు వాపోతున్నారు. మరోపక్క రాజ్యాంగపరమైన అంశాలపై ఆలస్యం అనే కారణంగా పిటిషన్లను కొట్టివేయరాదని అది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధమని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సమాచార హక్కు చట్టం ద్వారానైనా పూర్తి వివరాలను తెలుసుకోవాలని ఆరాటం చెందే వారికి అడుగడుగునా చుక్కెదురవుతున్నదని, ఆ చట్టం సామాన్యునికి అందని ద్రాక్షగానే మిగిలిపోయిందనే నిరాసక్తత బలంగా వినిపిస్తోంది. అధికారుల నిర్లక్ష్యమో లేక వారి ఉదాసీనతో తెలియదు గానీ సమాచారం మాత్రం సామాన్యునికి సకాలంలో అందడం లేదని ఒకపక్క ప్రజాస్వామికవాదులు మరోపక్క సమాచార హక్కుల కోసం నిత్యం నినదించే ప్రతినిధులు తమ వాణిని బలంగానే ప్రతిధ్వనింపజేస్తునారు.
ఇలా వరుస వివాదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీజీపీఎస్సీ కాలానుగుణంగా కొన్ని సంస్కరణలకు శ్రీకారం చుట్టినప్పటికీ ఏదో ఒక రూపంలో సరికొత్త వివాదాలు మాత్రం ఇంకా రాజుకుంటూనే ఉన్నాయి. నియామక ప్రక్రియలో భాగంగా టీజీపీఎస్సీ చేపట్టిన కొన్ని విధానాలు, వాటికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకువచ్చిన కొన్ని జీవోలు సరికొత్త వివాదాలకు జీవం పోశాయని మేధావి వర్గం అభిప్రాయపడుతున్నది. వాటిని అధిగమించడం కోసం ఇటీవల టీజీపీఎస్సీ నల్సార్ యూనివర్సిటీతో కలిసి సంయుక్తంగా “పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు ఎదురవుతున్న న్యాయవివాదాలు పరిష్కారం” అనే జాతీయ సదస్సును నిర్వహించింది. ఆ సదస్సు ముగింపు సమావేశంలో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో వివాదాలు తలెత్తకుండా పారదర్శకత పెంచేలా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు పనిచేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా రాజ్యాంగ విలువలను కాపాడుతూ స్వతంత్రంగా సమగ్రతతో నియామకాలు చేపట్టాలని కూడా సూచించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ సంధించిన పలు ప్రశ్నలకు సహేతుకమైన సమాధానం ఇస్తూ ఎంపికైన అభ్యర్థుల పూర్తి వివరాలను బహిర్గతం చేయడం ద్వారా అభ్యర్థులలో పారదర్శకతను పాదుగొల్పాలని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. కనీసం జనరల్ ర్యాంకింగ్ జాబితాలో ప్రిలిమ్స్ మెయిన్స్ హాల్ టికెట్ నంబర్లు, వయస్సు, కేటగిరి, మీడియం, లింగం మరియు పేపర్ వారీగా పొందిన మార్కుల వివరాలు, అట్లే బయోమెట్రిక్ హాజరులో వచ్చిన వ్యత్యాసం మీద వివరణ ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. “చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు” కాకుండా నియామక ప్రక్రియలో భాగంగా విడుదల చేసే జీవోలను ముందస్తుగానే పబ్లిక్ డొమైన్ లో పెట్టి అభ్యంతరాలు ఏమైనా ఉన్నట్లయితే అభ్యర్థుల నుంచి నిర్దేశిత సమయంలో స్వీకరించి ఎలాంటి న్యాయవివాదాలకు తావులేకుండా నియామక ప్రక్రియలను సజావుగా ముందుకు తీసుకుపోవాలని ఇటు అభ్యర్థులు అటు విమర్శకులు, విశ్లేషకులు కోరుకుంటున్నారు. ఆ దిశగా టీజీపీఎస్సీ అడుగులు వేస్తుందని ఆశిద్దాం!
-భాస్కర్ యలకంటి
సోషల్ ఎనలిస్ట్
చరవాణి:8919464488





