– డ్రాలో ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థి
– మిస్సయిన బ్యాలెట్ కౌంటింగ్ గది వెనుక లభ్యం
– దానిపై బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు
– ఉద్దేశపూర్వకంగానే దీన్ని మిస్ చేశారని ఆరోపణ
– ఓడిన పలుగుల ఉమారాణి ఈసీకి ఫిర్యాదు
తుర్కపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 15: తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నిక జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ఓట్ల లెక్కింపులో జరిగిన అవకతవకలు మిస్సైన బ్యాలెట్, అర్ధరాత్రి డ్రా నిర్వహణ చివరికి కాంగ్రెస్ పార్టీ మద్దతున్న అభ్యర్థికి విజయం కట్టబెట్టడంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్‌లో గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనగా మొత్తం 1234 ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా 2 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండటంతో మొత్తం 1236 ఓట్లు లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఓట్ల లెక్కింపు సమయంలో అధికారులు అకస్మాత్తుగా 14 ఓట్లను చెల్లనివిగా ప్రకటించారు. అనంతరం ఒక ఓటు మిస్సయిందని వెల్లడించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. లెక్కింపులో పాల్గొన్న అభ్యర్థుల లెక్కల ప్రకారం, ఆ మిస్సైన ఓటు లెక్కలోకి వచ్చి ఉంటే ఫలితం స్పష్టంగా తేలేదని బాధిత వర్గం ఆరోపిస్తోంది. అయితే ఉద్దేశపూర్వకంగానే ఆ ఓటును పక్కన పెట్టి, మిగిలిన రెండు అభ్యర్థులకు 609 – 609 ఓట్లు సమానంగా ఉన్నట్లు ప్రకటించి డ్రా పరిస్థితిని సృష్టించారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. డ్రా ప్రక్రియను నిర్వహించే ముందు అభ్యర్థుల సంతకాలు తీసుకోకపోవడం, ఎన్నికల నిబంధనలను పూర్తిగా పాటించకపోవడం, అలాగే పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ అర్ధరాత్రి 11:30 గంటల సమయంలో డ్రా నిర్వహించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. చివరకు డ్రా పేరుతో కాంగ్రెస్ పార్టీ మద్దతున్న అభ్యర్థిని విజేతగా ప్రకటించడం రాజకీయ దుమారాన్ని రేపింది. మరో సంచలన అంశం ఏమిటంటే తదుపరి రోజు కౌంటింగ్ హాల్‌ను పరిశీలించిన సమయంలో కిటికీ వెనుక భాగంలో మిస్సైన బ్యాలెట్ పేపర్ లభ్యమైంది. ఆ బ్యాలెట్‌పై కత్తెర గుర్తుతో ఓటు వేసిన స్పష్టమైన గుర్తు ఉండటం అనుమానాలను మరింత బలపరిచింది. ఈ ఓటును లోపల ఉన్న అధికారులు లేదా అభ్యర్థికి సంబంధించిన మద్దతుదారులు ఉద్దేశపూర్వకంగా దాచినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఈ మొత్తం పరిణామాలు ఉమా నవీన్ కుమార్ విజయాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే జరిగాయన్న ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయి. ప్రజలు వేసిన ఓటు విలువను కాలరాసేలా, ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీసేలా అధికారులు వ్యవహరించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై బాధిత అభ్యర్థులు, వారి మద్దతుదారులు సోమవారం జిల్లా కలెక్టర్‌కు, ఎన్నికల ఇన్‌చార్జ్ ఎంపీడీవోకు, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. మిస్సైన ఓటు అంశంపై స్వతంత్ర, నిష్పక్షపాత విచారణ జరిపించాలని, అలాగే రీ–కౌంటింగ్ లేదా రీ–పోలింగ్ నిర్వహించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో, న్యాయం ఎవరి వైపు నిలుస్తుందో వేచి చూడాల్సి ఉంది. వాసాలమర్రి ఎన్నిక కేవలం గ్రామ రాజకీయాలకే పరిమితం కాక ఎన్నికల పారదర్శకతపై పెద్ద ప్రశ్నగా మారాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



